కరోనాకు కళ్లెం వేసేందుకే…

కరోనా… ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే… చైనాలోని వూహాన్‌ ‌నగరంలో ఊపిరి పోసుకున్న ఈ మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం అల్లకల్లోలం చేస్తోంది. కరోనా వైరస్‌ ‌బ్రిటన్‌ ‌పీడకలలా పరిణమించింది. ఇప్పటికే ఎందరోమంది ఈవ్యాధి బారిన పడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరెందరో మంది  మరణించారు.

 

ఇక రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో వైద్యులు పనిభారంతో సతమవతుతున్నారు. ఈనేపథ్యంలో అక్కడి ప్రభుత్వం దేశంలో లైసెన్స్ ఉన్న వైద్యులందరి సేవలు వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగానే తమను ఆదుకోవాలంటూ బెంగుళూరుకు చెందిన రూపకు కూడా మెయిల్‌ ‌ద్వారా విజ్ఞప్తి చేసింది. గతంలో బ్రిటన్‌లో 15 ఏళ్ల పాటు వైద్యురాలిగా పనిచేసిన ఆమెకు యూకే రెసిడెన్స్ ‌పర్మిట్‌తో పాటు జనరల్‌ ‌ప్రాక్టీషనర్‌ ‌లైసెన్స్ ‌కూడా ఉంది. మెయిల్‌ ‌వచ్చిన మరుక్షణమే ఎలాంటి ఆలోచన లేకుండా బ్రిటన్‌కు వెళ్లేందుకు అంగీకరించింది.
బెంగళూరులోని మెడికల్‌ ‌కళాశాలలో ఎంబీబీఎస్‌ ‌పూర్తి చేసిన రూప, 2002లో బ్రిటన్‌ ‌వెళ్లి అక్కడే పీజీ పూర్తి చేసింది. అనంతరం భర్త వెంకటేశ్‌తో కలిసి అక్కడే 15ఏళ్లపాటు వైద్యురాలిగా ఉంది. ఆ తర్వాత ఇండియా వచ్చేసింది. ఇప్పుడు బెంగుళూరులో సొంత క్లినిక్‌ ‌ప్రారంభించాలని ఆమె అనుకున్న ఈ సమయంలోనే బ్రిటన్‌ ‌నుంచి మెయిల్‌ ‌వచ్చేసరికి తన పెద్ద కుమారుడితో బ్రిటన్‌ ‌వెళ్లింది.
బ్రిటన్‌లో పనిచేసిన అనుభవం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు చాలా సహాయపడుతోందని అంటుంది రూప. బ్రిటన్‌లో ఆమె స్వైన్‌ ‌ఫ్లూ రోగులకు స్వయంగా వైద్యం చేశారు. అంతేకాదు ఇరాన్‌ ఇరాక్‌ ‌దేశాల మధ్య జరిగిన కెమికల్‌ ‌యుద్ధంలో గాయపడిన క్షతగాత్రులకు కూడా చికిత్స అందించారు. ఎప్పడూ సమాజహితం కోసం ఏదైనా ఓ మంచి పని చేయాలన్న ఆలోచన నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు నెరవేరింది అని అంటోంది రూప… కరోనా ఉగ్రరూపంతో బ్రిటన్‌ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ ‌చివరి దాకా అక్కడ వైద్య సేవలు అందించేందుకు సమాయత్త మవుతోంది రూప. అత్యవసర సేవల కోసం వెళ్లనున్న ఆమెకు ప్రత్యేక పాస్‌ ‌పోర్టు కూడా అందించింది బ్రిటన్‌ ‌ప్రభుత్వం. అలా సమాజ హితాన్ని కాంక్షించి ఖండాంతరాలను దాటి వైద్యం చేయడానికి ముందుకు వెళ్లింది రూప.

– లతాకమలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *