సంఘ్, సమాజం కలిసి పనిచేయకుండా నక్సలిజం, మత మార్పిళ్లు పరిష్కారం కావు : గిరిజన నేత అర్వింద్ నేతమ్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త వికాస వర్గ -2 ముగింపు ఉత్సవం నాగపూర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గిరిజన నేత, కాంగ్రెస్ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి అర్వింద్ నేతమ్ హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు ఆయన సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్‌తో కలిసి డాక్టర్జీ స్మృతి మందిరాన్ని సందర్శించి డాక్టర్జీ విగ్రహానికి పూలు సమర్పించారు. తదనంతరం జరిగిన సమాపన్ ఉత్సవంలో అర్వింద్ నేతమ్ మాట్లాడుతూ… ఈ సమారోప్ ఉత్సవానికి తనను ముఖ్య అతిథిగా పిలిచినందుకు సంఘ్‌కి ధన్యవాదాలు ప్రకటించారు.
రెండు రోజులుగా నాగపూర్‌లోనే వున్నానని, సంఘ కార్యక్రమాలను దగ్గరినుంచే చూసే వీలుకలిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. సంఘ్‌తో గానీ, కార్యక్రమాలతో గానీ గతంలో తనకు ఎలాంటి పరిచయం లేదని, కానీ… సంఘ్ గురించి విన్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం సంఘ్ శతాబ్ది నడుస్తోందని, అందుకే ఈ సమయం అత్యంత మహత్వపూర్ణమైందని అభివర్ణించారు. చాలా సంవత్సరాలుగా విజయయాత్ర చేస్తూ.. సంఘ్ శతాబ్దికి చేరుకుందని, దేశ సేవలో గానీ, దేశ అఖండతను కాపాడటంలో గానీ, దేశాన్ని కలిపివుంచడంలో గానీ, సామాజిక సమరసత కోసం సంఘ్ చేస్తున్న కార్యక్రమాలను ఏ సంస్థా ఇప్పటి వరకు చేయనేలేదని తేల్చి చెప్పారు.
రాజకీయాలకు కొన్ని రోజులుగా తాను దూరంగా వున్నానని, కానీ.. సమాజ సేవలో నిమగ్నమై వున్నానని అర్వింద్ నేతమ్ అన్నారు. ప్రస్తుతం గిరిజన సమాజం అత్యంత క్లిష్టపరిస్థితుల్లో వుందని, ఈ సమస్యలను సంఘం దృష్టికి, సంఘ పదాధికారుల దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నానని అన్నారు.

అక్రమ మతమార్పిళ్లే దేశంలో ప్రధాన సమస్యగా మారిందన్నదన్నది తన బలమైన అభిప్రాయమని, దీనిని అత్యంత తీవ్రమైన సమస్యగా ఏ ప్రభుత్వమూ చూడలేదన్నారు. ఈ విషయంలో అధికారంలో వున్న ప్రభుత్వం గత ప్రభుత్వంపైన, గత ప్రభుత్వం, అంతకు ముందున్న ప్రభుత్వంపైన తోసేయడం తప్పించి, దీని విషయంలో పరిష్కారం మాత్రం చూపలేదన్నారు. గత కొన్ని రోజులుగా ఇదే తంతు కొనసాగుతోందని తెలిపారు.
కానీ.. ఈ పని పూర్తి చేయడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాత్రమే మార్గం చూపుతున్నదని, ఈ విషయంలో తనకు పూర్తి మద్దతిస్తుందని బలంగా అనుకుంటున్నానని అర్వింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడే కాదు… చాలా సంవత్సరాలుగా ఈ సమస్యపై సంఘ్ పని చేస్తూనే వుందని నొక్కి వక్కాణించారు.
తాను బస్తర్ ప్రాంతం నుంచి వచ్చానని రెండు ప్రధాన సమస్యలు ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో మొదటిది నక్సలిజం సమస్య, మరోది బలవంతపు మత మార్పిళ్లు అని వివరించారు. ఈ సమస్యలతో ఆ ప్రాంతం చాలా సతమతమవుతోందని, వీటిని పరిష్కరించడానికి వనవాసీ సమాజం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కలిసి ఏదో ఒకటి చేయాల్సి వుంటుందన్నారు.సంఘ్‌కి , వనవాసులకు సైద్ధాంతికంగా కొంత అంతరం వుందని, దీనిని తగ్గించి, సమాజానికి ఓ కొత్త మార్గదర్శనం లభించాలన్నారు. దీని కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని రోజుల క్రితం ఓ సమాజ కార్యక్రమాన్ని నిర్వహించానని, ఆ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధికారులను, రాంలాల్‌ని ముఖ్య అతిథిగా పిలిచానని గుర్తు చేశారు. దీంతో కొన్ని వర్గాలు విమర్శించాయని, ఆయన ఉపన్యాసంతో చాలా అపోహలు దూరమయ్యాయని ప్రకటించారు. దీంతో సంఘ్‌పై కాస్త ఆసక్తి కూడా పెరిగిందన్నారు. ఈ విషయంలో తాను కూడా మరింత ప్రయత్నం చేస్తానని అర్వింద్ ప్రకటించారు.
అలాగే ఈ కార్యక్రమం తర్వాత అక్రమ మత మార్పిళ్ల విషయంలో ఛత్తీస్ గఢ్ అంతటా తీవ్రంగా చర్చ జరుగుతోందని, అలాగే సమాజ ఏకత్రీకరణ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి కీలక సమయంలో సంఘ్ నుంచి తమకు మద్దతు కావాలని, దీంతో కచ్చితమైన ఫలితం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మద్దతు, చేయి లేకుండా సమాజం ఏ పనీ చేయలేదని, ఇది తన బలమైన అభిప్రాయమన్నారు. ఈ విషయంలో తనకు సంఘ్ పూర్తి మద్దతివ్వాలని కోరుతున్నానని అర్వింద్ అన్నారు.
ఇక… రెండో అంశం నక్సలిజమని, ఇది కూడా ప్రధాన సమస్యగా నిలుస్తోందన్నారు. కానీ.. బస్తర్ ప్రాంతంలో నక్సలిజానికి కేంద్ర ప్రభుత్వం సరైన బుద్ధి చెబుతోందన్నారు. సమర్థవంతంగా ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అయితే.. నక్సలిజం అంతమైందని భారత ప్రభుత్వం అలసత్వం వహిస్తే.. ఆ సమస్య మళ్లీ పెరిగే అవకాశం మాత్రం కచ్చితంగా వుందని హెచ్చరించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా మెళుకువతో, జాగరూకతతో వుండాలని సూచించారు.

ఈ అంశంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిందేనని ఈ గిరిజన నేత సూచించారు. కేంద్రం కూడా ఎలాంటి యోజన చేయాలంటే… శాశ్వతంగా నక్సలిజం అంతం కావాలని, మళ్లీ ఎవ్వరూ అటువైపు వెళ్లకుండా వుండే యోజన చేయాలని బలంగా అభిప్రాయపడ్డారు. ఇది అత్యంత ఆవశ్యకమైందన్నారు. లేదంటే నక్సలిజం మళ్లీ వేళ్లూనుకునే ప్రమాదం మాత్రం కచ్చితంగా వుందన్నారు.
ఈ క్రమంలో పారిశ్రామికీకరణ లేకుండా పురోగతి సాధ్యమే కాదన్నారు. దీనిని తాను కూడా అంగీకరిస్తున్నానని, కానీ.. దీని విషయంలో వలస వెళ్లే విషయంపై గిరిజనులు మాత్రమే ఇబ్బందులు పడాలా అని ప్రశ్నించారు. జల్, జంగల్, జమీన్ కోసం 150 సంవత్సరాల క్రితం గిరిజనులు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఇప్పుడు అదే జల్ జంగల్ జమీన్ అనే సమస్య ఇబ్బందుల్లో వుందన్నారు. దీనిని కేంద్రం సీరియస్‌గా ఆలోచించాలని సూచించారు.
ఒకప్పుడంటే భూమి బాగా వుండేది. కానీ.. ఇప్పుడు లేదని, మరి వనవాసులు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. దీనిపై సంఘ్ ఆలోచించాలని కోరారు. అభివృద్ధికి తానేమీ వ్యతిరేకం కాదని, కానీ అభివృద్ధి అన్న దానిలో సమాజం కూడా భాగస్వామ్యం కావాలన్నారు. దీనికి సమన్వయం ఎలా అనేది, వనవాసులు ఎలా భాగస్వామ్యం కావాలో సంఘ్ ఓ ప్రణాళిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే వనవాసుల ప్రాంతంలో భూసేకరణ జరుగుతుందని, దానిని ఆపాలన్నారు. లీజు కింద తీసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. గిరిజనులు కార్మికుడి నుంచి యజమాని కావడాన్ని ఒప్పుకుంటాడు. కానీ.. యజమాని నుంచి కార్మికుడిగా మారడాన్ని మాత్రం ఒప్పుకోరని అన్నారు. వీటన్నింటి విషయంలో ఛత్తీస్‌గఢ్‌లో ఓ కమిటీ వేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్లు అరవింద్ నేతమ్ పేర్కొన్నారు.
సమాపన్ ఉత్సవంలో భాగంగా స్వయంసేవకులు తాము నేర్చుకున్న ప్రదర్శించిన వాద్య ఘోష్, దండ యుద్ధ, నియుద్ధ, సాంఘిక గీత్, వ్యాయామ్ యోగ్, క్రీడా పాటవాలను అర్వింద్ నేతమ్ సహా అతిథులందరూ ఆసక్తిగా తిలకించారు.