అతి తక్కువ పెట్టుబడి, సేంద్రీయ పద్దతిలో కొత్తిమీర పంటలో లాభం ఆర్జించిన రైతు
కొంత ధైర్యం చేశాడు. మరికొంత ఆలోచించాడు. సంప్రదాయక పంటలపైనే కాకుండా వాణిజ్య పంటలపై కూడా దృష్టి సారించాడు. అతి తక్కువ సమయంలో పంటలను సాగుచేస్తూ, అధిక లాభాలను ఆర్జించాలని భావించాడు. డిమాండ్‌కి అనుగుణంగా సేంద్రీయ ఎరువుల సాయంతో కొత్తిమీర పంటను పండిరచాడు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు కొమ్ముల సాయారెడ్డి అతి తక్కువ సమయంలో కొత్తిమీర పంటతో లాభాలు గడిరచి, మిగతా రైతులకు ఆదర్శంగా నిలిచారు. తనకున్న 13 ఎకరాల వ్యవసాయ భూమి వుంది. అందులో వరి, పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న పంటలను సాగు చేస్తున్నారు.
వీటితో పాటు కేవలం రెండు ఎకరాల్లో అర ఎకరం చొప్పున నాలుగు విడతలుగా కొత్తిమీర పంటను కూడా సాగుచేశాడు. జనవరి మొదటి మాసంలో అర ఎకరంలో ఈ పంట వేశాడు. సాగు చేసిన 50 రోజుల్లోనే దగ్గర దగ్గరగా 45 నుంచి 50 రూపాయలు సంపాదించుకున్నాడు. పంట కూడా బాగా వుండటంతో కావలసిన వారు ఏకంగా వ్యవసాయ క్షేత్రానికే వచ్చి కొత్తిమీరను తీసుకెళ్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ బాగా కావడంతో, దీనిని దృష్టిలో పెట్టుకొనే కొత్తిమీర పంటను సాగు చేసినట్లు సాయారెడ్డి చెప్పుకొచ్చాడు. అయితే కొత్తిమీర సాగుకు అతి తక్కువ డబ్బులే ఖర్చు అయ్యాయని, ఎకరానికి విత్తనాలకు 7 వేలు, సస్య రక్షణకు, ఎరువులకు 13 వేల రూపాయలు అయ్యాయని తెలిపాడు. ఇవన్నీ పోగా…. ఎకరానికి ఏకంగా 70 వేల రూపాయలు గిట్టుబాటు అయ్యిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇంత కొత్తిమీర పంట కేవలం సేంద్రీయ ఎరువులతోనే పండిరచినట్లు తెలిపాడు.
– సాక్షి పత్రిక సౌజన్యం తో