గోశాల కేంద్రంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ స్వావలంబనకు యోజన చేసిన యూపీ
స్థానికంగా వుండే వనరులు, సంప్రదాయ పద్ధతుల ఆధారంగా కొత్తగా గ్రామీణ ఆవిష్కరణలు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.అంతేకాకుండా గో ఆధారిత ఆవిష్కరణలను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకు గాను యూపీలోని 75 జిల్లాల్లో పంచగవ్య ఔషధం, గో పెయింట్స్, సేంద్రీయ ఎరువుల యూనిట్లను ప్రారంభించాలని నిర్ణయించింది.
ఈ యోజన ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఓ గోశాలను ఏర్పాటు చేసి, స్వావలంబన మోడల్ యూనిట్ గా అభివృద్ధి చేస్తారు. ఇది గో సంరక్షణ కేంద్రంగా మాత్రమే కాకుండా, సేంద్రీయ ఎరువుల యూనిట్లుగా, పంచగవ్య ఆధారిత ఉత్పత్తుల ఉత్పత్తి కేంద్రంగా కూడా మారనుంది. దీనికి గాను ‘‘ఒక జిల్లా – ఓ ఆవిష్కరణ (“One District, One Innovation”) నమూనాను తయారు చేయనుంది.ఇలా చేయడం ద్వారా స్థానికంగా వుండే యువతకు, మహిళా స్వయంసహాయక బృందాలకు ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని, గ్రామాల్లో కూడా గో ఆధారిత స్వావలంబన చేకూరుతుందని నిర్ణయించారు. దీనికి గాను ఉపయోగపడే శిక్షణతో పాటు మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వమే అందిస్తుంది.

ప్రభుత్వం యోజన చేసిన ఈ రకమైన విధానం గ్రామీణాభివృద్ధికి బాగా తోడ్పాటునిస్తుందని, ప్రతి జిల్లా కూడా గ్రామీణ క్షేత్రంలో వికసిస్తుందని అంచనా. గోశాలలు ఏర్పాటు చేయడం, గోసంరక్షణ కేంద్రాల వృద్ధి ద్వారా గోబర్ గ్యాసులు, ఆవు పేడకు సంబంధించిన బ్లాకులను ఏర్పాటు చేయడం, బయోగ్యాస్ తో పాటు పంచగవ్య ఆధారిత ఔషధాలు, సేంద్రీయ విత్తనాలు, ఎరువులు, గో ఆధారిత ఉత్పత్తులను తీసుకురావొచ్చు. దీని ద్వారా పది మందికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. అలాగే స్థిరమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా సృష్టించొచ్చు.
మరోవైపు మహిళా స్వయంసహాయక సంఘాలు, గ్రామీణ యువతకు పంచగవ్య ఉత్పత్తుల తయారీ, వాటి ప్యాకింగ్, మార్కెటింగ్ చేయడంపై కూడా ప్రభుత్వమే శిక్షణను ఇస్తుంది. దీనికి గాను నిపుణులను కూడా ఏర్పాటు చేయనుంది. తమ సొంత గ్రామాన్ని విడిచి, ఉపాధి కోసం ఎక్కడికో వలస వెళ్లకుండా… తమ సొంత గ్రామంలోనే ఉపాధి పొందవచ్చని, పట్టణాలకు కూడా వలసను తగ్గించవచ్చన్నది ప్రభుత్వం యోజన.
‘‘ఆత్మ నిర్భర్ గోశాల’’ ల గుర్తింపు
రాష్ట్రంలోని 75 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా ఓ గోశాలను ప్రభుత్వం గుర్తిస్తుంది. దానిని ‘‘ఆత్మ నిర్భర గోశాల’’ లేదా స్వావలంబన గోశాలగా అభివృద్ధి చేస్తుంది. ఇవి కేవలం గోవులను రక్షించడానికే కాకుండా మరిన్ని విస్తృత ప్రయోజనాలను తెచ్చిపెడతాయని అధికారులు వివరించారు. వీటి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలా రూపుదిద్దుకుంటుంది? పర్యావరణం ఎలా రక్షించబడుతుంది? గోమాత ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలు చేయవచ్చన్నది వీటి ద్వారా అవగాహన తెచ్చిపెడతామని అధికారులు తెలిపారు. ఇందులోనే బయోగ్యాస్ ప్లాంట్ కూడా వుంటుంది. దీని ద్వారా గోశాలల సమీపంలో వుండే ఇళ్లు, చిన్నతరహా పరిశ్రమల్లో విద్యుదుత్పత్తికి కూడా ఉపయోగిస్తారు.ఇక నిర్మాణాల్లో కూడా చౌకైన ప్రత్యామ్నాయంగా దీనిని వినియోగిస్తారు.
అలాగే గోఆధారిత ఉత్పత్తులపై అవగాహన పెంచడం, వాటి ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలను చూపెడుతూ.. ఇతరులు కూడా ప్రేరణ పొంది, ఈ మార్గంలో వచ్చేలా చేయనున్నారు. అలాగే పంచగవ్య ఉత్పత్తులను తయారు చేయడానికి శిక్షణ, వాటి ద్వారా చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు చేయడంపై కూడా తమ దృష్టి వుందని అధికారులు వివరించారు. ఈ చొరవ సంప్రదాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసే రైతులు ఎలా లాభపడుతున్నారు? వాటి ద్వారా ఎలా ఉపాధిని పొందవచ్చు? గ్రామాల్లో పర్యావరణ అనుకూల అభివృద్ధిని ప్రోత్సహించే స్థిరమైన వ్యాపారాలు ఎలా చేయవచ్చో ఈ గోశాలల ఆధారంగా ప్రజలకు ప్రాక్టికల్ గా వివరించనున్నారు.
విస్తృత స్థాయిలో శిక్షణా కేంద్రాల ఏర్పాటు..
గో ఆధారిత వ్యవసాయం, గో ఆధారిత ఉత్పత్తుల శిక్షణ, మార్కెటింగ్, ఉత్పత్తుల తయారీపై విస్తృత స్థాయిలో గ్రామీణ మహిళలకు, గ్రామీణ యువతకు యూపీ ప్రభుత్వం శిక్షణ కూడా ఇస్తుంది. స్వయం సహాయక బృందాలకు కూడా ఇందులో చోటు కల్పిస్తారు. గోమయం, గోమూత్రం ద్వారా ఎలాంటి ఉత్పత్తులు తయారు చేయవచ్చు? వాటిని మార్కెంటిగ్ చేసే విషయాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తారు. అలాగే పంచగవ్య ఆధారిత మూలికా మందులు, ఆవు పేడతో తయారు చేసిన ఇటుకలు, దిమ్మెలు, గో ఆధారిత పేయింట్స్, పర్యావరణ అనుకూల వస్తువులు, సేంద్రీయ ఎరువులు, బయో విత్తనాల తయారీపై కూడా శిక్షణనిస్తారు.
ఈ శిక్షణ పూర్తి అయిన తర్వాత ఇందులో పాల్గొన్న వారు ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, పంపిణీ ఈ మొత్తం ప్రక్రియలో ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు. దీని ద్వారా ఆదాయాన్ని సంపాదించడమే కాకుండా నైపుణ్యాలు, సహజ వనరులతోనే ఉపాధి పొందడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతంది. యువతకు స్వావలంబన చేకూరుతుంది.