మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో క్రీడా మైదానాల అభివృద్ధికి ముందుకొచ్చిన ‘‘టెండూల్కర్ ట్రస్ట్’’

ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దంతేవాడ జిల్లాలో 50 ఆట స్థలాలను అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు.‘‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’’ ద్వారా మావోయిస్టు ప్రభావిత దంతేవాడ జిల్లాలో 50 ఆట స్థలాలు, క్రీడా సముదాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. వీరికి ‘‘మాన్ దేశీ ఫౌండేషన్’’ కూడా చేతులు కలపనుంది. ఇలా చేయడం ద్వారా మారుమూల ప్రాంతంలో వున్న క్రీడాకారులు తమ కలలను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని, అందుకే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్ట్ పేర్కొంది.

బస్తర్ జిల్లాలో 13 రకాల ప్రత్యేకమైన ఆటలకు 20 ఆట స్థలాల అభివృద్ధి ఇప్పటికే పూర్తైంది. ఈ 20 ఆటస్థలాలూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే వున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ యేడాది అక్టోబర్ నాటికి 50 క్రీడా మైదానాల అభివృద్ధి పూర్తి కానున్నాయి. చివరి దశలో మరో 50 అందుబాటులోకి రానున్నాయి.

అయితే.. మరో కీలక నిర్ణయం కూడా టెండూల్కర్ ట్రస్ట్ తీసుకుంది. వీటికి కాంట్రాక్టర్లను కేటాయించడం లేదు. కేవలం స్థానిక గ్రామస్థుల సహాయంతోనే ఈ క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ అభివృద్ధికి అవసరమైన సామాగ్రి, క్రీడా పరికరాలను మాత్రమే ట్రస్ట్ సమకూరుస్తుంది. యువతకు తమ బాధ్యతలు తెలిసి రావాలని, అలాగే క్రీడల వైపు ఆకర్షితులు కావడానికే ఇలా చేస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది.

ఇటీవలి కాలంలో మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచివేస్తోంది. చాలా మంది లొంగిపోయారు కూడా. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగిరం చేస్తోంది. ఈ అభివృద్ధి పనులకు టెండూల్కర్ ఫౌండేషన్ మరింత ఊతాన్నిస్తోంది.

ఇక.. క్రీడల ద్వారా మావోయిస్టు ప్రభావిత యువతను ఆకర్షించాలని కేంద్రం ముందుకు వచ్చింది. 2024 లో ‘‘బస్తర్ ఒలంపిక్స్’’ ను కూడా నిర్వహించింది. యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.1.6 లక్షలకు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *