మావోయిస్ట్ లను ఎదిరించి తమ రామాలయాన్ని తిరిగి తెరిపించుకున్న గ్రామస్తులు
అది అత్యంత పురాతన రామాలయం. కానీ… ప్రజాస్వామిక వ్యతిరేక శక్తులుగా వున్న మావోయిస్టులు తమ కార్యకలాపాల కోసం రామాలయం అడ్డొస్తోందంటూ దానిని బలవంతంగా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, మూసేయించారు. అలా 21 సంవత్సరాల పాటు రాముడికి ఎలాంటి పూజలూ జరగలేదు. తలుపులు కూడా తెరుచుకోలేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని లఖాపాల్, కేరళపెండా గ్రామాలు పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. ఈ ప్రాంతంలోనే అత్యంత పురాతన రామాలయం వుంది. 1970 ప్రాంతాల్లో ఓ బిహారీ మహారాజు ఈ రామాలయాన్ని నిర్మించారు. 2003 లో మావోయిస్టులు ఈ దేవాలయాన్ని మూసేశారు. దీంతో అక్కడి గ్రామస్థులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారు. 21 సంవత్సరాలు చూసి చూసి… అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని అక్కడి ప్రజలు స్ఫూర్తివంతంగా తీసుకున్నారు.
ఈ రామాలయాన్ని ఎలాగైనా తెరిపించాలంటూ గ్రామస్థులు అడిగారు. అడగడమే తరువాయి… సీఆర్పీఎఫ్ బలగాలే హనుమంతునిలాగా వచ్చి, చొరవ చూపించారు. దీంతో ఇన్ని సంవత్సరాల పాటు తాళం వేసి వున్న రామ మందిర తలుపులను తెరిచారు బలగాలు. ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు. అంతేఆకుండా గ్రామ ప్రజల సాయంతో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాల తర్వాత బలగాలు ఈ రామ మందిరాన్ని తిరిగి గ్రామ పెద్దలకు అప్పగించారు. ఇలా ఆలయాన్ని తెరిపించడం ద్వారా, ప్రజలు మావోయిస్టు ఉద్యమం వైపు వెళ్లకుండా వుంటారని, గ్రామ ప్రజలు కూడా జనజీవన స్రవంతిలో కలుస్తారని భావించారు.
1970 లో ఆలయ నిర్మాణం జరిగిందట…
స్థానికుల కథనం ప్రకారం 1970 లో ఓ బిహారీ రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ సమయంలో గ్రామస్థులు సుమారు 80 కిలోమీటర్ల మేర నడిచి, ఆలయానికి అవసరమైన సామాగ్రిని అత్యంత భక్తిశ్రద్ధలతో సమకూర్చినట్లు పేర్కొంటున్నారు. అయితే.. ప్రయాణానికి అవసరమైన దారి గానీ, ఇతరత్రా సౌకర్యాలు కూడా అప్పట్లో లేవు. అయినా సరే.. రాముడిపై అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఆలయానికి కావల్సిన సామాగ్రిని సమకూర్చారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి గకాగానే గ్రామంలో చాలా మంది మాంసాహారం, మద్యాన్ని వదిలేశారు. దీంతో ప్రజలందరూ భక్తి మార్గంలో వుండటంతో, నక్సలైట్లకు నిరోధకంగా మారిపోయింది. దీంతో ఆలయంలో పూజలు చేయవద్దంటూ బెదిరింపులకు దిగి, నిషేధం విధించారు.