కుటుంబాలను, సాంస్కృతిక విలువలను బలహీనపరచడమే కల్చరల్ మార్క్సిజం లక్ష్యం : పుస్తకావిష్కరణలో వక్తలు

దీర్ఘకాలిక భావజాల పోరాటం ద్వారా సాంప్రదాయ సంస్థలను, కుటుంబ వ్యవస్థలను, సాంస్కృతిక విలువలను బలహీనపరచడమే కల్చరల్ మార్క్సిజం ముఖ్య లక్ష్యమని సీనియర్ జర్నలిస్టు, తెలుగు అనువాదకులు వేదుల నరసింహం పేర్కొన్నారు. డా. నిరంజన్ బి. పూజార్ ఆంగ్లంలో రచించిన “కల్చరల్ మార్క్సిజం: ది వార్ ఆన్ ఇంటెలెక్చువల్ డిస్క్రిషన్” పుస్తక తెలుగు అనువాదాన్ని హైదరాబాద్ సంతోష్‌నగర్‌లోని మారుతీనగర్ కమ్యూనిటీ హాల్‌లో మేధావులు, సామాజిక కార్యకర్తల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. సంవిత్ ప్రకాశన్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

సమాజంపై కల్చరల్ మార్క్సిజం ప్రభావం

​ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగు అనువాదకులు, సీనియర్ జర్నలిస్టు  వేదుల నరసింహం, పుస్తకంలోని ప్రధాన అంశాలను విపులంగా వివరించారు. సమాజం, సంస్కృతి, విద్యా వ్యవస్థలు, సామాజిక సంస్థలపై కల్చరల్ మార్క్సిజం ప్రభావాన్ని ఈ పుస్తకం విశ్లేషిస్తుందని తెలిపారు. భారతీయ సమాజం ఎదుర్కొంటున్న సాంస్కృతిక సవాళ్లను ఈ గ్రంథం చర్చిస్తుందని పేర్కొన్నారు.

​కల్చరల్ మార్క్సిస్టులు హిందూ కుటుంబ వ్యవస్థను, భారతీయ సంస్కృతిని బలహీనపరిచేందుకు ప్రయత్నించారని పుస్తక రచయిత విశ్లేషించినట్లు నరసింహం చెప్పారు. సమాజంలో విభేదాలు, వర్గ వైరాలు, జాతి ఆధారిత ఉద్రిక్తతలను సృష్టించడం ద్వారా అస్థిరతను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని పుస్తకంలో చర్చించారని తెలిపారు.

​సమాజంలో గందరగోళాన్ని సృష్టించడం, సంప్రదాయ ఆచార వ్యవహారాలను ప్రశ్నించడం, “క్యాన్సిల్ కల్చర్”ను ప్రోత్సహించడం, లైంగిక విద్య పేరుతో సాంప్రదాయ విలువలను సవాలు చేయడం వంటి అంశాలను రచయిత ప్రస్తావించారని తెలిపారు. దేశభక్తి భావనను బలహీనపరిచే ధోరణులు, జాతీయ గుర్తింపుపై దాడులు కూడా ఈ పుస్తకంలో చర్చించబడ్డాయని పేర్కొన్నారు.

​అక్రమ చొరబాటుదారులు, విదేశీయుల ప్రవేశాన్ని ప్రోత్సహించడం, సామాజిక అశాంతిని పెంచడం, మద్యం వినియోగాన్ని విస్తరించడం, ప్రజలను దేవాలయాలకు దూరం చేయడం వంటి పరిణామాల వల్ల సమాజం దెబ్బతింటుందని రచయిత అభిప్రాయపడినట్లు వివరించారు.

​న్యాయవ్యవస్థపై వ్యతిరేక భావజాలాన్ని పెంచడం, భారత్ వ్యతిరేక ఆలోచనలను వ్యాప్తి చేయడం, నైతిక విలువలు, మతబోధనలతో పాటు ముఖ్యంగా హిందూ ఆలయాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలను బలహీనపరిచే ప్రయత్నాలపై కూడా పుస్తకం దృష్టి సారించిందని తెలిపారు.

​కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం, సమాజంలో నైతిక విలువలను దెబ్బతీయడం, భద్రతా దళాలపై నిరంతర విమర్శల ద్వారా వారి మనోధైర్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను కూడా రచయిత విశ్లేషించారని నరసింహం పేర్కొన్నారు. అలాగే మీడియా పాత్రపై కూడా పుస్తకంలో చర్చించబడిందని, ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంతో సహా కొన్ని వామపక్ష భావజాల ప్రభావిత మీడియా వేదికలు, చర్చా కార్యక్రమాలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నాయని రచయిత అభిప్రాయపడినట్లు వివరించారు.

​భారత స్వాతంత్రోద్యమ కాలంలో దేశంలో రెండు ప్రధాన భావజాల ప్రవాహాలు ఉన్నాయని నరసింహం అన్నారు. ఒకటి కమ్యూనిజం కాగా, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్ అని పేర్కొన్నారు. ఈ రెండు సంస్థలు 1925లో ప్రారంభమయ్యాయని, ఇప్పుడు శతాబ్ద కాలాన్ని పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు.

​కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చరిత్రను ప్రస్తావిస్తూ, స్వాతంత్ర్య పోరాటంలోని కొన్ని దశల్లో కమ్యూనిస్టులు బ్రిటిష్ పాలకులకు మద్దతు ఇచ్చారని, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను వ్యతిరేకించారని విమర్శించారు.

మేధోపరమైన చర్చల ఆవశ్యకత

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మారుతీనగర్ కాలనీ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త కందుకూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజం, సంస్కృతి, భావజాలాలపై ఇలాంటి మేధోపరమైన చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందుబాటులోకి తెచ్చినందుకు ఆయన అభినందనలు తెలిపారు.

సంవిత్ ప్రకాశన్ ప్రచురణల ప్రస్థానం

సంవిత్ ప్రకాశన్ డైరెక్టర్ శైలజ గారు మాట్లాడుతూ.. ప్రగతిశీల ఆలోచనలు, సామాజిక సంస్కరణల పేరుతో సాంప్రదాయ విలువలను, కుటుంబ వ్యవస్థను బలహీనపరిచే ధోరణులను గుర్తించి, వాటిపై చర్చ జరపడమే ఈ గ్రంథం ఉద్దేశమని చెప్పారు.తమ సంస్థ ద్వారా ఇప్పటివరకు తెలుగు, ఆంగ్లం, తమిళం, కన్నడ భాషల్లో చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రం, సమకాలీన అంశాలపై దాదాపు 70 పుస్తకాలను ప్రచురించామని తెలిపారు. ముఖ్యమైన గ్రంథాలను భారతీయ భాషల్లోకి అనువదించి విస్తృత పాఠక వర్గానికి చేరవేయడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, సామాజిక కార్యకర్తలు, పాఠకులు పాల్గొని పుస్తకంలోని అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *