వనవాసీ గూడెల్లో ‘‘దండారీ పండుగ సందడి’’… పది రోజుల పాటు గూడెల్లో వినోదం

వనవాసీ గూడాల్లో ప్రతియేటా వైభవంగా జరుపుకునే దండారీ పండుగ సందడి ప్రారంభమైంది. డప్పుల దరువులు, గజ్జల మోతలు, గుస్సాడీ నృత్యాలతో అంగరంగ వైభవంగా పండుగ సాగనుంది. దండారీ అంటే వనవాసీ గూడాల్లో 10 రోజుల పాటు జరుపుకునే ఓ వినోదం. ఏటా వనవాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే తమ దేవత ఏత్మాసూర్ పేన్ పూజతో ఈ పండగ ప్రారంభం. చివరికి కొలబోడి వేడుకతో ముగుస్తుంది. ఈ దండారీ పండగ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. అశ్వీయుజ పౌర్ణమి అనంతరం పది రోజుల పాటు సాగే ఈ వేడకు తరతరాలుగా వస్తోంది. వనవాసీ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ముఖ్య పండుగ. అలాగే ఈ సమయంలో వీరు చేపట్టే దీక్ష కూడా అంతే కఠినం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక పండుగగా గుర్తించింది. ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తూ వస్తోంది.

ఈ దండారి పండుగను జరుపుకునేందుకు వనవాసీలు సిద్ధమవుతున్నారు. పది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ భోగి పండుగతో మాలధారణ వేసినప్పటి నుంచి దీక్ష ప్రారంభమవుతుంది. వీరు పాడే గోండి పాటలు, గుస్సాడీ నృత్యాలు, కోలాటాలు, హాస్యనాటికల ప్రదర్శనలు, భక్తి పాటల కార్యక్రమాలను తిలకించేందుకు వివిధ గ్రామాలు, పట్టణాల ప్రజలు అక్కడి వస్తుంటారు. దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు స్నానాలు చేయరు. కాళ్లకు పాదరక్షలు ధరించరు. కేవలం నేలపైనే నిద్రిస్తారు. ఇది తరతరాల సంప్రదాయంగా వస్తోంది.

గుస్సాడీలదే కీలక పాత్ర….

ఈ మొత్తం రోజుల్లో గుస్సాడీలదే కీలక పాత్ర. అంటే గురు అని అర్థం. నెత్తిన నెమలి పింఛం, దుప్పి కొమ్ములు, పింఛం మధ్యలో మెరిసే అద్దం, భుజానికి జింక తోలు, నడుము, కాళ్లకు గజ్జెలతో పాటు మెడలో రుద్రాక్షలు, ఒంటినిండా విభూతి పూసుకొని కనిపిస్తారు. వీరిని వనవాసీ సంప్రదాయంలో గురు అని పిలుస్తారు. గురు అనగా ఆదివాసీల దేవుని ప్రతిరూపంగా భావిస్తారు. గుస్సాడీల్లో మరో ప్రత్యేక పాత్ర ‘‘పోరీ’’. ఆడ వేషధారణలో వుండే వారిని పోరీ అని పిలుస్తారు. వీరి ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుందని నమ్మకం.

ఒక ఊరు నుంచి మరో ఊరికి

దండారీ పండుగ అంటేనే వనవాసీ సంఘటనకు నిదర్శనం. ఐకమత్యానికి ప్రతీక. ఈ పండుగ సందర్భంలో వనవాసీలు ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్తారు. అయితే రాత్రి సమయంలోనే వెళ్తారు. బృందాలు బృందాలుగానే వెళ్లడం ఆనవాయితీ. ఇలా వెళ్తే ఒకరితో మరొకరికి బంధం బలపడుతుందని అంటారు. రాత్రులు నృత్యాలు, గోండి నృత్యాలు, డాన్సులు, ప్రదర్శనలు వుంటాయి. రాత్రంతా వుంటాయి ఇవి. మళ్లీ ఉదయం కాగానే మాన్ కోలాతో నృత్య ప్రదర్శనలు చేస్తారు. సార్ కోలాతో ఇది ముగుస్తుంది. ఈ సందర్భంగా వచ్చిన అతిథులను సకల మర్యాదలు చేస్తారు. ప్రత్యేక విందు ఇచ్చిన తర్వాతే వీడ్కోలు పలుకుతారు. దండారి పండగ వేళ వీరు కొలిచే ప్రధాన దేవత ‘‘పద్మల్ పురికాకో’’.

వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా గూడెల్లో ఈ కార్యక్రమాలు జరుగతాయి. దీపావళి మరుసటి రోజు కొలబోడి అన్న సంప్రదాయం ఆచరించి, ఈ వేడుకలను ముగిస్తారు. ఈ దండారీ బృందం ఇంటింటికీ వెళ్లి దర్శనమిస్తారు. ఈ సమయంలో గృహిణి వీరికి ధాన్యాలు, తోచినంత నగదు ఇచ్చి, హారతి ఇచ్చే పంపిస్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *