గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోనూ సంఘ్ విస్తరించింది : హోసబళే
గత యేడాదిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థాగతంగా బాగా విస్తరించిందని ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. యేడాదిలోనే 6 వేల శాఖలు పెరిగాయని, 88 వేలకు చేరుకున్నాయని అన్నారు. అలాగే స్థానాల్లోనూ వృద్ధి చెందాయని తెలిపారు.వీటితో పాటు శాఖా సాప్తాహిక్ మిళన్ల సంఖ్య కూడా పెరిగిందన్నారు. అండమాన్, అరుణాచల్ ప్రదేశ్, లేహ్ లాంటి ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలలో కూడా దైనందిన శాఖలు నడుస్తున్నాయని, సంఘ్ శాఖలు చురుగ్గా పనిచేస్తున్నాయని ప్రకటించారు. సంఘ కార్య శతాబ్దిలో ఈ విస్తరణ ప్రస్ఫుటంగా ద్యోతకం అవుతూనే వుందన్నారు. అలాగే గిరిజన ప్రాంతాలలో, మారుమూల, సంక్లిష్ట ప్రాంతాలకూ సంఘ్ విస్తరించిందన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ మూడు రోజుల సమావేశాల సందర్భంగా ఆదివారం దత్తాత్రేయ హోసబళే, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలకు 1,487 మంది ప్రతినిధులు వచ్చారని, దేశ వ్యాప్తంగా 46 ప్రాంతాల నుంచి ప్రతినిధులు వచ్చారన్నారు. ఈ సమావేశంలో సంఘ్ కార్యకలాపాల విస్తరణను సమీక్షించామని, సంఘ కార్య శతాబ్ది సందర్భంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలపై సమీక్ష కూడా జరిగిందన్నారు.ఈ చర్చ జరుగుతున్న సమయంలో సంఘ్ సంస్థాగత దృక్పథం, సామాజిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు. అలాగే పంచ పరివర్తన అన్న మాధ్యమంగా సమాజంలో సానుకూల మార్పును ప్రేరేపించడం కూడా చాలా ముఖ్యమన్నారు.
ప్రస్తుతం సంఘ శాఖలు 55,683 స్థానాలలో 88,949 శాఖలు నడుస్తున్నాయని ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘ్ పరిభాషను వివరించారు. పట్టణ ప్రాంతాలలో సాధారణంగా 10 వేల నుంచి 12 వేల జనాభా వున్న ప్రాంతాన్ని బస్తీ అని పిలుస్తామని, అలా అయినా ఒక నగరంలో దాదాపుగా 30 వేల నుంచి లక్షల వరకూ జనాభా వుంటుందన్నారు.ఇక.. ఐదు లక్షలకు పైగా వున్న మున్సిపల్ కార్పొరేషన్లను మహానగర్ గా పిలుస్తామని, సంఘ్ యొక్క సంస్థాగత దృక్పథంలో, జనాభా పరిమాణం కూడా ఒక కారకంగా ఉన్నప్పటికీ, కనీసం 50 శాఖలు అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ నగరాన్ని మహానగర్‌గా పరిగణిస్తామని వివరించారు.
అయితే.. సంఘ శాఖలను విస్తరించడం అంటే కేవలం సంఖ్యను మాత్రమే పెంచడం తమ ఉద్దేశం కాదని నొక్కి చుప్పారు. శాఖ ఎక్కడ వుంటుందో అక్కడ స్వయంసేవకులు జాతీయ దృక్పథాన్ని అభివృద్ధి చేస్తూ వుంటారన్నారు. స్వయంసేవక్ ఒకే భాషా, ప్రాంతీయత, ప్రాంతీయ గుర్తింపుకు పరిమితం కాడని, దేశం మొత్తాన్ని సమగ్రంగా చూస్తారన్నారు. స్వయంసేవకులు కుల, సమాజ గుర్తింపులకు అతీతంగా ఆలోచిస్తారని, మొత్తం సమాజం పట్త విస్తృత శ్రద్ధను పెంపొందించుకుంటాడని తెలిపారు. దేశం మనకు ప్రతిదీ ఇస్తుందని, మనం కూడా దేశానికి ఏదైనా తిరిగి ఇవ్వాలి అన్న దృక్పథంతో వుంటారన్నారు. ఈ సేవా స్ఫూర్తి నిత్య శాఖ ద్వారానే వృద్ధి చెందుతుందని తెలిపారు.
అయితే విస్తరణ మాత్రమే సరిపోదని, స్వయంసేవకుల నాణ్యతా ప్రమాణాలు కూడా పెరగాలని నొక్కి చెప్పరు. స్వయంసేవకులు లోతైన సామాజిక దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, అనేక మందితో సంబంధాలను ఏర్పర్చుకోవాలని, నిర్మాణాత్మక సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. అలాగే భారత దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక జీవితం గురించి సరైన దృక్పథాన్ని కూడా అలవర్చుకోవడం మరో ముఖ్య లక్ష్యమని తెలిపారు. వలసవాద ఆలోచనా వారసత్వాన్ని ఈ సమాజం అధిగమించాలని, విశ్వవిద్యాలయాలు, పాఠ్యపుస్తకాలు, మేధో వేదికలు మరియు సాహిత్యంలో ఇటువంటి చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు.
భారతీయత మరియు హిందూత్వ వంటి భావనలను కేవలం తాత్విక ఆలోచనలుగా కాకుండా నాగరిక జీవన విధానంగా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.స్వామి వివేకానంద, దయానంద సరస్వతి వంటి ఆలోచనాపరులు పూర్వ కాలంలోనే ఇటువంటి మేధోపరమైన మేల్కొలుపును ప్రారంభించారని గుర్తు చేశారు. జీ 20 సదస్సు వేదికగా వుసుధైక కుటుంబకం అన్న సందేశాన్ని భారత్ పంపిందన్నారు . కేవలం సంఘ స్వయంసేవకులు మాత్రమే దేశానికి అంకిత భావంతో వున్నారని తామెన్నడూ చెప్పుకోవడం లేదని, అలా భావించడమూ లేదని స్పష్టతనిచ్చారు. దేశ వ్యాప్తంగా అనేక సంస్థలు, వ్యక్తులు తమ మేధస్సును, ప్రతిభను, తెలివితేటలను సామాజిక,జాతీయ ప్రయోజనాలకు అంకితం చేస్తున్నరన్నారు. ఈ సజ్జన శక్తి మరింతగా సహకరిస్తే సామాజిక పరివర్తన మరింత బలోపేతం అవుతుందన్నారు.
సంత్ రవిదాస్ 650వ జయంతితో ముడిపడి ఉన్న కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు, సాధువులను స్మరించుకోవడం అంటే కేవలం భక్తితో కూడినది కాదని, వారి బోధనలను సమాజంలో అమలు చేయడం అని అన్నారు. అలాంటి వ్యక్తిత్వాలు కేవలం చిత్రపటాలలో లేదా చరిత్ర పుస్తకాలలో మాత్రమే ఉండడం కాదని, నేటికీ ప్రజలకు స్ఫూర్తిమంతం అని అన్నారు.