సేవ ముసుగులో వేరు చేసే ప్రయత్నాలు : దత్తాత్రేయ  హోసబళే

సేవ అన్న ముసుగులో వనవాసులను తమ సంస్కృతి, మూలాల నుంచి వేరు చేసే శక్తులు కూడా పనిచేస్తుంటాయని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ సర్‌ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే హెచ్చరించారు. అలాగే అభివృద్ధిపేరుతో అడవులను నిర్మూలించడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంటారని, అలాంటి సమయంలో వనవాసుల జీవితాలు కూడా ఇబ్బందుల్లోకి పడిపోతాయన్నారు. అందుకే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, వనవాసులను రక్షించుకోవాల్సిన అవసరం మనందరి కర్తవ్యమని, ఈ సంకల్పాన్ని అందరి హృదయాల్లో జాగృతం చేయాలని దత్తాత్రేయ హోసబళే సూచించారు. హైదరాబాద్‌ కోఠిలోని YMIS భవనంలో వనవాసీ కల్యాణ ఆశ్రమం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ కార్యవాహ దత్తాత్రేయ  హోసబళే హజరయ్యారు.

ఒకతాటిపైకి తెచ్చేందుకు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేఘాలయ, అరుణాచల ప్రదేశ్‌, మణిపూర్‌, ఛత్తీస్‌ గఢ్‌ అలాగే తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌.. ఇలా విభిన్న ప్రాంతాల్లో వున్న వనవాసీలను ఒకే తాటిపై తీసుకురావడానికి వనవాసీ కల్యాణాశ్రమం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రయత్నం కారణంగా మన దేశంలోని వనవాసీ ప్రజల్లో ఆత్మ విశ్వాసం జాగృతం అయ్యిందని, తాము కూడా భారత వాసులమేనని, జాతి వికాస ప్రక్రియలో తమ భాగస్వామ్యం కూడా వుండాలన్న సంకల్పం వారిలో జాగృతమైందన్నారు. అంతే కాకుండా ఈ ఆలోచన వారిలో నింపడానికి కావాల్సిన యోగ్యతలను, ఆత్మ విశ్వాసాన్ని, సంఘటనా శక్తిని, సంకల్ప బలాన్ని కూడా వనవాసుల్లో కల్యాణాశ్రమం నింపుతోందని ప్రశంసించారు. వనవాసీ ప్రజల జీవితాల్లో సంపూర్ణ వికాసానికి వనవాసీ కల్యాణ ఆశ్రమం విశేష కృషి చేస్తోందని దత్తాత్రేయ హోసబళే అన్నారు. విద్య, వైద్యం, స్వావలంబన.. ఇలా అన్ని రంగాల్లోనూ వనవాసీలు సంపూర్ణ వికాసం చెందడానికి పనిచేస్తోందన్నారు. వనవాసీలు భారతీయ ధర్మంలో భాగమని, వనవాసీ క్షేత్రాల్లో భారతీయ ధర్మం పరిఢవిల్లడానికి కొన్ని సంవత్సరాలుగా వనవాసీ కల్యాణాశ్రమం అవిరళ కృషి సల్పుతోందన్నారు.

ప్రకృతిని కాపాడుతున్నారు

వనవాసులు ప్రకృతితో మమేకమై, ప్రకృతినే ఈశ్వర భావంగా కొన్ని వేల సంవత్సరాలుగా పూజిస్తున్నారన్నారు.అలాగే ప్రకృతిని రక్షిస్తూ, సభ్యతలను వికసింపజేస్తూ, సంస్కృతి వ్యాప్తి చెందేలా చేస్తున్నారని ప్రశంసించారు. ఇంత చేస్తున్నా.. ప్రకృతిని మాత్రం వాళ్లు నాశనం చేయలేదన్నారు. నీటిని, భూమిని, అటవులను, పశువులను రక్షిస్తూ వస్తున్నారని, ఇందులోనే వారు తమ సుఖమయ, ఆనందమయ జీవితాలను జీవితాలను నిర్మాణం చేసుకున్నారని తెలిపారు.

కృతజ్ఞతలు చెప్పాలి…

ప్రకృతిని నాశనం చేయకుండా, ప్రకృతితో సమన్వయం చేసుకుంటూ సంస్కృతి సభ్యలను కాపాడుతూ సభ్య సమాజానికి వనవాసులు మార్గదర్శనం చూపిస్తు న్నారని తెలిపారు. అందుకే అన్ని సమాజాల వారు వనవాసులకు కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం వుందన్నారు.

అందరి బాధ్యత..

నగరవాసీ, గ్రామవాసీతో పాటు వనవాసుల మధ్య ఓ అనుసంధాన ప్రక్రియ అనే బృహత్‌ కార్యం జరగాలని, ఇతరుల గురించి కూడా ఆలోచించా ల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు.

 భారతీయ సంస్కృతి అనేది అటవీ సంస్కృతికి వేరుగా లేదని, సంస్కృతి, సంప్రదాయాలు అని మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ వనవాసీ సంస్కృతి ముడిపడే వుంటుందని, దానితోనే పరిపూర్ణత్వం చేకూరుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *