సామాజిక సేవతో గ్రామాలు స్వావలంబన సాధించాలి : దత్తాత్రేయ హోసబళే
భారత్ లోని ప్రతి గ్రామమూ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే ఆకాంక్షించారు.సామాజిక సేవ చేయడం ద్వారా స్వావలంబీ గ్రామాలు కావాలన్నదే భారత్ విజన్ అని వివరించారు.కన్నూర్ లో పజాస్సి రాజా కల్చరల్ సెంటర్ ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఎలాంటి లాభాపేక్షా లేకుండా సమాజ సహకారం ద్వారా సమాజం సమగ్ర ప్రగతి సాధించడమే లక్ష్యం కావాలన్నారు.
ఇలా రూపుదిద్దుకున్న గ్రామాలే భారతదేశానికి ఆత్మ అని ప్రకటించారు. శతాబ్దాలుగా ఇలా గ్రామాలను తయారు చేయాలన్న నిరంతర ప్రయత్నాలు సాగుతూనే వున్నాయని వివరించారు. గ్రామాలు కేవలం ప్రభుత్వాలు ఇచ్చే ఆర్థిక సాయంపైనే ఆధారపడకూడదని, స్వావలంబన సాధించాలని సూచించారు. సమాజం సహాయంతో దేశం అన్నివిధాలా అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యమని వివరించారు.

అయితే ప్రభుత్వాలు కేవలం మార్గదర్శకత్వం మాత్రమే చేయాలని, కానీ… ప్రభుత్వాల ఆర్థిక సాయం కోసం చూడటం అన్న విధానం గ్రామాలను బలహీనపరుస్తుందని వివరించారు. భారత అభివృద్ధి కేవలం భౌతిక ఎదుగుదలే కాదని, ఆధ్యాత్మిక, మానసిక పురోగతి కూడా కావాలని సూచించారు. భారత్ కి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తైందని, అమృతకాల్ ప్రయాణం ప్రారంభమైందన్నారు. కానీ… ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి సవాళ్లను ఎదుర్కొన్నామన్నాయి. అలాంటి క్లిష్ట సమయాల్లో స్వయంసేవకులు గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా, స్థిరంగా సేవ చేస్తూ సమాజంలో విశ్వాసాన్ని నింపారని తెలిపారు. స్వయం సేవకుల నిస్వార్థ సేవ, త్యాగం భారత్ సారాంశమని, ఇది వివేకానంద చూపించిన మార్గాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.