శాస్త్రీయ, సాంకేతిక పురోగతులను వెల్లడించకుంటే మూఢ నమ్మకాలు పెరుగుతాయి : హోసబళే
విద్యా వ్యవస్థ తన సిలబస్ ద్వారా నాగరికతకు సంబంధించిన శాస్త్రీయ, సాంకేతిక పురోగతులను తెలియజేయడంలో విఫలమైనప్పుడే మూఢనమ్మకాలు ప్రబలుతాయని ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గ్లోబల్ సైన్స్ ఇన్నోవేషన్ ఫోరమ్ నిర్వహించిన సదస్సులో హోసబళే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విద్యా వ్యవస్థ ద్వారా పురాతన శాస్త్రీయ పరిశోధనలను పునరుద్ధరించి, ప్రచారం చేయాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. భారతీయ సంప్రదాయంలో శాస్త్రీయ పరిశోధన, ఆధ్యాత్మికత అనేది వేర్వేరు కావని, ఒకదానితో ఒకటి గాఢంగా అనుసంధానమై వుంటాయని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా మతం, సైన్స్ వేర్వేరని, పరస్పర విరుద్ధమని కొందరు భావిస్తుంటారని, కానీ భారతీయ సంప్రదాయంలో మాత్రం అవి రెండూ అభిన్నమని స్పష్టం చేశారు. అలాగే భారతీయ సమాజంలోని వ్యక్తులు లేదా సంస్థలు శాస్త్రీయ అన్వేషణలోనూ, ఆధ్యాత్మిక సాధనలోనూ ఏకకాలంలో నిమగ్నమవుతాయని వివరించారు.
ఇలాంటి మేధో సంప్రదాయం భారతీయ నాగరికతా విజ్ఞానంలో ఒక భాగంగా ఉందని, పాలన కూడా అదే విధంగా ప్రతిబింబించాలని ఆకాంక్షించారు. అలాంటి ప్రాచీనమైన వ్యవస్థ నైతికంగా, శాస్త్రీయంగా వుంటూ భద్రత, జీవనోపాధి లాంటి అనేక అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించిందని కూడా గుర్తు చేశారు.
సమాజానికి అవకాశాలు, సాధికారత మరింత విస్తరించాలంటే మాత్రం ఇలాంటి అంశాలను విద్య ద్వారానే అందించాలని హోసబళే సూచించారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, విద్యా వ్యవస్థ ఆగిపోతే మాత్రం సమాజం మరింత అసమానంగా తయారయ్యే అవకాశాలున్నాయని, అప్పుడు సమాజం ప్రమాదంలో పడిపోతుందని హెచ్చరించారు. సమాజంలోని కొన్ని వర్గాలు విద్యలో, శాస్త్రీయ పురోగతిలో వెనుకబడితే, అసమానతలు మరింత తీవ్రం అవుతాయని, ఆర్థిక వృద్ధి, విద్య, జీవన నాణ్యత అన్నీ పరస్పరం అనుసంధానించే వుంటాయని వివరించారు.
అందుకే ఇప్పటి ప్రభుత్వాలు ఈ విషయాలను అత్యంత గంభీరతతో అవగాహన చేసుకోవాలని, ఓ వైపు సమాజంలో నెలకొన్న అసమానతలు, పక్షపాతాలు, మూఢనమ్మకాలను సమాజమే పరిష్కరించాలని, విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతికతను నిరంతరం ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సమాజానికి కచ్చితత్వంతో చెప్పడంలో మనం విఫలమైతే మూఢ నమ్మకాలు ప్రబలిపోతాయని అన్నారు.
నిజమైన శాస్త్రీయ పరిశోధనను, మూఢ నమ్మకాల నుంచి వేరు చేసి, గుర్తించేలా ప్రజలకు వివరించాలని, ఇది విద్యా వ్యవస్థకు ఓ సవాల్ అని అన్నారు. సమాజం చాలా కాలంగా ఈ సవాలును ఎదుర్కొంటోందని, కానీ గతకాలపు శాస్త్రీయ పరిశోధనలు శతాబ్దాలుగా విద్య మరియు పాఠ్యాంశాలలో ఎలా పొందుపరచబడ్డాయో స్పష్టంగా ప్రదర్శించడానికి నిరంతర ప్రయత్నాలు కూడా జరిగాయని గుర్తు చేశారు.