సేవ ముసుగులో వనవాసులను వేరు చేసే ప్రయత్నాలు : దత్తాత్రేయ హోసబళే
సేవ అన్న ముసుగులో వనవాసులను తమ సంస్కృతి, మూలాల నుంచి వేరు చేసే శక్తులు కూడా పనిచేస్తుంటాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే హెచ్చరించారు. అలాగే అభివృద్ధి అన్న పేరుతో అడవులను నిర్మూలించడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంటారని, అలాంటి సమయంలో వనవాసుల జీవితాలు కూడా ఇబ్బందుల్లోకి పడిపోతాయన్నారు. అందుకే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, వనవాసులను రక్షించుకోవాల్సిన అవసరం మనందరి కర్తవ్యమని, ఈ సంకల్పాన్ని అందరి హృదయాల్లో జాగృతం చేయాలని దత్తాత్రేయ హోసబళే సూచించారు.హైదరాబాద్ కోఠిలోని YMIS భవనంలో వనవాసీ కల్యాణ ఆశ్రమం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా ఆరెస్సెస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే హజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేఘాలయ, అరుణాచల ప్రదేశ్, మణిపూర్, ఛత్తీస్ గఢ్ అలాగే తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్… ఇలా విభిన్న ప్రాంతాల్లో వున్న వనవాసీలను ఒకే తాటిపై తీసుకురావడానికి వనవాసీ కల్యాణాశ్రమం కృషి చేస్తోందన్నారు.ఈ ప్రయత్నం కారణంగా మన దేశంలోని వనవాసీ ప్రజల్లో ఆత్మ విశ్వాసం జాగృతం అయ్యిందని, తాము కూడా భారత వాసులమేనని, జాతి వికాస ప్రక్రియలో తమ భాగస్వామ్యం కూడా వుండాలన్న సంకల్పం వారిలో జాగృతమైందన్నారు. అంతేకాకుండా ఈ ఆలోచన వారిలో నింపడానికి కావాల్సిన యోగ్యతలను, ఆత్మ విశ్వాసాన్ని, సంఘటనా శక్తిని, సంకల్ప బలాన్ని కూడా వనవాసుల్లో కల్యాణాశ్రమం నింపుతోందని ప్రశంసించారు.వనవాసీ ప్రజల జీవితాల్లో సంపూర్ణ వికాసానికి వనవాసీ కల్యాణ ఆశ్రమం విశేష కృషి చేస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అన్నారు. విద్య, వైద్యం, స్వావలంబన.. ఇలా అన్ని రంగాల్లోనూ వనవాసీలు సంపూర్ణ వికాసం చెందడానికి పనిచేస్తోందన్నారు. వనవాసీలు భారతీయ ధర్మంలో భాగమని, వనవాసీ క్షేత్రాల్లో భారతీయ ధర్మం పరిఢవిల్లడానికి కొన్ని సంవత్సరాలుగా వనవాసీ కల్యాణాశ్రమం అవిరళ కృషి సల్పుతోందన్నారు.
వనవాసులు ప్రకృతితో మమేకమై, ప్రకృతినే ఈశ్వర భావంగా కొన్ని వేల సంవత్సరాలుగా పూజిస్తున్నారన్నారు.అలాగే ప్రకృతిని రక్షిస్తూ, సభ్యతలను వికసింపజేస్తూ, సంస్కృతి వ్యాప్తి చెందేలా చేస్తున్నారని ప్రశంసించారు. ఇంత చేస్తున్నా.. ప్రకృతిని మాత్రం వాళ్లు నాశనం చేయలేదన్నారు. ఆధునిక కాలంలో మానవుడు తన సుఖం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాడని, కానీ.. వనవాసులు అలా కాకుండా ప్రకృతిని సంరక్షిస్తూ వస్తున్నారన్నారు.నీటిని, భూమిని, అటవులను, పశువులను రక్షిస్తూ వస్తున్నారని, ఇందులోనే వారు తమ సుఖమయ, ఆనందమయ జీవితాలను జీవితాలను నిర్మాణం చేసుకున్నారని తెలిపారు.
తమ జీవితాలకు అవసరమైన వస్తువులను నిర్మాణం చేసుకున్నారని, ఆరోగ్య సంరక్షణ కోసం ఔషధాలను తయారు చేసుకున్నారని, జీవించడానికి అనేక అస్త్ర శస్త్రాలను తయారు చేసుకున్నారని అలాగే అనేక రకాల పరికరాలను కూడా తయారు చేశారన్నారు. ఇంత చేసినా వనవాసులు ప్రకృతిని మాత్రం వినాశనం చేయలేదన్నారు. ఇలా ప్రకృతిని నాశనం చేయకుండా, ప్రకృతితో సమన్వయం చేసుకుంటూ సంస్కృతి సభ్యలను కాపాడుతూ సభ్య సమాజానికి వనవాసులు మార్గదర్శనం చూపిస్తున్నారని తెలిపారు. అందుకే అన్ని సమాజాల వారు వనవాసులకు కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం వుందన్నారు.
అటవీ జీవనాన్ని తోసిరాజి భారతీయ జీవనం కుదరదని హోసబళే అన్నారు. నగరాల్లో, గ్రామాల్లో నివసించే ప్రజలందరూ అడవులపైనే ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారన్నారు.ఓ మానవుడు తన నిత్య జీవితంలో అవసరయ్యే ప్రతి వస్తువును అడవుల నుంచే తీసుకుంటున్నారని గుర్తు చేశారు. ఇలా తీసుకోవడం మన అధికారం అనుకుంటామని, కానీ… అడవినే ఆధారంగా చేసుకొని జీవనం సాగించే వారికి సేవ చేయడం కూడా మనందరి కర్తవ్యమని సూచించారు. కల్యాణాశ్రమం చాలా సంవత్సరాలుగా ఇదే పనిచేస్తోందన్నారు. వనవాసుల అస్తిత్వం, ఆత్మగౌరవం, వికాసం.. ఈ మూడు బిందువులను కేంద్రంగా చేసుకొని కల్యాణాశ్రమం పనిచేస్తూ వనవాసులకు సేవచేస్తోందన్నారు. అలాగే భారత దేశ అభివృద్ధిలో వీరి పాత్ర కూడా వుండేట్లు పనిచేస్తోందన్నారు.ఈ కార్యాన్ని ఓ తపస్సులా చేస్తోందని, ఈ తపస్సుకి గ్రామవాసి, నగరవాసి… ఇలా అందరూ తమ వంతు సహయ, సహకారాలను అందించాలని పిలుపునిచ్చారు. మనమందరమూ భారత వాసులమని, ఇది కేవలం చెప్పడం కాదని, హృదయాంతరాళాల్లోంచి రావాలన్నారు.
నగరవాసీ, గ్రామవాసీతో పాటు వనవాసుల మధ్య ఓ అనుసంధాన ప్రక్రియ అనే బృహత్ కార్యం జరగాలని, లేదంటే ఎవరి పనిలో వారు నిమగ్నమైపోతారన్నారు. అలా కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు. హైందవా: సోదర సర్వే: అని ఆర్యోక్తి ఒకటి వుందని… హిందువులందరూ అన్నాదమ్ములు, అక్కాచెల్లెల్లని, అందరిదీ ఒకే రక్తమన్నారు. నెల క్రితం భాగ్యనగర్ లో లోక్ మంథన్ కార్యక్రమం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ వనవాసి, గిరివాసి, నగరవాసి, గ్రామవాసి ఎవ్వరైనా అందరమూ భారత వాసులమేనని పేర్కొన్నారని దత్తాత్రేయ హోసబళే ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మన దేశంలో 10 కోట్ల మంది కంటే అధికంగా వనవాసులు వున్నారని పేర్కొన్నారు. రామాయణ, భారతాలతోనే భారత దేశానికి గుర్తింపు అని, భారత దేశ పరిచయం కూడా వీటితోనే ముడిపడి వుందన్నారు.భారతీయ సంస్కృతి, సభ్యతను వనాల్లో, అరణ్యాల్లో, నదుల ఒడ్డునే రూపునిచ్చాన్నారు. అందుకే ఈ సంస్కృతి నిర్మాణంలో వనవాసుల పాత్ర చాలా వుందని, వనవాసుల చరిత్రను వర్ణించకుండా భారత చరిత్రను రూపుదిద్దడం కుదరని పని అని తేల్చి చెప్పారు. భారతీయ సంస్కృతి అనేది అటవీ సంస్కృతికి వేరుగా లేదని, సంస్కృతి, సంప్రదాయాలు అని మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ వనవాసీ సంస్కృతి ముడిపడే వుంటుందని, దానితోనే పరిపూర్ణత్వం చేకూరుతుందన్నారు.