సికింద్రాబాద్ లో ‘‘శ్రీరాం సాఠే’’ భవన్ ను ప్రారంభించిన దత్తాత్రేయ హోసబళే
సికింద్రాబాద్‌లో 80 సంవత్సరాల తర్వాత పునర్నిమించబడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నూతన కార్యాలయ భవనం “శ్రీ శ్రీరామ్ సాఠే భవన్”ను (పాత బోయగూడా, సికింద్రాబాద్ ) హోలీ పర్వదినాన మాననీయ సర్‌కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే ప్రారంభించారు.
అనంతరం శ్రీ దత్తాత్రేయ ప్రసంగిస్తూ సంఘ కార్యాలయం అనేది సంఘ కార్య విస్తరణకు, సంస్కారాల నిర్మాణానికి కేంద్ర బిందువని అన్నారు. సంఘానికి తనకంటూ ప్రత్యేకంగా ఆస్తిపాస్తులేమీ ఉండవంటూ స్వయం సేవకులే సంఘ ఆస్తి అని పేర్కొన్నారు. సంఘ కార్యాలయం అనేది సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తులకు ఆధారభూతమవుతుందని తెలిపారు.
సంఘ సాధారణ జీవన విధానం, సాంస్కృతిక వారసత్వతత్వం, పర్యావణ సానుకూలతలు ప్రతీకగా, భద్రత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణంకోసం సుమారు 300మంది స్వయంసేవకులు విరాళాలను సమకూర్చారు. ఈ కార్యాలయంలో మొదటి అంతస్తులో సంగమేశ్వర ఆయుర్వేద వైద్యశాల, రెండవ అంతస్తులో శ్రీరామ్ సాఠే నివాస వసతి & హల్, మూడో అంతస్తులో శ్రీగురూజీ సభామండపం, నాలుగవ అంతస్తులో శ్రీ సోమేపల్లి సోమయ్య నివాస వసతి ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో మాననీయ ప్రాంత సంఘచాలక్ శ్రీ బర్ల సురేందర్ గారు, మాననీయ సంభాగ్ సంఘచాలక్ శ్రీ గంజాం కృష్ణ ప్రసాద్ గారు, మాననీయ విభాగ్ సంఘచాలక్ శ్రీ దుర్గారెడ్డి గారు, శ్రీరామ సాఠే భవన నిర్మాణ సమితి అధ్యక్షులు శ్రీ ఉప్పలంచల అమర్నాథ్ గారు, ఆదరణీయ శ్రీ భరత్ గారు (సహా క్షేత్ర ప్రచారక్), స్వయంసేవకులు పాల్గొన్నారని విభాగ్ కార్యవాహ భర్తెపూడి శ్రీనివాస్ తెలిపారు.