ఛత్రపతి శివాజీ తయారు కావడానికి కారణం అమ్మే : హోసబళే
పతకాలు సాధించిన క్రీడాకారులను తయారు చేసిన వారి కష్టాన్ని, పోరాటాన్ని గుర్తించి, వారిని గౌరవించడం ఎంతో అవసరమని ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో జీజియా మాత ఛత్రపతి శివాజీని తయారు చేసిందన్నారు. జీజియామాత గొప్ప తల్లి మాత్రమే కాదని, నైపుణ్యం కలిగిన ఓ నిర్వాహకురాలు అని కూడా తెలిపారు.భోపాల్ లో క్రీడా భారతి ఆధ్వర్యంల ‘‘జిజామాత సమ్మాన్’’ కార్యక్రమం జరిగింది. ఇందులో దత్తాత్రేయ హోసబళే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరుగురు క్రీడాకారుల మాతృమూర్తులను ఘనంగా సన్మానించారు.
శివాజీ మహారాజ్ ను ఔరంగజేబు జైలులో పెట్టినప్పుడు, జీజియామాత రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించిందన్నారు. ఎవరి దగ్గరా తన కొడుకు పనిచేయడని తేల్చి చెప్పింది కూడా. ఆ శివాజీయే పాలకుడిగా మరి, సమాజానికి సేవ చేశారన్నారు. జీజియామాత గొప్ప సంకల్పానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. శివాజీ జీవితంలో ఈ లక్షణాలన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తూనే వుంటాయన్నారు.శివాజీకి చిన్నప్పటి నుంచి రామాయణ, భారత కథలను చెప్పి, తల్లి పెంచిందని పేర్కొన్నారు.దీంతో శివాజీలో ఎలాంటి ప్రవర్తన రావాలో అది వచ్చిందన్నారు.