దయానందుని దేశభక్తి
సకల మానవాళి సంక్షేమమే లక్ష్యం అయినప్పటికీ మహర్షి దయానందుడికి మాతృభూమిపట్ల అపారమైన ప్రేమాభిమానాలు ఉండేవి. ఒకసారి స్వామి దయానందుడి ఉపన్యాసం విని అమితంగా ముగ్ధుడైన ఇంగ్లీషు అధికారి ఆయనతో ‘స్వామీజీ! మీరు దయచేసి ఇంగ్లాండు వెళ్ళి అక్కడ ధర్మమార్గాన్ని బోధించండి. ఖర్చులన్నింటినీ నేను భరిస్తాను’ అన్నాడు.
అప్పుడు స్వామి దయానందుడు ‘నా జీవితంలో మిగిలిన కొద్ది సంవత్సరాలలో నా దేశవాసుల్లో వైదిక జ్ఞానాన్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తాను. ఇక్కడ జ్ఞానజ్యోతి వెలిగిందంటే దాని కాంతి పశ్చిమదేశాలలో కూడా వ్యాపించడం తధ్యం’ అన్నారు. విదేశాల్లో సంపాదించగలిగిన కీర్తిప్రతిష్టల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. తన దేశ ప్రజల్లో స్వాభిమానాన్ని నింపడానికి ప్రయత్నించారు. ‘మీ పూర్వీకులు అరణ్యాలలో నివసించిన అనాగరిక మానవులు కారు. ఈ ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన మహనీయులు. మీ చరిత్ర పరాజయాల పరంపర కాదు. విశ్వవిజేతల యశోగానమది. మీ వేదవేదాంగ శాస్త్రాలన్నీ ఆవులకాపరుల ఆలాపనలు కావు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి మహా మహితాత్ములను రూపుదిద్దిన అమృత సత్యవచన నిధులవి. లేవండి! మేల్కొనండి! వైభవోపేతమైన మీ చరిత్రను చూసి సగర్వభావంతో పులకించండి. మీ పూర్వీకులపట్ల జుగుప్సను నింపుతున్న ఆధునిక విద్యావిధానం సిగ్గుచేటని గ్రహించండి’ అని ఉద్బోధించారు.