దేశ ఆర్థిక వ్యవస్ధకి పుష్టినిచ్చిన ‘‘దీపావళి’’… స్వదేశీ తోడైంది కూడా..
ఈ దీపావళి పర్వదినం మన భారత ఆర్థిక వ్యవస్థకు విపరీతమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దంతేరాస్, దీపావళి పండుగల సందర్భంలో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తుంటారు. అందుకే ఈ సీజన్ లో దేశంలో వివిధ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అలాగే ఈ యేడాది కేంద్ర ప్రభుత్వం జీఎస్టీతో సహా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో బంగారం, వెండితో సహా వివిధ ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్ లో విపరీతంగా అమ్ముడుపోయాయి.ఆదాయపు పన్ను పరిమితి పెరుగుదలతో పాటు జీఎస్టీ 2.0 వినియోగదారులకు విపరీతమైన ఉపశమనం కలిగించాయి.
కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను పరిమితిని 12 లక్షల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.పౌరుడి వార్షిక ఆదాయం 12 లక్షల వరకు వుంటే ఆదాయపు పన్ను పరిధిలోకి రారు. అలాగే జీఎస్టీ 2.0 పేరుతో కూడా భారీ మార్పులు చేసింది. దీంతో దాదాపు 375 రకాల వస్తువులపై ధరలు తగ్గాయి. దీంతో వినియోగదారులు వస్తువులు, సేవల పన్ను రేట్లలో 10 శాతం వరకు ప్రయోజనం పొందారు. దీంతో దీపావళి సీజన్ లో వినియోగదారులు తెగ సంతోషంతో కొనుగోలు చేశారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు మంచి ఊతం లభించింది.
దేశ చరిత్రలోనే అధికంగా వ్యాపారం…
దీపావళి సీజన్ లో చరిత్రలోనే అత్యధిక టర్నోవర్ ను భారత మార్కెట్ లు చవి చూశాయి. అన్ని దుకాణాల వద్ద భారీ రద్దీ కనిపించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ దేశ వ్యాప్తంగా 35 నగరాల్లో మార్కెట్ ల వద్ద సర్వే నిర్వహించింది.ఈ సంవత్సరం దీపావళి పండుగ సీజన్‌లో దాదాపు రూ.6.05 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది.2021 సంవత్సరంలో ఈ పండుగ సీజన్‌లో, రూ.1.25 లక్షల కోట్లు, 2022 సంవత్సరంలో రూ.2.50 లక్షల కోట్లు, 2023 సంవత్సరంలో రూ.3.75 లక్షల కోట్లు మరియు 2024 సంవత్సరంలో రూ.4.25 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరిగింది.
అయితే ఈ యేడాది గోవర్ధన పూజ, భగినీ హస్త భోజనం, ఛత్, తులసీ వివాహం లాంటి పండుగలు కూడా వస్తున్నాయి.ఒక్క దీపావళి కారణంగానే గతంలో కంటే 5.4. లక్షల కోట్ల వ్యాపారం జరిగింది.అందువల్ల, ఈ సంవత్సరం భారతదేశంలో పండుగ సీజన్‌లో మొత్తం వాణిజ్య సంఖ్య రూ. 6.5 లక్షల కోట్లు దాటిపోయాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో జరిగిన వాణిజ్య సంఖ్య కంటే 41 శాతం ఎక్కువ. ఇందులో 5.40 లక్షల కోట్ల విలువైన వస్తువుల వ్యాపారం జరగ్గా, 65,000 కోట్ల విలువైన సేవల వ్యాపారం వుంది.

స్వదేశీ వస్తువులకే మార్కెట్ లో అధిక డిమాండ్..
ఈ దీపావళి సీజన్ సందర్భంగా భారతీయ పౌరులు స్వదేశీ వస్తువులకే మొగ్గు చూపారు. ఓ అంచనా ప్రకారం ధంతేరాస్, దీపావళి సీజన్ లో బంగారం, వెండి వస్తువుల కొనుగోలులో 60 వేల కోట్లకు చేరుకున్నట్లు చెబుతున్నారు. బంగారం, వెండి ఆభరణాల అమ్మకాలు మొత్తం 1.35 లక్షల కోట్లు. భారత మార్కెట్ లో సుమారు 46 టన్నుల బంగారం అమ్ముడైంది. 87 శాతం మంది వినియోగదారులు విదేశీ వస్తువుల కంటే స్వదేశీ వస్తువులకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు CAT సంస్థ ప్రకటించింది. అలాగే చైనా ఉత్పత్తులకు కూడా దీపావళి సీజన్ లో డిమాండ్ తగ్గిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే భారత్ లో తయారైన వస్తువుల అమ్మకాలు 25 శాతం పెరిగింది.
ఒకే రోజు 6 లక్షల వాహనాల అమ్మకం…
ఇక.. వాహన రంగంలోనూ అత్యధిక వాహనాలు అమ్ముడయ్యాయి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరింది. దీపావళి పండుగ సందర్భంగా ఒకే రోజులో 600,000 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని సూచిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ మృత వ్యవస్థ అని అమెరికా అధ్యక్షుడు అపరిపక్వ మాటలు మాట్లాడారు. కానీ.. భారత ఆర్థిక వ్యవస్థ ప్రతి క్షణమూ వృద్ధి చెందుతూనే వుంది.
2025-2026 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.3 శాతం…
2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, అంటే 2025 ఏప్రిల్-జూన్‌లో భారత ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధించింది.అయితే, జూలై-సెప్టెంబర్ 2025 రెండవ త్రైమాసికంలో మరియు అక్టోబర్-డిసెంబర్ 2025 మూడవ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ రికార్డు ఆర్థిక వృద్ధి రేటును సాధించే అవకాశాలు కూడా బలంగా మారాయి. భారతదేశంలో రెండవ త్రైమాసికంలో ప్రారంభమైన పండుగ సీజన్ (దుర్గా పండుగ, దసరా, ధంతేరాస్ మరియు దీపావళి మొదలైనవి) వివిధ ఉత్పత్తులకు రికార్డు వృద్ధిని సాధించింది.ఇదే స్పీడు మూడో త్రైమాసికంలో కూడా కొనసాగే అవకాశం వుంది. మరికొన్ని పండుగలు కూడా రానున్నాయి. వీటితో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా రానుంది. ఈ సీజన్ లో బంగారం, వెండి, కార్లు, టీవీ, రిఫ్రిజిరేటర్, ఎసి మొదలైన వాటికి డిమాండ్ పెరుగుతుంది.
వీటితో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఆర్థిక వృద్ధికి తోడ్పాటునిస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు వారణాసి, అయోధ్య, చార్ ధామ్, వైష్ణోదేవి, తిరుపతి, శబరిమల కంచి కామక్షి లాంటి ఆలయాలను సందర్శిస్తారు. మన దేశంలో నానాటికీ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం కూడా పెరుగుతోంది. లక్షలాది మందికి కొత్త ఉపాధి లభిస్తుంది. వీటన్నింటి ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభిస్తోంది.