రక్షణ రంగంలో ‘‘స్వదేశీ’’.. అమ్కా తయారీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

రక్షణ రంగంలో స్వదేశీ తయారీ ప్రోత్సహించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (AMCA) ల తయారీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) ఆమోదం తెలిపారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని డీఆర్‌డీవో -ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ దీనిని అమలు చేయనుంది. అమ్కాను రూపొందించడంలో ఈ ప్రక్రియ కీలక మైలురాయిగా నిలువనుంది.

భారత్‌ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నమూనాను తొలిసారి ‘ఏరో ఇండియా-2025’లో ప్రపంచానికి చూపించారు. కృత్రిమ మేథ ఆధారిత ఎలక్ట్రానిక్‌ పైలట్, నెట్‌ ఆధారిత ఆయుధ వ్యవస్థల లాంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువుండే ఈ లోహ విహంగాన్ని మానవ సహితంగా, మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు.ఏడీఏ ఈ యుద్ధ విమానం డిజైన్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కు చెందిన వేమ్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థ ఫ్యాబ్రికేషన్‌ పనులు చేసింది.

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయిగా నిలవనుంది. అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఐదో తరానికి చెందిన యుద్ధ విమానం. ఈ ప్రాజెక్టు ప్రారంభ అభివృద్ధి వ్యయం దాదాపు రూ.15 వేల కోట్లుగా అంచనా వేశారు. ఈ యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీతో శత్రుదేశాల్లోకి లోతుగా చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. భారత వాయుసేన దీర్ఘకాల అవసరాల్లో భాగంగా ఈ AMCA ప్రాజెక్టును చేపట్టారు.

 

అమ్కా (AMCA) అంటే ఏమిటి?

అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది భారత్ దేశ ఐదో తరం స్టీల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. దీనిని భారత వైమానిక దళం కోసం రూపొందించనున్నారు. ఇందులో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ అందుబాటులో వుండేలా చేస్తున్నారు.

ఇందులోని ప్రత్యేకతలివే…

1. రాడార్ నుంచి తప్పించుకునే సామర్థ్యం వుంటుంది. శత్రువులు అంత సులభంగా గుర్తించలేరు.

2. అఫ్టర్ బర్నర్ లేకుండా ధ్వని వేగం కంటే ఎక్కువగా ఎగిరే సామర్థ్యం ఇందులో వుంటుంది.

3. రాడార్లు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు కూడా ఇందులో వున్నాయి.

4. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇందులో ప్రధానమైన వ్యవస్థ. ఆటోమేటెడ్ నిర్ణయం తీసుకోవడంతో పాటు నెట్ వర్క్ కేంద్రీకృత యుద్ధానికి ఇది బాగా ఉపకరిస్తుంది.

5. ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్న రాఫెల్, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న సుఖోయ్ యుద్ధ విమానాలపై ఆధారపడటం కూడా తగ్గుతుంది.

6. దీని బరువు 25 టన్నులు. రాఫెల్, సుఖోయ్ కంటే చిన్నది.

7. ఇది 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిలో మాక్ 1.8+ వేగంతో ప్రయాణిస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *