భారత్ ను ప్రమాదంలో పడేయాలని చూస్తే.. ఖబడ్దార్ : రాజ్ నాథ్
పహల్గాం ఉగద్రాడి జరిగి యేడాది పూర్తైంది. ఈ సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చారు. భారత్ ను ప్రమాదంలో పడేయాలని చూస్తే, దేశ స్పందన ఎలా వుంటుందో చూస్తారంటూ జర్మనీ కేంద్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు భారత్ ఎవ్వరిపైనా, అకారణంగా దాడి చేయలేదని, పొరుగు దేశాలు భారత్ ను ప్రమాదంలో పడేయాలని చూస్తే మాత్రం ప్రతిస్పందన అదే స్థాయిలో వుంటుందని తేల్చిచెప్పారు.
అయితే.. ఎక్కడ కూడా రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ పేరును నేరుగా ఉచ్చరించలేదు. భారత సైనిక వ్యవస్థ ఇంతకు ముందు కంటే దృఢంగా తయారైందని, ఆపరేషన్ సిందూర్ లో ఏం చేసిందో మీకు తెలిసే వుంటుందన్నారు. భారత్ కి సంబంధించినంత వరకు పొరుగు దేశాలన్నీ బాగానే వున్నాయని, ఒక్క దేశం మాత్రమే సమస్యాత్మకంగా వుందని పరోక్షంగా పాక్ ను పేర్కొన్నారు.ఒకవేళ పొరుగు దేశం సమస్య సృష్టించడానికి ప్రయత్నిస్తే అప్పుడు చుక్కలు చూపిస్తామన్నారు.
గత ఏడాది మే 7 నుండి 10 వరకు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసే లక్ష్యంతో నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు గాను భారత బలగాలను ప్రశంసిస్తూ, భారతదేశ సైన్యం మునుపటి కంటే మరింత బలోపేతమైందని సింగ్ పేర్కొన్నారు.”ఆపరేషన్ సిందూర్‌లో మా సైన్యం ఏం చేసిందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు… మా సైనిక శక్తి కూడా గతంలో కంటే మరింత బలపడింది,” అని ఆయన అన్నారు.
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏప్రిల్ 21 నుండి మూడు రోజుల జర్మనీ పర్యటనను చేపట్టనున్నారు; ఈ పర్యటన అజెండాలో 90,000 కోట్ల విలువైన భారీ జలాంతర్గామి ఒప్పందం ప్రధాన అంశంగా ఉంటుందని భావిస్తున్నారు.భారత నౌకాదళానికి ఆరు అత్యాధునిక జలాంతర్గాములను సరఫరా చేసే భారీ రక్షణ ఒప్పందం తుది దశకు చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. “చర్చలు కొనసాగుతున్నాయి, ప్రతిపాదిత ఒప్పందం త్వరలోనే ఖరారు కావడానికి సిద్ధంగా ఉంది,” అని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
నౌకాదళం యొక్క జలంతర్గామి సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు, ముంబైకి చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) మరియు జర్మన్ సంస్థ Thyssenkrupp Marine Systems (TKMS) కలిసి P-75I ప్రాజెక్టు కింద ఆరు అధునాతన జలంతర్గాములను నిర్మించనున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా, TKMS జలంతర్గాముల రూపకల్పన మరియు సాంకేతికతను భారతదేశానికి బదిలీ చేస్తుంది.