దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం, శత్రుత్వం వుండదు : రాజ్ నాథ్ సింగ్
ఆర్థిక వ్యవస్థలో, రక్షణ వ్యవస్థలో స్వావలంబన అత్యంత అవసరమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నొక్కి చెప్పారు.014లో మనరక్షణ రంగం ఎగుమతుల విలువ రూ.700 కోట్లు. ఇప్పుడది రూ.24 వేల కోట్లకు చేరింది. ఈ గణాంకాలు చూస్తుంటే భారత్ ఒక కొనుగోలు దారుగానే మిగలకుండా ఎగుమతిదారుగా ప్రయాణిస్తోందని చెప్పడానికి గర్వంగా వుందని ప్రకటించారు. ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘర్షణలున్న ఈ సమయంలో విదేశీ సరసఫరాలపై భారత రక్షణ రంగం ఆధారపడటం అంత మంచిది కాదన్నారు. దేశ వ్యూహాత్మకమైన స్వయంప్రతిపత్తిని కాపాడటంలో సైనిక స్వావలంబన అత్యంత అవశ్యకమని పేర్కొన్నారు.శక్తిమంతమైన స్వదేశీ జెట్ ఇంజెన్లను అభివృద్ధి చేసే పనిని భారత్ తీసుకుందని, ఈ కీలకమైన ప్రాజెక్టుకు సన్నాహాలు కూడా పూర్తయ్యాయని, అతి త్వరలోనే దీని ఫలితాలు ప్రజలకు కనిపిస్తాయన్నారు.
దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం, శత్రుత్వం అంటూ ఏమీ ఉండదని, అలాగే శాశ్వత మిత్రులు కానీ, శత్రువులు కానీ ఉండరని రక్షణ శాఖ మంత్రి స్పష్టం చేశారు. కేవలం ఆ దేశానికి ఉపయోగపడే శాశ్వత ప్రయోజనాలే ఉంటాయని అన్నారు.“మనకు శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. భారత్ ఎవరినీ శత్రువుగా పరిగణించదు. మన రైతులు, వ్యాపారవేత్తల ప్రయోజనాలే మనకు ముఖ్యం. ప్రస్తుతం మారుతున్న భౌగోళిక, రాజకీయాల కారణంగా రక్షణ పరంగా విదేశాలపై ఆధారపడటం సరైన ఎంపిక కాదని స్పష్టమవుతోంది” అని చెప్పారు.