కెనడా దౌత్యకార్యాలయం ముందు హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్ నిరసన
కెనడాలోని హిందూ ఆలయంపై ఖలిస్తానీలు చేసిన దాడిని ఢిల్లీ హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్ ఖండించింది. ఈ దాడిని నిరసిస్తూ కెనడా రాయబార కార్యాలయం ముందు సిక్కు గ్లోబల్ ఫోరమ్ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హిందూ దేవాలయంపై దాడి చేసిన వారిని శిక్షించాలని భారత రాయబారికి మెమోరండం సమర్పించారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగిరం చేసి, నేరస్థులపై సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో 1,200 మంది పాల్గొన్నారు. 300 మంది మహిళలు కూడా పాల్గొన్నారు. వీరితో పాటు రిటైర్డ్ ప్రొఫెసర్ హర్జిందర్ కౌర్, బ్రిగేడియర్ పి.ఎస్. గోతర, సర్దార్ తాజిందర్ సింగ్ మార్వా, సర్దార్ జితేందర్ సింగ్ శాంతి, సర్దార్ చరణ్ జిత్ లవ్లీ, రిటైర్డ్ ఐపీఎస్ గురుదేవ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
బ్రాంప్టన్ లోని హిందూ దేవాలయంపై ఖలిస్తానీ వేర్పాటువాదులు చేసిన దాడిని వీరు ఖండించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా హిందూ, సిక్కుల్లో తీవ్రమైన బాధను, భయాన్ని కూడా కలిగించిందని తమ మెమోరండంలో పేర్కొన్నారు. గురుతేజ్ బహదూర్ స్ఫూర్తితో తమ చరిత్రలో ఐక్యతను, సహజీవనానికి ప్రాధాన్యమిచ్చారన్నారు. సిక్కు గురువులు, మహారాజా రంజిత్ సింగ్ మరియు ఇతరులు వారి భక్తులు మరియు ప్రజల కోసం దేవాలయాలు మరియు గురుద్వారాలను స్థాపించడం ద్వారా సామరస్యాన్ని ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఖలిస్తానీ వేర్పాటువాదుల విషయంలో తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ భయాలను తొలగించడానికి, మైనారిటీల భద్రత కోసం కెనడా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేశారు.