చికాగో వేదికగా మరోసారి సనాతన ధర్మ వైభవాన్ని ఆవిష్కరించిన రాకేశ్ భట్
అమెరికాలోని చికాగో వేదికగా మరోసారి హిందుత్వం మార్మోగిపోయింది. హిందూ కీర్తనలతో పాటు, ఓం శాంతి ఓం శాంతి అంటూ ప్రతిధ్వనించిపోయింది. అప్పట్లో స్వామి వివేకానంద చికాగో వేదికగానే సనాతన ధర్మం గొప్పదనాన్ని పరిచయం చేశారు. ఇప్పుడు రాకేష్ భట్ అనే అర్చకుడు కూడా వివేకానంద పంథాలో సనాతన ధర్మాన్ని ప్రపంచానికి మరోసారి పరిచయం చేశారు. చికాగో వేదికగా డెమోక్రెటిక్ నేషనల్ కన్వెన్షన్ సమావేశాలు మూడు రోజులు పాటు జరుగుతున్నాయి. మూడో రోజు మేరీల్యాండ్ లోని శివవిష్ణు దేవాలయ ప్రధాన అర్చకుడు రాకేష్ భట్ వేద మంత్రాలను ఉచ్చరించారు. దీంతో ఆ ప్రాంతమంతా వేద ఘోషతో మార్మోగిపోయింది. ఈ వేద మంత్రోచ్చరణ ప్రపంచ దృష్టిని బాగా ఆకర్షించింది. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యింది. సంస్కృతంలో చదువుతూ.. వాటి అర్థాన్ని కూడా వివరించారు. దీంతో అక్కడి వారికి ఈయన ఏం చెబుతున్నారో క్షుణ్ణంగా అర్థమైపోయింది కూడా. దీంతో అందరూ వాటిల్లో లీనమైపోయారు. సనాతన ధర్మ మూలాలు కూడా తెలుసుకోగలిగారు. చివరికి ఓం శాంతి… ఓం శాంతి… అంటూ అందరి చేతా అనిపించారు.
ఈ సందర్భంగా ఆయన రాకేశ్ భట్ మంత్రార్థాలను వివరిస్తూ… ‘‘మనలో మనకు విభేదాలున్నాయి. దేశం విషయానికి వస్తే.. మనం ఐకమత్యంగా వుండాలి. ఇది న్యాయం వైపుకు వెళ్తుంది. మనమందరమూ కలిసి కట్టుగా వుండాలి. అందరూ ఒకటై, ఒక్క మనసుతో ఆలోచిద్దాం. ఇలా చేయడం సమాజ శ్రేయస్సుకే. మనమందరమూ ఏకమై, గర్వపడేలా వుందాం. అంతటి శక్తిమంతులమవుదాం. మనది వసుధైక కుటుంబం. సత్యమే మన ఆధారం. అదే ఎప్పుడూ గెలుస్తుంది. అసత్యం నుంచి సత్యం వైపుకు మమ్మల్ని నడిపించింది. అసతోమా సద్గమయా… చీకటి నుంచి వెలుగులోకి నడిపించండి. మరణం నుంచి అమరత్వం వైపుకు నడిపించండి’’ అన్న అర్థం వచ్చే మంత్రాలన్నీ జపించారు. ఈ మంత్రాల అర్థాన్ని విడమర్చి చెప్పడంతో సనాతన ధర్మ హృదయాన్ని ఆవిష్కరించడంతో పాటు.. దాని అర్థాన్ని చెప్పడంతో సనాతన ధర్మ గొప్పదనం అక్కడున్న వారికి, ప్రపంచానికి మరోసారి ఆవిష్కృతమైంది.