బాల్యంలోనే పిల్లలకు ధర్మమార్గం చూపాలి
– హనుమత్‌ప్రసాద్
రామాయణంలో బాలకాండను ఓసారి అవలోకిస్తే బాల్యంలోనే విలువల గురించి ఎంతో తెలుసుకోవాలని మనకర్థమవుతుంది. దశరథుడు తన ముగ్గురు భార్యలకు నల్గురు కుమారులు పుట్టినందుకు చాలా సంతోషపడ్డాడు. పిల్లలు పుట్టడం తల్లిదండ్రులకు ఒక ఆనందకరమైన క్షణం. అంతా శుభాకాంక్షలు చెబుతారు. ఆ పిల్లల్ని ధర్మమార్గంలో నడిపించి, ప్రయోజకులైతే సంతోషిస్తారు.
దశరథ మహారాజు సంతానం లేదన్న బాధతో పుత్ర కామేష్ఠి యాగం చేశాడు. ఋష్యశృంగుడి నిర్వహణలో అది కూడా పూర్తయింది. యాగం ఆఖరు రోజున యజ్ఞ పురుషుడు పాయసపాత్ర ఇవ్వడం, దశరథుడు దాన్ని తన భార్యలకు ఇవ్వడం, వారు గర్భవతు లవడం, చైత్రశుద్ధ నవమినాడు నల్గురు కుమారులు జన్మించడం జరిగింది. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముఖాలలో మాతృత్వం పొందామన్న తృప్తి కనపడింది. పిల్లలు పుట్టడం, పేర్లు పెట్టడం మనవైన సంస్కారాల్లో భాగం.
వశిష్ఠుడు వాళ్లకు పేర్లు పెట్టాడు. కౌసల్య కుమారుడికి ‘రామ’ అని పేరు పెట్టాడు. అందరినీ ఆనందింపజేసే వాడు అని అర్థం. కైకేయి కుమారుడికి భరతుడు అని పెట్టాడు. మంచి ఆదర్శాలను ఆచరించే వాడనమాట. సుమిత్రకు కల్గిన కుమారుడు లక్ష్మణుడు, శతృఘ్నుడు అని పేర్లు పెట్టాడు. చక్కటి గుణములు కల్గినవాడు లక్ష్మణుడు, శత్రువులను నాశనం చేయగలవాడు శతృఘ్నుడు అన్నమాట. పిల్లలకు పెట్టిన పేర్లు చూస్తేనే భావి జీవితంలో వారు సాధించబోయే విజయాలను గుర్తుచేస్తాయి. అందుకు నామకరణం ఒక సంస్కారమైంది.
నాకు బంగారం లాంటి కొడుకు లేదా కూతురు పుట్టాలని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. పేర్లు పెట్టుకోవడానికి రామాయణం మనకు ఆదర్శమవుతుంది. రాముడు లక్ష్మణుడు ఒక జట్టుగా ఉండేవారు. భరత శతృఘ్నులు కలిసి మెలిసి ఉండేవారు. ఎక్కడకు వెళ్లినా ఏం చేసినా కలిసి వెళ్లేవారు, కలిసి చేసేవారు. అన్నదమ్ముల అనుబంధానికి, అనురాగానికి ఆత్మీయతకు ప్రజలు వీరి పేర్లు చెప్పేవారు. ఆ బంధం చివరిదాకా నిలబడింది. వశిష్ఠుడు విద్యాభ్యాసానికి ఏర్పాట్లు చేశాడు. నలుగురు చక్కగా అన్ని విద్యలూ అభ్యసిస్తున్నారు. వారి బాల్య చేష్టలు, చదువు సంధ్యలు, ఆటపాటలు, ముద్దు మురిపాలు రాజమందిరం కోలాహలంగా ఉండేది. ఒక రోజు దశరథ మహారాజు కొలువుతీరి ఉండగా విశ్వా మిత్రుడు వచ్చాడు. తానొక యాగం తలపెట్టానని, దుష్ట రాక్షసులు ఆటంకాలు కల్గిస్తున్నారని, ఆ యాగరక్షణ కోసం రామ లక్ష్మణులను పంపమని అడిగాడు. దశరథుడు కంపించిపోయాడు. పదహారేళ్లు కూడా నిండని పసివారిని రాక్షసుల్ని చంపడానికి ఎలా పంపగలను? అన్నాడు.
ఇక్కడే బాలకాండ మనకు ఓ సందేశమిస్తుంది. పిల్లలను సమాజ అవసరాల కోసం ధర్మరక్షణ కోసం విడిచిపెట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. వశిష్ఠుడి మాట మేరకు రామ లక్ష్మణులు విశ్వామిత్రుడితో బయలుదేరాదు. రాళ్లనక, రప్పలనక, ముళ్లనక నడచి వెళ్లారు. పాలరాతి భవనాలలో, సుతిమెత్తని తివాచీలపై నడవవలసిన రాకుమారులు ముళ్లు గుచుచకున్నా, రాళ్లు తగిలి రక్తం కారుతున్నా లెక్కజేయక విశ్వామిత్రుని వెంట నడిచారు.
ఇదే మనం మన పిల్లలకు నేర్పవలసిన అంశం. పనితనంలో కష్టపడడం ఇష్టమనుకునే విధంగా వారిని తీర్చాలి. ఎంత గారాబం చేసిన దశరథుడు ధర్మరక్షణ ప్రథమమనుకుని పిల్లలను యాగ రక్షణ కోసం పంపాడు.