అక్రమ చొరబాటుదార్లను తరిమేయాలంటూ ‘‘ధర్మ రక్షణ సభ’’
అక్రమ చొరబాటుదారులైన బంగ్లాదేశీయులను, రోహింగ్యా ముస్లింలను వెంటనే అరెస్ట్ చేసి, వారిని బహిష్కరించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యువజన విభాగం గణేష్ సేన డిమాండ్ చేసింది. అదే సమయంలో చారిత్రాత్మక నగర వారసత్వం మరియు సామాజిక భద్రత కోసం హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని కూడా విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘‘జాబో భాగ్యనగర్ – ఛలో బాలాపూర్’’ అంటూ ఓ బ్యానర్ ను ప్రదర్శించారు. ఈ నెల 24 న బాలాపూర్ లో ‘‘ధర్మరక్ష’ సభ జరగనుందని, ఈ సభకు ప్రతి హిందువు కదిలిరావాలని పిలుపునిచ్చారు.
భాగ్యనగరం పూర్వీకుల త్యాగాలపై నిర్మాణం అయ్యిందని, హైందవ సంస్కృతికి నిలయంగా వుందన్నారు. కానీ ప్రస్తుతం అనేక కోణాల్లో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. ఈ సవాళ్లను అర్థం చేసుకొని, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఇందు కోసం ప్రతి హిందువూ ఐకమత్యంగా వుండాలని గణేష్ సేన పిలుపునిచ్చింది. ధర్మ రక్షణ సభకు తరలిరావాలన్నది కేవలం ఆహ్వానం కాదని, ప్రతి హిందువు విధి అని ప్రతినిధులు తెలిపారు. వివిధ రకాల ‘జిహాద్’ మరియు చొరబాట్ల ద్వారా సమాజాన్ని బలహీనపరిచేందుకు ఒక క్రమబద్ధమైన కుట్ర జరుగుతోందని, దీనిపై హిందువులు అప్రమత్తంగా వుండాలని పిలుపునిచ్చారు. అలాగే సామాజిక వ్యవస్థను కూడా అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని, హిందువులు మేల్కొని, ఐకమత్యంగా పోరాటం చేయాలని కోరింది.
ముఖ్యంగా అక్రమ చొరబాటుదార్లపై ప్రభుత్వాలు వెంటనే చర్యలకు ఉపక్రమించాలని, ఇది జాతీయ భద్రతకే పెను సవాల్ అనిగణేష్ సేన ప్రతినిధులు అన్నారు. ఆర్థిక, ఉద్యోగ సంబంధిత సమస్యల కారణంగా పేద హిందువులు తమ జీవనోపాధిని కోల్పోతున్నారని, సాంప్రదాయ వృత్తులను కూడా ఆక్రమించేస్తున్నారన్నారు. అలాగే రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు, డబుల్ బెడ్రూమ్ లాంటి పథకాలను కూడా అక్రమ చొరబాటుదార్లు ప్రయోజనం పొందుతున్నారని ఆక్షేపించారు. ఇక.. దీనిపై BGUS ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్. శశిధర్ మాట్లాడుతూ బంగ్లాదేశీయులు మరియు రోహింగ్యాల అక్రమ స్థావరాలను చట్టబద్ధం చేసే ప్రయత్నాలు పేదలకు సహాయం చేసే ముసుగులో చేస్తున్నారని, దేశ వ్యతిరేకులు దీనిని సువ్యవస్థీకృతం చేసే పనిలో వున్నారని మండిపడ్డారు. మానవ హక్కులు అన్న దానిని కవచంగా వాడుకుంటున్నారని, వీటిని ఓ ఓటుబ్యాంకుగా రాజకీయ శక్తులు చూస్తున్నాయన్నారు.