దీపావళి
మనకు ఎన్నో ఆపదలూ, కష్టాలూ కలుగుతూ ఉంటాయి. ఎన్నో పొరపాట్లు చేస్తుంటాము. దానికి తగినట్లే దుఃఖాన్నీ అనుభవిస్తుంటాము. ‘మనం తప్పు చేశాం. దానికి తగిన ప్రతిఫలం అనుభ విస్తున్నాం’ అని ఒక్కొక్కప్పుడు మనకే తోస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని దుఃఖాలు, కష్టాలూ మనలను చుట్టుకొన్నప్పుడు ‘అయ్యో! నేనేపాపమూ ఎరుగనే? నాకెందుకీ కష్టం? దేనీకీ బాధ!’ అని అనుకొంటాం. కారణం తెలుసుకొన్నప్పుడు మనలను మనమే ఓదార్చుకొంటాం. కారణం తెలియ నప్పుడు? మనకు కారణం తెలిసే తీరాలన్న నియమం ఉందా? కారణం తెలియని కష్టాలూ ఎన్నో కలుగవచ్చును. కారణం తెలిసినవీ కలుగవచ్చు. ఏది ఎలా ఉన్నా మనకు కలుగవలసిన కష్టం కలిగే తీరుతుంది. కలుగవలసిన దుఃఖం కలుగుతూనే ఉంటుంది. మనం కష్టపడుతున్నాం కదా ఇతరులూ దుఃఖించనీ, లోకమూ కష్టపడనీ అన్న మనోభావం మనకు ఉండరాదు. ‘మనకు బాధకల్గినా ఫరవాలేదు. లోకం క్షేమంగా ఉండాలి’ అన్న నీతిని దీపావళి బోధిస్తుంది.
మానవులుగా పుట్టాం. దానివలన మనకు కష్టములే సంప్రాప్తమౌతూ ఉంటాయి. సుఖం ఎప్పుడో ఒకప్పుడు లేశమాత్రంగా చూస్తుం టాము. పై పదవులలో ఉన్నవారికి కష్టాలు తక్కువ అని అనుకోరాదు. పదవి పైకి పోయేకొద్దీ కష్టమూ అధికమే. మేడమీద నుండి క్రిందపడితే ప్రాణానికే ఆపద. అరుగుమీద నుండి క్రిందకు జారితే ఏదో చిన్న గాయం మాత్రం కావచ్చు. ప్రతివారి జీవితంలోనూ దుఃఖం అంతర్వాహినిలా ఉండనే ఉంటుంది. మన దుఃఖాన్నే మనం గొప్ప చేసుకో రాదు. మన కష్టం నిజంగానే దుర్భరంగా ఉండ వచ్చు. కానీ మన బాధలను మనం సహించుకొని లోకక్షేమం కాంక్షిస్తూ పాటుపడాలి! ఉపదేశ గ్రంథాలలో గీతకెంత ప్రఖ్యాతి ఉన్నదో పండుగ లలో అట్టి ప్రఖ్యాతి దీపావళి మనకు సూచిస్తుంది.
- కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి స్వామి