మన దేశంలోని పొలాలు ఎందుకు సారం కోల్పోతున్నాయో తెలుసా… కారణాలివీ
గత 40 సంవత్సరాలుగా మన దేశంలో రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు, శిలీంధ్రనాశనులు వాడుతూనే వున్నారు. కొంత మంది వర్మీ కంపోస్టు వాడుతున్నారు. పొలాన్ని లోతుగా దున్నుతున్నారు. ఈ క్రియల వల్ల పొలం మట్టిలో సహజంగా వుండే వానపాములు, ఇతర సూక్ష్మజీవరాశి నాశనమయ్యాయి. జీవరాశి అంతరించడం వల్ల మట్టిలోని మొక్కల, వ్యర్ధాల్లోని పోషకాలను మొక్కల వేర్లు వినియోగించుకునే రూపంలకి మార్చే ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో నేల నిస్సారమైంది. అందువల్లే ఏదో ఒక ఎరువును బయటి నుంచి తెచ్చి వేస్తేనే పంటను పండిరచగలిగే దుస్థితికి నేలతల్లి చేరుకుంది. పొలం మట్టిలో సహజంగా వుండి, పైకి కిందికి తిరుగుతూ నేలను గుల్లచేసే వానపాములు రసాయనిక ఎరువుల దెబ్బకు 10 నుచి 15 అడుగుల లోతుకు వెళ్లిపోయాయి. రైతులు నిరంతరం ఏదో ఒక రసాయనిక ఎరువు, కలుపు నివారణ మందు, పురుగు మందు వాడుతుండటం వల్ల ఈ వాసనకు వానపాములు నేలపైకి వచ్చే అవకాశమే లేకుండా పోయింది.
మనం వాడే ఎరువులు, పురుగు మందుల వాసనను మనమే భరించలేకపోతున్నాం. ఈ మందులు చల్లే సోదరులు ఒక్కొక్కప్పుడు ఆస్పత్రుల్లో కూడా చేరిపోతున్నారు. అలాంటప్పుడు సున్నితమైన అర్భక జీవి వానపాము ఆ వాసనను ఎలా భరిస్తుంది? భూమిలో 15 అడుగుల లోతుకు వెళ్లిపోయింది. వానపాములు నేలను గుల్ల చేయకపోవడంతో నేల చట్టుకట్టుకుపోతుంది. చట్టుకట్టిన నేలను గుల్ల చేయాలని రైతులు ట్రాక్టర్లతో లోతు దుక్కులు దున్నుతున్నారు. ట్రాక్టర్ల దున్నకంతో ఏ కొంచమైనా సూక్ష్మజీవరాశి మిగిలి వుంటే అదీ ఎప్పటికప్పుడు నాశనమైపోతోంది.
మరో ముఖ్య విషయం… భూమిలో మట్టి కణాల మధ్య గాలి వుంటుంది. మట్టి మెత్తగా వుంటుంది. ఇలాంటి మెత్తటి మట్టిలో వర్షం కురిస్తే నీరు పూర్తిగా భూగర్భంలోకి ఇంకిపోతుంది. ఇలా ఇంకిన నీరు వర్షాకాలం పోయిన తర్వాత ఎండ వేడికి కేశకాకర్షక శక్తి ద్వారా చెట్ల మొక్కలకు అవసరమైనంత మేరకు అందుబాటులో వస్తుంది. రసాయనిక ఎరు?వుల పొలంలో చల్లినప్పుడు, ఆ ఎరువుల్లో వుండే లవణాలు పొలం మట్టిలోని కణాల మధ్య వున్న ఖాళీల్లోకి చేరి మట్టిని గట్టిపడేలా చేస్తున్నాయి. పైగా మనం చల్లే యూరియాలోని అమ్మోఇయా పూర్తిగా వందకు వందశాతం నైట్రేటుగా మారదు. పొలంలోని మ్కొలు, చెట్ల అవసరం మేరకు 25 నుంచి 30 శాతం అమ్మోనియా మాత్రమే నైట్రేటుగా మారుతుంది. మిగిలిన 70 శాతం అమ్మోనియా, యూరియా వేయడం వల్ల విడుదలయ్యే కార్బనడయాక్సైడ్ కలిసి, పొలంలోని మట్టికణాల మధ్య ఖాళీల్లో తిరుగుతూ మట్టిలో వుండే కోటాను కోట్ల సూక్ష్మజీవరాశిని సర్వనాశనం చేస్తున్నాయి.
మనం చల్లే యూరియాలో 46 శాతం నత్రజని, సూపర్ పాస్పేట్‌లో 16 శాత మాత్రమే పాస్ఫేట్, పొటాషియం సల్ఫేట్‌లో 48 శాతం మాత్రమే పొటాష్ వుంటుంది. ఈ మూడు ఎరువుల్లోని మిగతా శాతాలు లవణాలే. మనం ఈ ఎరువుల్లో ఏది వేసినా ప్రతిదానిలో 50 శాతానికి పైగా వున్న లవణాలు మట్టి కణాల మధ్య ఖాళీల్లో చేరి మట్టిని గట్టిపడేలా చేస్తున్నాయి. చేసేది లేక ఇలా గట్టిపడిపోయిన మట్టిని రైతులు వీలైనంత లోతు దుక్కులు దున్నించి వుండిపోతున్నారు. గత 50 సంవత్సరాలుగా ఇదే తంతు.
దేశ బడ్జెట్‌లో కోట్లకు కోట్లు వ్యవసాయానికి కేటాయిస్తున్నారు. రైతులకు ఎరువుల సబ్సిడీ పేరుతో కంపెనీలకు ఇస్తున్నారే తప్పించి, రసాయన ఎరువుల, వర్మీ కంపోస్టు కొనితెచ్చి వేయకుండా నేలను సారవంతం చేసే విషయంపై పరిశోధించడానికి ఇవ్వడం లేదు. ఈ దిశగా ఏ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనూ పరిశోధన కూడా జరగడం లేదు. ఎరువులకు ప్రకటించే సబ్సిడీ నేరుగా రైతుకు అందిస్తే రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడకుండా నేలను సారవంతం చేసుకునే విధానాలకు ఆ డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు కదా. అంటే వ్యవసాయ అభివృద్ధి కోసం కేంద్రం వినియోగించే మొత్తం ఎవరికి ఇస్తున్నారని చెప్పగలరా? ఈ దేశ ప్రజకు చెందాల్సి డబ్బును ఎవరికో ధారాదత్తం చేస్తున్నారన్న విషయం అవగతమైంది.
మన ధనాన్ని రసాయన ఎరువుల, పురుగు మందుల కంపెనీలకు ధారపోయకుండా రైతులు మేల్కొనాలి. రసాయన ఎరువులకు బదులుగా దేశీ ఆవు పేడ, మూత్రం వినియోగించి జీవం కోల్పోయిన మన పొలాలను కూడా సారవంతం చేసుకుందాం. గోమాతను నమ్ముకుందాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిద్దాం. ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను పండిద్దాం.