దేశీయ ఆలోచనలు ప్రతిబింబించే సాహిత్యం రావాలి:  శ్రీ వి.భాగయ్య

గోల్కొండ సాహిత్య మహోత్సవంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్‌.ఎస్‌.ఎస్‌ అఖిల భారత కార్యకారిణి సదస్యులు భాగయ్య గారు మాట్లాడుతూ దేశీయ ఆలోచనలు ప్రతి బింబించే సాహిత్యం రావాలి అని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం అమృతోత్స వాలు జరుపుకుంటున్నాం.. కానీ దేశానికి స్వరాజ్యం మాత్రమే వచ్చింది, స్వాతంత్య్రం ఇంకా రాలేదు అని అన్నారు. స్వాతంత్య్రం అంటే ఒక జాతికి తనదైన జీవితాన్ని గడుపుతూ మానవాళికి, ప్రపంచానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించేది అన్నారు. కానీ స్వతంత్ర దేశంలో మనం ప్రతీ దానికి ప్రభుత్వంపై ఆధారపడటం మన సమాజానికి నష్ట కారకం అన్నారు. ఈ బాధ్యతనే సాహిత్యం గుర్తుచేయాలని ఆకాంక్షించారు. విద్యా విధానంతో పాటు అన్ని జీవన రంగాల్లో మార్పు రావాలని కోరారు.

బుద్ధికి, వివేకానికి పదును పెడుతూ సాహితీ రంగం ఈ మార్పును కల్గిస్తుందని అన్నారు. మనసుకు దిశ చూపుతూ హృదయాన్ని మేల్కొలిపే సాహిత్యం ఈ పుణ్య భూమిలో రామాయణం, భారతం, భాగవతం, వేద సాహిత్యం, బౌద్ధ సాహిత్య రూపంలో మనకు అందిందని గుర్తు చేశారు. కాళిదాసు, వేమన, నన్నయ, తిరు       వళ్ళువర్‌ ‌వంటి వారి సాహిత్యం సాంస్కృతిక వికాసానికి తోడ్పడిందని యోగి అరవిందులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ సాహిత్యంలో ఆధ్యాత్మికత, ఆధునికత సమపాళ్ళలో ఉన్నాయని అన్నారు. నిన్నటి ఉదయం మళ్లీ వచ్చినట్టే మన దేశం అఖండమవుతుందని అన్నారు.

భారతీయ జీవన విధానం పట్ల అవమానలను తొలగించడానికి మన సాహితీ వేత్తలు ఎంతో కృషి చేశారని అన్నారు. ఇందుకు ఉదాహరణగా ‘‘మాతలకు మాత సకల సంపత్సమేత మన భరతమాత’’ అని గుర్రం జాషువా చెప్పిన పద్యంలోని ఒక వాక్యాన్ని గుర్తు చేశారు. చరిత మరిచిన దేశాలు కాలగర్భంలో కలిసిపోయాయి, కానీ మన దేశం అనాదిగా నిలబడటానికి కారణం మన సాహితీ వేత్తలే అని కొనియాడారు. ఈ సందర్భంగా దేశ భక్తిని ప్రబోధించిన సుబ్రమణ్య భారతి గారి పద్యాలు, సువవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ పత్రిక, ఉన్నవ లక్ష్మినారాయణ గారి మాలపల్లి నవల, భక్తరామదాసు ధార్మిక సాహిత్యాన్ని గుర్తు చేశారు.

1857 లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో నానాసాహెబ్‌, ‌ఝాన్సీ రాణి వెంట సమస్త సమాజం కదిలిందని ఈ సమాజం సంస్కృతి ఆధారంగా నడిచిందని కానీ, బ్రిటిష్‌ ‌వారు వచ్చిన తర్వాత మెకాలే విద్యా విధానంతో మన సంస్కృతిని, మన మాతృ భాషను, స్వాభిమానాన్ని దెబ్బ తీశారని తెలిపారు. దీని కారణంగా జాతీయవాదం మృగ్యమైందని అన్నారు. వీటిని ఎదుర్కొవడానికి భారతీయులు అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. గాంధీజి కన్నా ముందే లాల్‌, ‌బాల్‌, ‌పాల్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్రం కోసం మహోద్యమం నడిచిందని గుర్తు చేశారు. బెంగాల్‌ ‌విభజనను ఆపడానికి బంకిం చంద్రుడు రచించిన ఆనంద మఠం నవలలోని వందేమాతర గీతం జాతీయోద్యమానికి ఊపిరిపోసిందని అన్నారు.

మాతృభూమి పట్ల విధేయత అందరికీ సమానంగా ఉండాలని తెలిపారు. సత్యము, అహింస అనేవి మన పాటించే విలువలుగా ఉండాలని తెలిపారు. యమలోకానికి వెళ్లి సావిత్రి తన భర్తను బతికించుకున్నది. అలాగే ఉద్దాం సింగ్‌ ఇం‌గ్లాండ్‌కు వెళ్లి తన సంగ్రామాన్ని కొనసాగించాడని అన్నారు. అక్కడ ఉద్దాం సింగ్‌ ‌డయ్యర్‌తో నిన్ను కాల్చకుంటే నా మాతృభూమికి అవమానమని అన్నారు. ఈ మాటల స్ఫూర్తిగా నేతాజీ అజాద్‌ ‌హిందు ఫౌజ్‌ను స్థాపించాడని తెలిపారు. 1937లో నేతాజీ స్థాపించిన మొదటి స్వతంత్ర ప్రభుత్వాన్ని జపాన్‌, ‌జర్మని, ఇటలీ, కొరియా, ఐరిష్‌ ‌రిపబ్లిక్‌ ‌వంటి దేశాలు గుర్తించాయని తెలిపారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కొందరు నాయకులు నేతాజీని దేశ ద్రోహిగా ముద్రవేశారని వాపోయారు.

స్వతంత్రం కోసం బొంబాయి కేంద్రంగా నావికాదళ తిరుగుబాటు ఉదృతంగా సాగిందని గుర్తు చేశారు. ఇలా ఒక వైపు గాంధీజీ నేతృత్వంలో అహింసా సత్యాగ్రహం, మరోవైపు నేతాజీ నేతృత్వంలోని అజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ఉద్యమం. ఇంకోవైపు బొంబాయి నావికదళ తిరుగుబాటు ఇలా అన్ని వైపుల నుండి పోరాటం కారణంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని తెలిపారు.

ఇప్పుడు మనకు స్వాతంత్య్రం అన్ని రంగాల్లో సిద్ధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మనమింకా మానసిక బానిసత్వంలోనే మగ్గుతున్నా మని అన్నారు. అల్లోపతి వైద్యం గొప్పదైనా కరోనా కాలంలో ఆయుర్వేద వైద్యాన్ని ఐసిఎంఆర్‌ ‌గుర్తించకపోవడం దీనికి ఉదాహరణ అన్నారు. ఇలా ఆయుర్వేదం, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు అన్ని రంగాలు అభివృద్ధి పథాన సాగాలని ఆకాంక్షించారు.

నగరాల పెరుగుదల దేశానికి ఒక శాపం వంటిదని గ్రామాల్లో విద్య, వైద్యం, ఆర్థిక పరిపుష్టి వచ్చినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వస్తుందని ఆ దిశగా మన ప్రయత్నాలు కొనసాగాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *