హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
దేవీ నవరాత్రుల సందర్భంగా హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన దుర్గా అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గురువారం అర్ధరాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం స్థానికులు, హిందువులు ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే నిర్వాహకులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలియడంతో నిర్వాహకులు, హిందువులు, స్థానికులు భారీ సంఖ్యలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కి చేరుకున్నారు. విగ్రహం పగలగొట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, హిందువుల మనోభావాలు, భక్తి శ్రద్ధలతో దెబ్బతీయడానికే ఇలా చేశారని మండిపడుతున్నారు. ఇదంతా ఓ పద్ధతి ప్రకారమే జరిగినట్లుగా నిర్వాహకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట దుండగులు విద్యుత్ సరఫరాను నిలిపేసి, ఆ తర్వాత అక్కడి కెమెరాలను ధ్వంసం చేశారు.
అనంతరం అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అక్కడి పూజా సామాగ్రిని కూడా చెల్లాచెదురుగా పాడేశారు. మొదట అమ్మవారి చేతిని, తర్వాత వాహనమైన సింహాన్ని విరగ్గొట్టారు. ఆ తర్వాత అమ్మవారి చీరను తీసేసి, హోమగుండంలో విసిరేశారు. అఖండ దీపాన్ని కూడా ధ్వంసం చేశారు. అక్కడి బేరికేడ్లను కూడా ధ్వంసం చేశారని నిర్వాహకులు మండిపడుతున్నారు. అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేయడం అలవాటుగా మారిపోయిందని మండిపడుతున్నారు. మరోవైపు పోలీసులు స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.