ఈ భూమి జడ పదార్థం కానే కాదు… ఎప్పటికీ జగజ్జననియే

ఈ జాతి ఈ దేశం మనదనే భావనను లుప్తమవుతున్నది. మాతృభూమి పట్ల ప్రేమ తగ్గుతున్నది. కాబట్టే అనేక సమస్యలు వస్తున్నాయి. మాతృభూమి పట్ల ప్రేమ జనిస్తే ఇప్పుడున్న అనేక సమస్యలు తొలిగిపోతాయి. అనుకూల పరిస్థితులు తిరిగి ఏర్పడి మన జాతి మరొకసారి ప్రగతి పథాన పయనించడం ప్రారంభమవుతుంది. ఒక విత్తనం గాలికి ఎగిరి కొండపైన లేదా ఎడారిలో పడి ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది. అయినప్పటికీ అందులో జీవం ఇంకా వుంటే అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు మొక్కగా మొలకెత్తుతుంది. జాతి జీవనానికి మాతృభూమి ఆధారం. మాతృభూమి లేకుండా జాతి మనగలగడం అసాధ్యం.

జాతి ఆకాశంలో బతకలేదు. అది ఉండడానికి, బతకడానికి, తిరగడానికి భూమి కావాలి. ఒక వేళ ఆ భూమి ఎవరైనా ఆక్రమించుకున్నపటికీ అక్కడ జాతి ఛిన్నాభిన్నం అయినప్పటికీ ఆ సమాజానికి చెందిన మనుష్యులలో తమ దేశం తమ సంస్కృతి పట్ల ప్రేమ, శ్రద్ధ వుంటే చాలు. మాతృభూమి సంస్కృతుల పట్ల శ్రద్ధ కారణంగా శతాబ్దాలు గడిచినప్పటికీ తిరిగి వారు తమ జాతిని పునర్నిర్మించుకుంటారు. నదీ ప్రవాహం ఎలాగైతే కొన్ని మైళ్ల దూరం భూమిలోంచి ప్రవహించి, బయటకు వస్తుందో అలాగే జాతి కూడా పునర్నిర్మితమవుతుంది. ఇందుకు ఉదాహరణ ఇప్పుడిప్పుడే ఈ భూ మండలం మీద జరిగింది. ఇజ్రాయిల్‌ ఒక దేశంగా ఏర్పడిరది.

ఆసియా ఖండంలో యూదుల సంస్కృతి అనేక శతాబ్దాల తరబడి కొనసాగుతూ వస్తున్నది. వారిపై ఐరోపా దేశాలతో పాటు గ్రీకు కూడా యూదులపై అనేక దాడులు జరిపింది. అరబ్‌ దేశాలు కూడా ఇస్లాం మత ప్రచారంలో భాగంగా పొరుగున్న వున్న ఇజ్రాయిల్‌పై దాడులు చేశాయి. ఇజ్రాయిల్‌పై విజయం సాధించి అక్కడ వున్న పౌరులను బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చే ప్రయత్నం చేశారు. యూదులు తమ ఇళ్లు వాకిళ్లు వదిలి వెళ్లడానికి సిద్ధపడ్డారు కానీ… మతం మారడానికి సిద్ధపడలేదు. ఎవరికి ఏ దారి దొరికితే అలా వెళ్లారు. వారిలో కొంత మంది అత్యంత దయనీయ స్థితిలో హిందూ దేశానికి వచ్చారు. చాలా కష్టాలు కూడా పడ్డారు. ఇబ్బందులు పడ్డారు. తిరిగి తమ జాతిని పునర్నిర్మాణం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా ప్రయత్నం చేసి, మాతృభూమిని దక్కించుకున్నారు. కనుమరుగై పోయిందనుకున్న తమ జాతిని రెండు వేల సంవత్సరాల తరువాత ఇజ్రాయిల్‌ పేరుతో తిరిగి స్థాపించారు. రోజు రోజుకీ ప్రగతి సాధిస్తున్నారు.

మనసులో అచంచలమైన దేశభక్తి భావన ఉన్నప్పుడే జాతి సజీవంగా వుంటుంది. నిద్రలో లేపి, నీవెవరివి, నువ్వు ఎక్కడ వుంటావని ప్రశ్నిస్తే… స్వాభిమాన పూర్వకంగా సగర్వంగా నేను హిందువును. నేను హిందుస్థాన్‌లో జీవిస్తున్నాను. నాది హిందూ జాతి అని గర్వంగా చెప్పగలగాలి. మన దేశం జాతిపట్ల శరీరంలోని కణకణంలో స్వాభిమానం వుండాలి. మన అంతరంగం మన జీవితం చర్యలు అన్నీ ఈ దేశాన్ని గురించే ఆలోచిస్తూ వుండాలి. మన అంతరంగాల నుంచి ఉత్పన్నమయ్యే శక్తి ఈ జాతికి జీవం కావాలి. నిష్కల్మషమైన భక్తి భావన లేని కారణంగానే జాతి పరాభవాలు పాలయ్యింది. కాబట్టి అందరూ సంఘటితంగా వుంటూ దేశాన్ని, భూమిని కాపాడుకోవాలి.

ఈ దేశమంతా మనకొక తపోభూఇ. మన ప్రాచీన సాహిత్యంలో ప్రబోధాత్మకమైన సంఘటన ఒకటి వుంది. సత్ఫలాన్నిచ్చే తపమాచరించానికి, యజ్ఞాలు చేయడానికి అనువైన పవిత్ర భూమి ఏది? ఏది పరమాత్మ సాక్షాత్కారానికి అనుఐన ప్రదేశమని ఒక ప్రశ్న వచ్చింది. కృష్ణసార మృగం సంచరించేదే దానికి తగిన స్థలం అని సమాధానం వచ్చింది. అట్టి ప్రత్యేకమైన జాతికి చెందిన లేడి కేవలం మన దేశంలోనే వుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఈ భూమి విషయంలో స్వామి వివేకానందుల వారు ఇలా అంటారు. ధన్యమైన, పుణ్యభూమి అనేది అంటూ వుంటే అది ఈ భారత భూమియే. భగవత్సాన్నిధ్యాన్ని చేరడానికి ప్రయత్నించే ప్రతిప్రాణి తన లక్ష్య సిద్ధికి ముందు ఈ భూమిలో జన్మించి తీరాలన్నారు.

ఈ భూమి కంటే పవిత్రమైనది మనకు వేరే ఏదీ వుండబోదు. ఈ భూమిలోని ప్రతి ధూళికణం సజీవ నిర్జీవ వస్తుజాలములోని ప్రతి ఒకటి, ప్రతి రాయీ రప్పా, ప్రతి చెట్టూ, పుట్టా, మనకు పవిత్రమే. ఈ భూమికి సంతానమైన ప్రతి ఒక్కని హృదయంలోనూ, ఇట్టి ప్రగాఢ భక్తిని నిత్యనూతనంగా వుంచేందుకు గాను, గతంలో ఇక్కడ అనేక పద్ధతులు సంప్రదాయాలు రూపొందాయి. ‘‘జంబూ ద్వీపే, భరత వర్షే… భరత ఖండే…’’ అంటూ సంకల్పంలో చెప్పుకుంటాం. అలాగే ఉదయం లేవగానే భూమతను క్షమాపణ కోరే ఆచారం కూడా మనకున్నది. రోజంతా ఆ మాతృదేవిని, తన పాదాలతో స్పృశించకుండా వుండటం ఎవనికీ సాధ్యం కాదు. అందుకే… ‘‘సముద్ర వసనే దేవీ… పర్వతస్తన మండలే
విష్ణుపత్నీ నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే’’ అంటూ ఆమెను వేడుకుంటాం. అందుకే మన దేశం మనకు జీవం లేని, ఒక జడపదార్థం ఎన్నడూ కాదు. కానే కాదు. ఈ భూమి ఎల్లప్పుడూ చైతన్యపూరితమైన జగజ్జననియే.

( ధరిత్రి దినోత్సవం సందర్భంగా )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *