పాక్‌ ఆర్ధిక సంక్షోభం – పీఓకేలో అల్లకల్లోలం

పాకిస్థాన్‌ అతలాకుతలమవుతోంది. ఆ దేశంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం దెబ్బకు ఆక్రమిత కాశ్మీర్‌ విలవిలలాడుతోంది. ఎటు చూసినా నిరస నలు, ఆందోళనలు, హింసాకాండతో అట్టుడుకు తోంది. గతంలో పాకిస్థాన్‌ ప్రధాన భూభాగంలో కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు పీఓకేకి పాకి ఉధృతమయ్యాయి. ఏం చెయ్యాలో అర్థంకాక పాక్‌ సర్కారు తలపట్టుకోగా గత శుక్రవారం నుంచీ ఇప్పటి వరకూ జరిగిన అల్లర్లకు ఒక పోలీస్‌ అధికారి బలైపోయాడు, వందలాది మంది గాయాల పాల య్యారు. ప్రజలపై పాక్‌ సైన్యం ఏకంగా ఏకే47ల నుంచి తూటాల వర్షం కురిపిస్తోంది. పాక్‌ సర్కారు అసమర్ధ విధానాల ఫలితంగా అందుకోలేనంత ఎత్తుకి చేరుకున్న ద్రవ్యోల్బణం ఆ దేశ ప్రజల పాలిట విష బాణమై గుచ్చుకుంటోంది. ఆహారం, ఇంధనం తదితర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. విద్యుత్‌ చార్జీలు దారుణంగా పెరిగాయి. మరోవైపు భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపివేసిన ఫలితంగా పుండు మీద కారం జల్లినట్లయ్యింది.

ఎగబాకిన ద్రవ్యోల్బణం

నిరసనల దెబ్బకు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ రాజధాని ముజఫరాబాద్‌లో ప్రజారవాణా నిలిచి పోయి దుకాణాలు మూతపడ్డాయి. మీర్‌పూర్‌, ముజఫరాబాద్‌ ప్రాంతాల్లో పాక్‌ పారామిలిటరీ రేంజర్లు ప్రవేశించారు. అక్కడి అసెంబ్లీ, కోర్టు భవనాలకు ప్రత్యేక రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఏమాత్రం ఆర్థికాభివృద్ధి కానరాని పాకిస్థాన్‌లో మే 2022వ సంవత్సరంలో 20% పైగా ఉన్న ద్రవ్యోల్బణం మే 2023 కల్లా 30%కి ఎగబాకింది. మరీ ముఖ్యంగా పీఓకే ప్రభుత్వం పట్ల పాక్‌ సర్కారు వివక్షను ప్రదర్శిస్తోందని, మంగ్లా (నీలం-రీaలం ప్రాజెక్ట్‌) డ్యామ్‌ ఉత్పత్తి చేసే 2,600 మెగావాట్ల విద్యుత్‌లో పీఓకేకి వాటా ఇవ్వడం లేదని ఈ ప్రాంత ప్రధాని చౌదరి అన్వరుల్‌ హక్‌ ఫిర్యాదు చేసినట్లు డాన్‌ పత్రిక నివేదించింది. ఈ డ్యామ్‌ ఉత్పత్తి చేసే విద్యుత్‌లో అధిక శాతం పాక్‌లోని పంజాబ్‌ రాష్ట్రానికి తరలిస్తూ స్థానిక పీఓకే ప్రజల నుంచీ భారీగా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. ఇక ప్రభుత్వోద్యోగుల జీతాల చెల్లింపు కోసం అభివృద్ధి నిధుల్ని మళ్లించాల్సి వచ్చిందని అన్వరుల్‌ గగ్గోలు పెడుతున్నాడు. ఇవి మాత్రమే కాదు, పీఓకేలోని అడవులను నరికేస్తూ సహజ సంపదను సైతం పాక్‌ సర్కారు దోచుకుంటోంది. మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలాంటి ప్రాథమిక సౌకర్యాలు లేవు.

పుల్వామా దాడుల తర్వాత పాక్‌ నుంచి వచ్చే పలు ఉత్పత్తులపై కస్టమ్స్‌ డ్యూటీని భారత్‌ 200% పెంచడంతో పీఓకేలోని వ్యాపారులు కంగు తిన్నారు. కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పాక్‌ సర్కారు సైతం వాణిజ్యాన్ని నిలిపేసింది. ఈ పరిణామంతో ఒకప్పుడు నెలకు సగటున 45 మిలియన్‌ డాలర్లు ఉండే ఎగుమతి కాస్తా 2.5 మిలియన్‌ డాలర్లకు పడిపోయిందని పాక్‌ పత్రికలు వెల్లడిరచాయి. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం దెబ్బకు అంతర్జాతీ యంగా పెరిగిన ఆహార, ఇంధన ధరల వల్ల పాక్‌లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోయాయి. ఈ క్రమంలో జీడీపీ కూడా క్షీణించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *