‘‌నిజనిర్ధారణతోనే పాత్రికేయ వృత్తికి సార్థకత’

కేవలం వార్తాహరులుగా మిగిలిపోయేవారు పాత్రికేయులు కాలేరని శాంతా బయోటెక్నిక్స్ ‌ఛైర్మన్‌, ‘‌పద్మభూషణ్‌’ ‌పురస్కార గ్రహీత డాక్టర్‌ ‌కె.ఐ. వరప్రసాదరెడ్డి అన్నారు. నిజనిర్ధారణతో కూడిన వార్తా సేకరణతోనే పాత్రికేయ వృత్తికి సార్థకత చేకూరుతుందని ఆయన అన్నారు.

దేవర్షి నారద జయంతి సంద్భంగా ప్రపంచ పాత్రికేయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాచార భారతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో శాంతా బయోటెక్నిక్స్ అధినేత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఒక పారిశ్రామికవేత్తగా పాత్రికేయ వృత్తికి సంబంధించి అనేక దృష్టాంతాలను ఆయన వివరించారు.

పాత్రికేయులు అదేపనిగా అవినీతికి సంబంధించిన వార్తలను ప్రచురించడం ద్వారా ప్రజల్లో అవినీతికి వ్యతిరేకంగా ఉండవలసిన సున్నితత్వాన్ని నామరూపాల్లేకుండా చేస్తున్నారని డాక్టర్‌ ‌కె.ఐ.వరప్రసాదరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిచే, ప్రజలకు ఉపకరించే నిర్మాణాత్మక కథనాలతో భారతీయ సమాజానికి నాల్గవ స్థంభంగా చిరస్థాయిలో నిలిచిపోవాలని పాత్రికేయులకు విజ్ఞప్తి చేశారు. నవతరం పాత్రికేయుల్లో వృత్తి నిబద్ధతను, చిత్తశుద్ధిని పరిరక్షించే క్రమంలో వారికి ఆయా రంగాల ప్రముఖులతో పునశ్చరణ తరగతులను నిర్వహించేలా పత్రికాధిపతులు ముందుకు రావాలని ఆయన అన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సమాచారా భారతి ఉపాధ్యక్షులు జి.వల్లీశ్వర్‌ ‌మాట్లాడుతూ పాత్రికేయులు దేవర్షి నారద ముని కొలమానంగా, దేశభక్తితో పనిచేయాలని అన్నారు. దేవర్షి చేపట్టిన ఉద్దాతమైన లక్ష్యంతోనే భారత, భాగవత, అష్టాదశ పురాణాలు భారతీయ సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయని వల్లీశ్వర్‌ అన్నారు. అదే తరహా ఉద్దాతమైన లక్ష్యంతో, జాతీయ భావంతో పాత్రికేయులు పనిచేసి వారి వృత్తికి పేరు తీసుకురావాలని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో సీనియర్‌ ‌పాత్రికేయులు గోవిందరాజు చక్రధర్‌, ‌రత్నచోట్‌ ‌రాణి, సీనియర్‌ ‌కాలమిస్ట్ ‌వుప్పల నరసింహంను విశిష్ట సేవా పురస్కారాలతో, జర్నలిస్ట్ ‌గోపగోని సప్తగిరిని యువ జర్నలిస్ట్ ‌పురస్కారంతో సమాచార భారతి నిర్వాహకులు సత్కరించారు.

సమాచార భారతి వ్యవస్థాపక సభ్యులు వేదుల నరసింహం, సమాచార భారతి కార్యదర్శి ఆయుష్‌ ‌జీతో పాటుగా అనేక మంది పాత్రికేయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *