‘‘ఏక్ థాలీ.. ఏక్ థైలీ’’ కార్యక్రమంతో తగ్గిన 29,000 టన్నుల వ్యర్థాలు
ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళా ప్రపంచం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే 48 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. యూపీ ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేసింది. అయితే.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మహా కుంభమేళాను దృష్టిలో పెట్టుకొని, ప్రారంభం మునుపే ఓ కీలక ఉద్యమం చేపట్టింది. కుంభమేళా దృష్ట్యా పర్యావరణానికి ముప్పువాటిల్లకుండా ‘‘ఏక్ థాలీ, ఏక్ థైలా’’అన్న ఉద్యమాన్ని చేపట్టింది. అంటే ఒక బట్ట సంచి, ఒక కంచం (ప్లేట్). మహా కుంభమేళాలో భోజనాలు చేయడానికి ఎవరైనా ప్లేట్ అడిగితే… ప్లాస్టిక్ విస్తర్లు కాకుండా.. సమాజం నుంచి సేకరించిన స్టీల్ ప్లేటును ఇచ్చేవారు.
అలాగే వస్తువుల కోసం బట్ట సంచీ ఇస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ వాడకం చాలా వరకు తగ్గింది. ‘‘ఏక్ థాలీ, ఏక్ థైలా’’ అన్న ఉద్యమం ద్వారా 140 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. అలాగే 29,000 టన్నులకు పైగా వ్యర్థాలు తగ్గాయి.మహా కుంభమేళాకి వచ్చిన వారికి స్టీల్ ప్లేట్, బట్ట సంచులను పంపిణీ చేశారు. ఈ చొరవతో 29,000 టన్నుల వ్యర్థాలు తగ్గిపోయాయి. ఈ ఉద్యమంలో 2,241 సంస్థలు పాల్గొనగా, 7,258 కలెక్షన్ సెంటర్లున్నాయి. ఈ ఉద్యమంలో 14,17,064 స్టీల్ కంచాలు, 13,46,128 బట్ట సంచులు, 2,63,678 స్టీల్ గ్లాసులు అందుబాటులో వుంచారు. 43 రాష్ట్రాల నుంచి సేకరించారు.
సంఘ్ పర్యావరణ దృష్టికి… ఆచరణ రూపం ఇచ్చిన హిందూ సమాజం…
మహా కుంభమేళా సందర్భంగా ‘‘ఏక్ థాలీ, ఏక్ థైలా’’ అన్న ఉద్యమానికి ఆరెస్సెస్ పిలుపునిచ్చింది. దీనికి హిందూ సమాజం నుంచి విశేషంగా స్పందన వచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో కొన్ని లక్షలాది హిందూ కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. స్టీల్ ప్లేట్లు, బట్ట సంచులను ఇచ్చారు. దేశం నలుమూలల నుంచీ స్టీల్ ప్లేట్లు, బట్ట సంచులు వాహనాల్లో కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నాయి. సనాతన ధర్మంలో ప్రకృతి, పంచ భూతాలు ఈశ్వర స్వరూపం. దీనిని తూచా తప్పకుండా హిందూ సమాజం ఆచరించి చూపించింది. కుంభమేళా ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా వుండేందుకు సహాయ సహకారాలను పూర్తిగా అందించింది.
ఏక్ థాలీ, ఏక్ థైలీ అన్న ఉద్యమం ద్వారా డిస్పోజబుల్ ప్లేట్లు , గ్లాసులు, గిన్నెల వినియోగం బాగా తగ్గిపోయింది. 80 నుంచి 85 శాతం తగ్గిపోయింది. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు బాగా తగ్గిపోయాయి. 29,000 టన్నుల వ్యర్థాలను నిరోధించగలిగాం. అయితే మొత్తం వ్యర్థాలు 40 వేల టన్నులకు మించి వుండకపోవచ్చు. అలాగే ఈ ఉద్యమంతో 3.5 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఎందుకంటే రవాణా, ఇంధనం, శుభ్రపరచడం, సిబ్బంది ఖర్చులు తగ్గిపోయాయి. లేదంటే డిస్పోజబుల్ ప్లాస్టిక్ చెత్త కొనడం, ఏరడం, సిబ్బంది కేటాయింపుతో డబ్బులు ఖర్చయ్యే అవకాశాలుండేవి. వన్ థాలీ, వన్ థైలీతో ఖర్చులు తగ్గాయి.
కుంభమేళాకి వచ్చిన భక్తులు స్టీల్ ప్లేట్లలో భోజనం చేసి, మళ్లీ శుభ్రంగా కడిగేసి, అక్కడే పెట్టేస్తున్నారు. అలాగే భోజనం కూడా అవసరమైనంత మాత్రమే వేసుకుంటున్నారు. అక్కడ పనిచేసే కార్యకర్తలు, వడ్డించే వారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆహార వృథా కూడా 70 శాతం తగ్గింది.