అయోధ్య రామాలయం ప్రపంచ వింతల్లో ఒకటి కాబోతోంది : ఎలన్ మస్క్ తండ్రి

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ తండ్రి ఎర్రోల్‌ మస్క్‌ బుధవారం మధ్యాహ్నం అయోధ్య రామున్ని దర్శించుకున్నారు. రామాలయం అద్భుతంగా ఉందని, తాను సందర్శించిన వాటిలో ఉత్తమమైనదని కొనియాడారు. ఇది చాలా పెద్ద దేవాలయమని, భవిష్యత్తులో ప్రపంచ వింతగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడ ప్రజలు ప్రేమ, దయ కలిగిన వ్యక్తులు అని ప్రశంసించారు.’’ఆలయ నిర్మాణం పూర్తయ్యే దాకా ఆగలేకపోయా. ఈ ఆలయం ప్రపంచ వింతల్లో ఒకటి కాబోతోంది. భారత్ లో నాకు గొప్ప అనుభవాలున్నాయి. సర్వోటెక్ తో కలిసి పనిచేసేందుకు భారత్ కి వచ్చారు. ఈ ఆలయాలు అద్భుతం, ప్రజలూ అంతే’’ అని ఎరల్ మస్క్ అన్నారు.
మస్క్​తో పాటు ఆయన కూతురు అలెగ్జాండర్‌ మస్క్‌ కూడా దర్శించుకున్నారు. ఆ తర్వాత హనుమాన్‌గఢి దేవాలయాన్ని దర్శించుకున్నారు. రామాలయ దర్శన సమయంలో కుర్తా పైజామాతో కనిపించారు. అయోధ్యలోని మహర్షి వాల్మికీ ఎయిర్​పోర్ట్​లో ప్రత్యేక విమానం దిగిన మస్క్​, నేరుగా రామమందిరాన్ని సందర్శించారు. ఆయనకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​, హనుమాన్ గఢీ ప్రధాన పూజారి హేమంత్ దాస్​తో పాటు అధికారులు స్వాగతం పలికారు.
దాదాపు 40 నిమిషాల పాటు రామమందిరంలో గడిపారు. గురువారం శ్రీ కృష్ణ జన్మభూమి స్థల్​ను సందర్శించనున్నారు. వాస్తవానికి ఎర్రోల్‌ మస్క్‌ షెడ్యూల్‌ ప్రకారం అయోధ్యతో పాటు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ని సందర్శించాల్సి ఉంది. కానీ ఆ ప్రాంతంలోని విపరీతమైన వేడి కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. సర్వోటెక్‌ రెన్యూవబుల్‌ పవర్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌ సంస్థకు గ్లోబల్‌ అడ్వైసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన, జూన్‌ 1 నుంచి జూన్‌ 6 వరకు భారత్​లో పర్యటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *