నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు… ఆంధ్ర రాష్ట్రంలో అప్పటి పరిస్థితి

వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం.

ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, వారు ఎట్లా ఆడిస్తే, అట్లా ఆడాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రతిష్టని, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కలిసి దిగజార్చాయి.  49 సంవత్సరాల క్రితం నాటి ఈ దారుణకాండ, 21నెలల ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన అతి పెద్ద ప్రాజాప్రతిఘటన ఉద్యమాలు, 1970లు, ఆ తరువాత జన్మించిన తరాలకు పెద్దగా తెలియదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండే పెద్ద మీడియా సంస్థలు తరువాతి కాలంలో కూడా, ఈ వివరణను ప్రజలకు పూర్తిగా తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి.

ఎమర్జెన్సీ నేపధ్యం

12 జూన్ 1975 తేదిన, అలాహాబాద్ ఉన్నత న్యాయస్థానం, జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా ద్వారా, చారిత్రాత్మకమైన తీర్పు వెలువడింది, 1971 ఎన్నికలలో ప్రధాని ఇందిరాగాంధీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం ( Representative of Peoples Act), సెక్షన్ 123(7) ప్రకారం, ఆమె ఎన్నికలలో అక్రమాలకు పాల్పడిందని తీర్పు చెబుతూ, ఆమె ఎన్నిక చెల్లదని సంచలన తీర్పు ఇచ్చారు.  (ఇందిరా గాంధీ జస్టిస్ సిన్హాకు ఎన్నో రకాల ప్రలోభాలు ఆశ చూపినా, ఆయన చలించలేదు). అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం తీర్పుపైన, ఇందిరాగాంధీ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది, తాను ప్రధాని కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి గడువు కావాలని కోరింది, ఆమె తరపున ప్రఖ్యాత న్యాయవాది నానీ ఫాల్కీవాలా వాదించారు.  సుప్రీమ్ కోర్ట్ ఆమెకు 20 రోజులు గడువు ఇచ్చింది. 24జూన్ తేదిన, జస్టిస్ కృష్ణ అయ్యర్, అలహాబాద్ హై కోర్టులో ఆమె కేసు విచారణ ముగిసి, తుది తీర్పు వచ్చేదాకా, ఆమె ప్రధాని పదవిలో కొనసాగవచ్చని, అయితే పార్లమెంటు సభ్యురాలిగా వ్యవహిరంచకూడదని, జీతభత్యాలు ఉండవని తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు తరువాత ఆమె రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ఎంత ఒత్తిడి తెచ్చినా, ఆమె లెక్కచేయకుండా, 20జూన్ తేదిన, ఢిల్లీలో కోటి రూపాయల ఖర్చుతో బహిరంగ సభ నిర్వహించి, తాను తప్ప దేశానికీ వేరే దిక్కు లేదనే ధోరణిలో మాట్లాడింది. లోక్ నాయక్ శ్రీ జయప్రకాశ్ నారాయణ్, శ్రీ నానాజీ దేశముఖ్ మొదలైన నేతల  ఆధ్వర్యంలో `లోక్ సంఘర్ష్ సమితి’ ఏర్పాటై, ప్రజా ప్రతిఘటన బాట పట్టాయి.

ఎమర్జెన్సీ – అరెస్టుల పర్వం

ప్రజానాయకుల ఉద్యమాలకు కోపోద్రిక్తురాలైన ఇందిరాగాంధీ, దేశమంతా అప్రజాస్వామికంగా `అత్యవసర పరిస్థితి’ లేక `ఎమర్జెన్సీ’ విధించింది. వ్యక్తి పూజ చేస్తూ, `ఇందిరాయే ఇండియా’ అంటూ ఆమె చుట్టూ ఉన్న భజన బృందం, ఆమె నియంత నిర్ణయాలకి వంత పాడేవారే; పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్ద శంకర రే, కేంద్ర సమాచారశాఖా మంత్రి విద్యాచరణ్ శుక్లా, ఇందిరాగాంధీ సుపుత్రుడు సంజయ్ గాంధి, కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ బారువా, ఆర్కె థావన్ ఈ `కోటరీ’లో సభ్యులు. దేశంలో అంతర్యుద్ధం తలెత్తితే, అదుపుచేయడానికి ‘ఇంటర్నల్ ఎమర్జెన్సీ’ క్లాజును రాజ్యాంగంలో పొందుపరిచారు. దాన్ని అస్త్రంగా ప్రయోగించి, ‘అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ’ విధించాలని ఇందిరాగాంధీ నిర్ణయించింది. ఇందిరాగాంధీ ఏమి చేయమని చెప్పినా చేసే, అప్పటి రాష్ట్రపతి  ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, తక్షణమే దేశవ్యాప్తంగా `అత్యవసర పరిస్థితి’ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. అలా సమస్త శక్తులను, ప్రబ్బుత్వ బలగాలను గుప్పిట పెట్టుకొని తనచుట్టూ ఒక దుర్గమ వలయాన్ని ఇందిరాగాంధీ ఎర్పరచుకుంది; రిసర్చ్ అండ్ అనాలిసస్ వింగ్ – ‘రా’ గూఢచారి సంస్థద్వారా తన రాజకీయ ప్రత్యర్థులపై నిఘా  ఏర్పాటుచేసింది. ఫలితంగా దేశవ్యాప్తంగా పౌరహక్కులు హరించబడ్డాయి. వందలాది మంది వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలు అరెస్టు చేయబడ్డారు. పత్రికలపై ఆంక్షలు విధింపబడ్డాయి. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రభుత్వ సమాచార విభాగాలు ఇందిరాగాంధీ ‘బాకా’ ఊదడం ప్రారంభించాయి.

సిపిఐ పార్టీ – ఎమర్జెన్సీకి పూర్తి సహకారం

దేశంలో ఒకరకమైన భయానక వాతావరణం ఏర్పడింది. నోరువిప్పితే ఏం చేస్తారోననే భయం అంతటా వ్యాపించింది. ఇందిరాగాంధికి పూర్తి సహకారం అందించినవారు సిపిఐ పార్టీకి చెందిన కమ్యూనిస్టులు.

పత్రికలపై ఆంక్షలు- సెన్సార్షిప్

ప్రజాస్వామ్యానికి పత్రికా స్వాతంత్రం ఒక మూలస్థంభం. ఎమర్జెన్సీ ప్రకటించగానే, ఇందిరాగాంధీ ఆ వార్త బయట ప్రపంచానికి తెలియకుండా ఉండటానికి పత్రికలపై సెన్సర్షిప్ విధించింది. ఆ రాత్రి పత్రికా కార్యాలయాలన్నింటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అప్పటి `మదర్లాండ్’ పత్రిక, తరువాత ఆర్గనైజర్ వారపత్రిక సంపాదకుడు కె. ఆర్. మల్కానీతో పాటు, ప్రభుత్వ విధానాలను కలంతో ఎండగట్టే అనేకమంది జర్నలిస్టులు కూడా అరెస్టు అయారు. అయినా ఢిల్లీలో `మదర్ లాండ్’, హైదరాబాద్ లో `డక్కన్ క్రానికల్’ ప్రత్యేక సంచికలు వెలువరించాయి. జూన్ 26వ తేదీ మధ్యాహ్నానికి పత్రికలపై సెన్సార్ విధించినట్లు పిటిఐ వార్తాసంస్థ పేర్కొన్నది. ముందుగా ప్రభుత్వ అధికారి అనుమతి లేకుండా ఏ వార్తా ప్రచురించరాదని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఆదేశాలకు నిరసనగా దినపత్రికలు అన్నీ సంపాదకీయాలు రాయకుండా….. ఆ కాలంను ఖాళీగా వదిలిపెట్టాయి. ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, త్రివేండ్రం, పూనా, లక్నో, సూరత్, ఔరంగాబాదుల నుంచి వెలువడే 93 పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు నిలుపుచేశారు. 29 మంది విదేశీ పత్రికా విలేఖరులను దేశంలోకి రాకుండా ఆపివేశారు, ఏడుగురు విదేశీ విలేఖరులను దేశబహిష్కరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెలువడే ‘జాగృతి’ వారపత్రిక 16జూన్ 1975 సంచికలో ఇందిరాగాంధీకి బహిరంగలేఖ’ పేరుతో చక్కని విమర్శనాత్మక వ్యాసం ప్రచురించింది, అయితే తరువాత `జాగృతి’ పత్రిక ప్రచురణ తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. ఆంధ్రజ్యోతిలో భజనగీతాలు ప్రారంభం కావడంతో ఎడిటర్ నార్ల వేంకటేశ్వరరావు రాజీనామా చేసారు. ఏవో కొన్ని తప్ప మిగతా పత్రికలన్నీ మార్కెట్ ధరలు, సినిమా ప్రకటనలు ప్రచురిస్తూ, ఇందిర ఉపన్యాసాలకు బాకాలు ఊదుతూ మనుగడ సాగించాయి. ఫలితంగా దేశంలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలియడం లేదు. ఎల్కే. అద్వానీ అన్నట్లు ‘కొద్దిగా వంగి నడవమంటే పొట్టమీద దేకిన’ చందాన ఇందిరమ్మ ఎంత చెబితే అంత ప్రచారం చేస్తూ ప్రసార మాధ్యమాలు కొనసాగాయి. ఇప్పటి మాదిరిగా ప్రైవేటు వార్తా ఛానెళ్ళు లేకపోవడంతో అధికారిక దూరదర్శన్, ఆకాశవాణి ఏది వినిపిస్తే అదే నమ్మే పరిస్థితి ఏర్పడింది.

అరెస్టుల పర్వం

1975 జూలై మొదటి వారంలో `రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ పై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. జాతీయస్థాయిలో జూన్ 25వ తేదీ అర్థరాత్రి నుంచే అనేకమంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, జనసంఘ్ నేతలు అటల్ బిహారీ వాజ్పాయి, ఎల్.కె. అద్వానీ తదితరులు అరెస్టు అయారు. నానాజీ దేశముఖ్, జార్జి ఫెర్నాండేజ్, కర్పూరీ ఠాకూర్, సురేంద్రమోహన్, మోహన్ ధారియా, జగ్జీశ్ ప్రసాద్ మాథూలార్, డా.సుబ్రహ్మణ్యస్వామి, కేదార్నాథ్ సహానీ, దత్తోపంత్ థెన్గ్దే, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, రహస్య పర్యటనలు ప్రారంభించారు. ఆయా రాష్ట్రాలలో ప్రముఖులైన నాయకులు అరెస్టుకాగా, ప్రభుత్వ నియంతృత్వ వైఖరిపై పోరాటం చేయడానికి అనేక వందలమంది నాయకులు, కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 25జూన్1975 తేదీ అర్థరాత్రినుంచి దేశంలో భయానక వాతావరణం ఏర్పడింది; ఎప్పుడు, ఎవరిని ఎలా అరెస్టు చేస్తారో తెలియక ప్రజలు భీతావహులయ్యారు.

చాలా మంది నాయకులు అరెస్టు కాగా, ఎమర్జెన్సీ వ్యతిరేక సత్యాగ్రహ ఉద్యమం నడపడానికి, ఎంతోమంది నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు వార్త అందగానే `వినాశకాలే, విపరీత బుద్ధి’ అని జయప్రకాశ్ నారాయణ్ వ్యాఖ్యానించారు. మొరార్జీ దేశాయ్ ‘అంతా భగవదేచ్ఛ’ అంటూ జైలుకు వెళ్ళారు. ఆ రాత్రే చౌదరి చరణ్ సింగ్, చంద్రశేఖర్ తదితరులు అరెస్టు అయ్యారు. పార్లమెంటరీ కమిటీ సమావేశానికి బెంగుళూరు వెళ్ళిన అటల్ బిహారీ వాజ్పాయ్, ఎల్.కె. అద్వానీ, పీలూ మోడీ లను అదుపులోకి తీసుకున్నారు. జూన్ 25వ తేదీ అర్ధరాత్రి 400 మందిని అరెస్టు చేశారు. రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులను ఆర్ఎస్ఎస్ సంస్థ క్రియాశీలక సభ్యులను తెల్లవారేలోగా అరెస్టుచేయాలని దేశం అంతటా ఉత్తర్వులు జారీ చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి

ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు, ఎమర్జెన్సీ ప్రారంభమైన తరువాత కొద్దిరోజులపాటు కొనసాగాయి, ఆంధ్ర రాష్ట్రంలోనూ ఎమర్జెన్సీలో భయానక వాతావరణo నెలకొంది. కర్నూల్ జిల్లా న్యాయస్థానం నుంచి ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ్ ఎం. రామమూర్తి, జనసంఘ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. మల్లిఖార్జున శాస్త్రిలతో మొదలైన అరెస్టుల పర్వం, వరిష్ట స్వాతంత్రోద్యమ నాయకులైన శ్రీ గౌతు లచ్చన్న, శ్రీ తెన్నేటి విశ్వనాధం వంటి వారిని కూడా వదలకుండా, రాష్ట్రవ్యాప్తంగా జనసంఘ్, ఎబివిపి నాయకులను కార్యకర్తలను మీసా చట్టం కింద (మెయిన్టేనేన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటి ఆక్ట్) అరెస్ట్ చేసారు. `సంఘర్షణ సమితి’ రాష్ట్ర కన్వీనర్ తెన్నేటి విశ్వనాధం ఎమర్జెన్సీని ఖండిస్తూ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు.

అరెస్టు అయిన వారిలో అనేకమంది ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, జనసంఘ్ కార్యకర్తలు ఉన్నారు. డాక్టర్ చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి, డా. డి. శివప్రసాద్, డా. డి. విశ్వేశ్వరం, పిళ్ళా రామారావు, ప్రయాగ సుబ్రహ్మణ్యం, డి. వీర్రాజు వంటి ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠకార్యకర్తలను అరెస్టుచేసారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకుల భీమారావ్ దేశ్పాండే, అన్నెం చంద్రశేఖర్ మీసా క్రింద అరెస్టు అయ్యారు. జనసంఘ్ నేతలు కె. హరిబాబు, ఎన్ఎస్ రెడ్డి, డా.పివిఎన్ రాజు, వారణాసి సూర్యనారాయణమూర్తి, కొమరగిరి కృష్ణమోహన్, టి. రామాచార్యులు, జూపూడి యజ్ఞనారాయణ, డి.ఎస్పి రెడ్డి, సి. జంగారెడ్డి, సిహెచ్. విద్యాసాగర్ రావు, విఎల్. దేశ్ముఖ్, బంగారు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, ఎన్. ఇంద్రసేనారెడ్డి వంటివారు మీసాకింద అరెస్టు అయ్యారు. సుంకర సత్యనారాయణ, ఎ. చక్రధర్, కేశవరావు జాదవ్ వంటి సోషలిస్టు నేతలు కూడా మీసా కింద అరెస్టు అయ్యారు. గొట్టిపాటి మురళీమోహన్, (విజయవాడ), గౌతు లచ్చన్న, జూపూడి యజ్ఞ్యున్నారాయణ, పి.వి. రాజు (జనసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు), కేశవరావ్ జాదవ్, ఎమ్.వి. రాంమూర్తి (విజయవాడ), తుమ్మల చౌదరి, తూమాటి బాలకోటేశ్వరరావు, కొమరగిరి కృష్ణమోహన్రావు (నందిగాము. మాకినేని బసవ పున్నయ్య (సిపిఎమ్), ఓంకార్ (మార్కిస్టు ఎమ్ఎల్ఏ), ఎం.డి. రామమూర్తి, మల్లిఖార్జున శాస్త్రి (కర్నూలు) తదితరులను ‘మీసా’ చట్టంకింద నిర్భందంలో తీసుకున్నారు. వీరందరిని హైదరాబాద్లోని చంచల్గూడా, ముషీరాబాద్, వరంగల్,  రాజమండ్రిలలోని సెంట్రల్ జైళ్ళకు తరలించారు.

సంఘ్ ఉద్యమం – నడిచిన తీరు

సంఘ్ ప్రచారకులు ఆయా ప్రాంతాలలో పర్యటించి తగిన మార్గదర్శనం చేయసాగారు. అందరూ గుప్తనామాలతో పర్యటించసాగారు. స్వయంసేవకుల ఇళ్ళలోనే నేతల నివాసం. ఆ కుటుంబాలలో ఒకరిగా కలిసిపోయే వ్యవస్థ ఏర్పాటయింది.

అజ్ఞాత ఉద్యమంలో కీలకమైన అంశాలు:

  • రహస్య సంఘటనోద్యమం నిర్మాణం, నిర్వహణ. సంబంధిత వ్యక్తులు అరెస్టు అయితే ఆ స్థానాలను మరొకరితో బర్తీచేయటం.
  • కరపత్రాలు రాయడం, రాయించడం.
  • దేశమంతటా సంపర్కం నెలకొలపటం. మెరుపువేగంతో వార్తలు, సూచనలు పంపటానికి మారుపేర్లు, మారు చిరునామాలు, ఫోను నెంబర్లు, గుర్తింపు వార్తాహరుల ఏర్పాటు,
  • ప్రచార విభాగంలో భాగంగా కరపత్రాలు, సాహిత్యం సృష్టించడం, అజ్ఞాత పత్రికల ప్రచురణ – సైక్లోస్టైల్, టైపు, ముద్రణద్వారా సాహిత్య నిర్మాణం.
  • ప్రచ్ఛన్న పత్రికలు ప్రచురించడం.
  • కరపత్రాలు జిల్లాల్లోని వివిధ కేంద్రాలకు చేర్చే యంత్రాంగం ఏర్పాటు.
  • ఉద్యమ అణచివేత వార్తలు – ప్రాంత కేంద్రానికి చేర్చే వ్యవస్థ.
  • అజ్ఞాత సమావేశాల ఏర్పాటు, నిధుల సమీకరణ వగైరా.
  • వివిధ పార్టీలు, నేతలతో సంబంధాలు కొనసాగించడం అజ్ఞాత సమావేశాలు నిర్వహించడం.

 

ఆంధ్రలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలక్ గా ప్రముఖ న్యాయవాది పిన్నమనేని లింగయ్య చౌదరి వ్యవహరించారు.  ఆయనను ప్రభుత్వం అరెస్టుచేయలేదు. ప్రాంత కార్యవాహ్, ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డా. చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రిని ప్రభుత్వం ‘మిసా’ చట్టకింద అరెస్టుచేసి విశాఖ సెంట్రల్ జైలులో నిర్భంధించింది. వెంటనే అన్ని స్థాయిలలోని ప్రచారకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. రహస్య స్థావరాలు, వార్తాహరులు, చిరునామాలు… ఇలా అజ్ఞాత ఉద్యమానికి అవసరమైన వ్యవస్థ అంతా తొలి పదిరోజులలోనే ఏర్పడింది. జిల్లా, విభాగ్ ప్రచారకులు తమతమ కార్యాక్షేత్రాలలో పర్యటిస్తూ స్వయంసేవకులలో ధైర్యాన్ని మనోనిబ్బరాన్ని కలిగిస్తున్నారు. ఉద్యమ కార్యాచరణ ఈ విధంగా కొనసాగింది. ఆర్ఎస్ఎస్ దక్షిణక్షేత్ర ప్రచారక్ శ్రీ యాదవరావ్ జోషీ నిషేధం విధించిన సమయంలో కేరళలోని ఎర్నాకులంలో ఉన్నారు. ప్రచారకులందరు వెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలని ఆదేశించారు, కార్యకర్తలకు కూడా చక్కని మార్గదర్శనం చేశారు. కార్యదర్శులు, తమతమ స్థానాలలో ధైర్యంగా నిలబడి అరెస్టుచేస్తే నిర్భయంగా జైళ్ళకు వెళ్ళాలని సూచించారు. ఆంధ్రప్రాంత ప్రచారక్ గా సోమేపల్లి సోమయ్య వ్యవహరిస్తున్నారు. ఎమర్జెని ప్రకటన వెలువడగానే అంతా హైదరాబాదులోని బర్కత్పురాలో గల కేశవ కార్యాలయంనుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. రెండు రోజుల తర్వాత పోలీసులు వచ్చి సోదాచేశారు, కార్యాలయానికి సీలు వేశారు. అజ్ఞాత ఉద్యమ తయారీకోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. జిల్లా ప్రముఖ్ నియుక్తి, సత్యాగ్రహాలకు కార్యకర్తలను సిద్ధంచేయడం, ప్రచార విభాగం, సాహిత్య నిర్మాణం, ముద్రణ, పంపిణీ, కోర్టు వ్యవహారాలు, నిధుల సమీకరణ, జైళ్ళలోని వారితో సంపర్కం…. ఇలా వివిధ విభాగాలు, ఆయా పనులు నిర్వహించడానికి కార్యకర్తలు నియుక్తి…. కేవలం నెలరోజులలోనే పూర్తిస్థాయిలో సంఘటనాత్మక వ్యవస్థ ఏర్పాటైంది.

సమావేశాలు అతిరహస్యంగా జరిగేవి. ఆర్ఎస్ఎస్ కేంద్ర నాయకుల సమావేశం ఒకటి 1976జూన్ నెలలో హైదరాబాద్లో జరిగింది. అయితే ఆ సమావేశం వివరాలు చాలా కాలానికిగాని పోలీసులకు తెలియలేదు, అంత గోప్యంగా జరిగేది. ప్రతి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏదీ కాగితంపై పెట్టకూడదు. సమావేశాలు ఒక ఇంటిలో జరిగితే – అందులో పాల్గొనే వారి వసతి వేర్వేరు ప్రాంతాలలో ఏర్పాటు చేసేవారు. సమావేశం సమయానికి ఐదు నిమిషాలు ముందే సంబంధిత వ్యక్తులను కార్లలో సమావేశానికి చేర్చేవారు. సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారన్న అంశం ఎవరికీ తెలిసేది కాదు.

దేశమంతా హర్తాళ్లు, నిరసనలు, తరగతులు మరియు కోర్టుల బహిష్కరణ ముమ్మరంగా సాగింది. వ్యక్తిగత సత్యాగ్రహాలు చేపట్టినవారి అరెస్టులు కూడా ముమ్మరంగా సాగాయి. 26 జులై, ఎమర్జెన్సీ నెలరోజులైన సందర్భాన, దేశవ్యాప్తంగా, `గంటారావం’ కర్యక్రమాన, దేవాలయాలలో సాయంత్రమంతా గంటలు నిర్విరామంగా మోగుతూనే ఉన్నాయి. నెలల తరబడి, యువకులంతా, అర్ధరాత్రి సైకిళ్ళ మీద చుట్టుపక్కల గ్రామగ్రామాలు తిరిగి, కరపత్రాల పంపిణి, గోడ పత్రికలు అంటించడం, నినాదాలు వ్రాయడం వంటివి చేసి, జరుగుతున్న విషయాలు ప్రజలకు తెలియపరిచేవారు. తెర వెనుక ఎదో జరుగుతోందని ప్రజలకు అర్ధం అవడం మొదలుపెట్టింది. `ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, సత్యాగ్రహం సమరానికి సహకారం అందించండి’ వంటి విజ్ఞ్యప్తులు కూడా కరపత్రాలలో ఉండేవి.

 

విద్యార్థుల ఉద్యమం

కాలేజీ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ప్రదేశాల్లో నిరంతరంగా సత్యాగ్రహాలు చేసారు, తరగతులు బహిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం 21 జిల్లాల-354 గ్రామాలనుంచి వచ్చిన కార్యకర్తలు, 122 తాలూకాలలో సత్యాగ్రహాలు నిర్వహించారు. రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాలలో సత్యాగ్రహాలు జరిగియి. ప్రతీవారం ఒక చొప్పున నవంబర్ 14నుంచి జనవరి 26వరకు మొత్తం పది బాగా చేపట్టారు. ప్రతి బృందంలో కనీసం ఐదుగురు సభ్యులుండేవారు. సాధా సత్యాగ్రహం జట్టులో 10 నుంచి 12 మంది ఉండేవారు. దేశవ్యాప్తంగా లక్ష సత్యాగ్రహులు జైలుకు వెళ్ళారు, వీరిలో 90% మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. విశాఖజిల్లా చిన్న పట్టణమైన అనకాపల్లిలో, ఏకంగా 70మంది సత్యాగ్రహాలు చేశారు. రాష్ట్రంలో ఒకే పట్టణం నుంచి అత్యధికంగా సత్యాగ్రహం చేసిన ఘనత అనకాపల్లికి దక్కింది.

విశాఖపట్నంలో ఆంధ్రవిశ్వవిద్యాలయమలో,  సంజయ్ గాంధీ పర్యటన సందర్భంగా పెద్ద బహిరంగసభ ఏర్పాటైంది. వైద్య విద్యార్ధి, డా. వేదుల సత్యనారాయణమూర్తి నేతృత్వంలో యువ సత్యాగ్రహులు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, `భారతమాతాకీ జై!’ నినాదాలు మిన్నంటాయి. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను తీవ్రంగా కొడుతూ జైలులో నిర్బంధించారు. 25జనవరి 1976తేదీన వరంగల్ జిల్లా పరకాలలో, జనసంఘ్ నాయకుడు చిలకయ్య నేతృత్వంలో 400మంది సత్యాగ్రహం చేశారు. రెండు వరుసలలో సత్యాగ్రహులు ముందుకు కదిలారు.

  • ఆంధ్రప్రదేశ్లో సత్యాగ్రహాలకు మద్దతుగా 53కళాశాలలకు చెందిన 40వేలమంది విద్యార్థులు తరగతులు బహిష్కరించారు.
  • సత్యాగ్రహ సమరానికి చెందిన వార్తలను, ఐదువేల గ్రామాలకు 20లక్షల కరపత్రాల ద్వారా అందజేయబడ్డాయి.
  • ఆంధ్రరాష్ట్రంలో 400మంది ‘మీసా’ క్రింద, 500మంది `డి అండ్ ఆర్’క్రింద నిర్బంధింపబడ్డారు. 1700మంది సత్యాగ్రహులు ఉద్యమంలో పాల్గొన్నారు. 50మంది మహిళలు కూడా సత్యాగ్రహం చేసారు.
  • దేశంలోని అన్ని జిల్లాలలో సత్యాగ్రహాలు జరిగాయి. మొత్తం 1,25,000మంది సత్యాగ్రహం చేశారు. అప్పటికే 50వేల మంది ‘మీసా’ కింద అరెస్టు అయ్యారు.
  • పంజాబ్లోని అకాలీదళ్ కార్యకర్తలు విడిగా సత్యాగ్రహం ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు. 35వేలమంది అకాలీ కార్యకర్తలు పంజాబ్ లనివివిధ ప్రాంతాలలో సత్యాగ్రహాలు చేపట్టారు.
  • ఉత్తరభారతంలో బీహార్లో 15వేలమంది సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
  • ఉత్తర ప్రదేశ్లో 18వేలమంది సత్యాగ్రహాలు చేశారు.
  • దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటకలో 26,240మంది సత్యాగ్రహం చేశారు.
  • గుజరాత్లో 10వేలమంది సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

సత్యాగ్రహాలుచేసి జైలుకువెళ్ళిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ప్రయత్నిస్తే, వారు సున్నితంగా తిరస్కరించేవారు. సత్యాగ్రహుల తరఫున న్యాయవాదులు ఉచితంగా వాదనలు వినిపించేవారు.

 

మహిళా సత్యాగ్రహం

విశాఖపట్నం వంటి పలు నగరాలలో మహిళా సత్యాగ్రహాలు కూడా కొనసాగాయి. అంతర్జాతీయ మహిళా సంవత్సరం అయిన 1975లో, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో, ఓ మహిళ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోందని అంతా గర్వంగా చెప్పుకుంటున్న తరుణంలో, ఆమె నియంతగా మారి ప్రజాస్వామ్య హక్కులకు కాలరాచి వేలాదిమందిని అకారణంగా నిర్భందించింది. ఆమె నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మహిళాశక్తి నడుంకట్టడం ఒక విచిత్రమైన పరిణామం. ఆ తరుణంలో భారతీయ మహిళల  గౌరవాన్ని తిరిగి పునరుద్ధరించే పనికి నడుంబిగించి, స్వయంగా అనేకమంది మహిళలు సత్యాగ్రహాలు చేసి చరిత్ర సృష్టించారు. `లోక సంఘర్ష సమితి’ నిర్వహించిన ప్రచార ఉద్యమంద్వారా ఎమర్జెన్సీ వాస్తవాలు మహిళలకు తెలిసివచ్చాయి. భర్తలు జైళ్ళల్లో ఉండగా అనేకమంది తమ కుటుంబాలను పోషించుకున్నారు. కొంతమంది అజ్ఞాతంలో ఉన్న సంఘప్రచారకులకు ఆతిథ్యమిచ్చారు. అర్థరాత్రిపూట ఇంటికివచ్చిన సంఘకార్యకర్తలకు అప్పటికప్పుడు వండివార్చి వేడివేడి భోజనం పెట్టారు. తమ ఇంటిలో ఆశ్రయం పొంది ఉద్యమాన్ని రహస్యంగా కొనసాగిస్తున్న సంఘప్రచారకులను ‘అన్నయ్యా!’ అంటూ పలకరించి నైతికబలాన్ని సమకూర్చారు. అనేక నగరాలలో అనేక పర్యాయాలు అనేకమంది అజ్ఞాత వ్యక్తులు, మాతృమూర్తుల సమయస్ఫూర్తితో, సహకారంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగలిగారు.

కర్నూల్ జిల్లా శ్రీమతి ఎం. రామలక్ష్మి,  ఖమ్మంలో శ్రీమతి వక్కలంక దుర్గాదేవి, శ్రీకాకుళంలో శ్రీమతి వై. సూర్యప్రభ, తూర్పు గోదావరి జిల్లలో శ్రీమతి వారణాసి జానకీదేవి, కర్నూలులో శ్రీమతి పంచాగ్నుల భానుమతి, హైదరాబాద్లో శ్రీమతి తాయిజీ, శ్రీమతి భారతీదేవి, విశాఖపట్నంలో శ్రీమతి పోకల అనూరాధ, గుంటూరులో శ్రీమతి అనసూయమ్మ, మరెంతోమంది మహిళల నేతృత్వంలో, వందలాది మంది మహిళలు సత్యాగ్రహాలు చేసారు. 5జనవరి 1976లో సచివాలయం ముందు శ్రీమతి రమాదేవి, శ్రీమతి కమలాదేవి నేతృత్వంలో మహిళా బృందాలు కరపత్రాలు పంచి సత్యాగ్రహం చేయగా, వారిని పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రతి జిల్లాలో పెద్ద సంఖ్యలో మహిళలు సత్యాగ్రహంలో పాల్గొని నారీశక్తిని నిరూపించారు.

అజ్ఞ్యాత సాహిత్యం- రహస్య పత్రికలు

దేశవ్యాప్తంగా 200పైగా అజ్ఞాత పత్రికలు ప్రచురింపబడేవి, కాబట్టి  పదిరోజుల వ్యవధిలో ఏ వార్త అయినా దేశం అంతటా వ్యాపించేది. ఆంధ్రలో లక్షల సంఖ్యలో కరపత్రాలు ముద్రింపబడేవి. తెలుగులో 8 కేంద్రాల నుంచి పక్షపత్రికలు వెలువడేవి. విశాఖ నుంచి ‘స్వరాజ్య’, విజయవాడ నుండి ‘వందేమాతరం’, నెల్లూరు నుంచి ‘గర్జన’, అనంతపురం నుంచి ‘ఎక్స్ రే’, వరంగల్ నుంచి ‘సాధన’, హైదరాబాద్ నుంచి ‘అంతర్వాణి’, ‘ప్రజావాణి’, నిజామాబాద్ నుంచి ‘జనవాణి’ – 8 పేజీలు – 1/8 డమ్మీ సైజులో ఈ పత్రికలు సమాచారాన్ని ప్రజలకు చేరవేసేవి. ‘ఎక్స్ రే’ దినపత్రిక అనంతపూర్ నుంచి వెలువడిన అజ్ఞాత పత్రిక. సంపాదకులు కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో పనిచేసిన ఆంగ్ల ఉపన్యాసకులు శ్రీ హరిహరశర్మ, ఆయన ‘సత్యవాది’ పేరుతో సంపాదకీయాలు, వ్యాసాలు రాసేవారు. రచయిత శ్రీ వేదుల నరసింహం పత్రికలో వచ్చే వార్తలను తెలుగులోకి అనువదించి, వాటికి ఒక రూపం ఇచ్చి, ముద్రించి, జిల్లాకేంద్రాలకు చేర్చేవారు.

 

అంతర్జాతీయంగా నిరసనల వెల్లువ

ఇందిరాగాంధీ నియంత పరిపాలనపై విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులలో ఆందోళన వ్యక్తం అయింది. అధికారం నిలుపుకోడానికి దేశంలో ఎమర్జెన్సీని విధించి, ప్రతిపక్షనేతలను, వేలాదిమంది సత్యాగ్రహులను అరెస్టుచేయడం తోటి భారతీయులను కలచివేసింది. మాతృదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ తమ కర్తవ్యంగా భావించి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రవాస భారతీయులను సంఘటితం చేయాలని నిర్ణయించారు, మిత్రుల సహకారంతో నడిపిన ఉద్యమం అద్భుతమైనది. వాషింగ్టన్లో కొందరు భారతీయులు ‘ఇండియన్స్ ఫర్ డెమోక్రసీ’ అనే సంస్థను ప్రారంభించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జూన్ 27వ తేదీన షికాగోలోని భారత కాన్సలేటు ఎదుట నిరసన ప్రదర్శన జరిపారు. వాషింగ్టన్లోని రాయబార కార్యాలయం ఎదుట 200మందితో ప్రదర్శన చేపట్టారు. ‘భారత్ ఎమర్జెన్సీ ఎత్తివేయాలి’ ‘రాజకీయ ఖైదీలను విడుదలచేయాలి’ ‘ప్రెస్ సెన్సార్షిప్ తొలగించాలి’ `కోర్టు అధికారాలను కత్తెర వేయరాదు’ అనే డిమాండ్లతో బ్యానర్లు పట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. జూన్ 30న వాషింగ్టన్ నేషనల్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి భారత్లో జరుగుతున్న అరెస్టులను తెలియజేశారు. ఇంతలో నానాజీ దేశముఖ్ రాసిన లేఖతో డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి సతీమణి రొక్సానా స్వామి వాషింగ్టన్ చేరుకుంది. ఆమె రాకతో అమెరికాలోని భారతీయులకు, భారత్ ఉద్యమ నేతలకు సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికాలో వున్న ఆర్ఎస్ఎస్ సభ్యులు కొద్ది సమయంలోనే ఇతర దేశాల ప్రవాస భారతీయులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆగష్టు 15న వాషింగ్టన్లో బ్రహ్మాండమైన ప్రదర్శన, ఊరేగింపు జరిగింది. అదే రోజు లాస్ఏంజిల్స్లో కూడా ప్రదర్శిన జరిగింది.

యునైటెడ్ నేషన్స్ భవనం ముందు 1976, జనవరి 31- ఫిబ్రవరి 1 తేదీలలో `ఇండియన్స్ ఫర్ డెమోక్రసీ’ రెండవ వార్షిక సమావేశం జరిగింది. అప్పుడే అమెరికా చేరుకున్న డా.సుబ్రహ్మణ్య స్వామి 48 చోట్ల ప్రసంగించారు, 32 సార్లు రేడియో, టీవీ కార్యక్రమాలలో పాల్గొన్నారు, 18పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రముఖుల పాస్పోర్టులు రద్దుచేయడం ప్రారంభించింది. అమెరికాలో 75 మంది బ్యానర్లు పట్టుకొని వందమైళ్ళ పాదయాత్ర చేపట్టారు. ఫిలడెల్ఫియా నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు స్థానిక పత్రికలు విస్తృత ప్రచారం కలిగించాయి.

అమెరికాతోపాటు ఇంగ్లాండులోని భారతీయులు కూడా ఉద్యమించారు. `ఇండియన్ ఫ్రీడం ఫ్రంట్’ అనే సంస్థను ప్రారంభించి ఆందోళన కొనసాగించారు. 25ఆగష్టు 1975న `ఫ్రండ్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఇంటర్నేషనల్’ అనే సంస్థ ఆవిర్భవించింది. ఈ సంస్థ ఇప్పటికీ ప్రవాస భారతీయుల సహకారంతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇంగ్లాండ్లోని విస్టర్లో డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ప్రసంగించారు. 1976 ఏప్రిల్లో ఇంగ్లాండ్లో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనానికి, 15 దేశాల నుంచి 350మంది ప్రతినిధులు హాజరయారు. బిబిసితో పాటు ఇంగ్లాండులోని పత్రికలన్నీ ఈ సమావేశం వివరాలను విస్తృతంగా ప్రచురించాయి. భావ సమైక్యత కోసం `సత్యవాణి’ అనే పత్రిక ప్రచురించి, 52 దేశాలకు ఆ పత్రికను పంపిణి చేసేవారు. ఢిల్లీ జనసంఘ్ నాయకుడు, కేదార్నాథ్ సహానీ, సెప్టెంబర్ 1976లో, మలేషియా, థాయల్యాండ్, సింగపూర్, మారిషస్ దేశాలు పర్యటించారు. ప్రవాస భారతీయులు ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు అయారు.

ఎన్నికలు- విజయభేరి

ఎట్టకేలకు, అన్ని ఉద్యమాలు, ప్రయత్నాల ఫలితం దక్కింది. ప్రజలు చైతన్యం అవుతున్నారని ఇందిరాగాంధీ గ్రహించింది, పరిస్థితి చేజారిపోతోందని ఆమె ఆందోళన చెందింది. జైళ్ళల్లో వున్నవారు నిబ్బరం కోల్పోకుండా, ఏదో విధంగా ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. విదేశాలలో ‘ఎమెర్జెన్సీ’ వ్యతిరేక ప్రచారం ఊపందుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగిపోకుండా ఎన్నికల తంతు పూర్తి చేయడానికే ఇందిరాగాంధీ మొగ్గుచూపింది. 18 జనవరి 1977 తేదీ, రాత్రి 8.30 గంటలకు, ఇందిరాగాంధీ, ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, లోకసభను రద్దుచేసి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. జైళ్ళల్లోని నేతలను అందరినీ విడుదల చేస్తామని, వారంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చునని పేర్కొంది. అత్యంత స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయని హామీ ఇచ్చింది. నెమ్మది నెమ్మదిగా జైళ్ళలో వున్న రాజకీయ పార్టీల నేతలను విడుదల చేసే ప్రక్రియ ప్రారంభమైంది, అయితే జాతీయ నేతలందరూ చాలాకాలం విడుదల కాలేదు.

పాత కాంగ్రెస్, భారతీయ లోకదళ్, జనసంఘ్, సోషలిస్టు పార్టీ – నాలుగు ప్రధాన జాతీయ పార్టీల అగ్రనేతలు సమావేశమై కూలంకషంగా చర్చించి, దేశ ప్రయోజనాల కోసం, ఒకే పార్టీగా ఏర్పడినప్పుడే నియంతను ఎదుర్కొనగలమని నిర్ణయించారు, అలా జనతా పార్టీ ఆవిర్భవించింది. ఎట్టకేలకు, ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. 21మార్చ్ 1977న చారిత్రక ఎన్నికల ఫలితాలు రాగా, జనతా పార్టీ విజయభేరి మ్రోగించింది. కాంగ్రెస్ పార్టీ, ఉత్తర భారతంలో తుడిచిపెట్టుకుపోయింది. చాలా అనూహ్యంగా, విచిత్రంగా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ దిగ్విజయం సాధించింది. దేశవ్యాప్తంగా జనతాపార్టీ భారీ విజయానికి, ప్రజలు టపాకాయలు, బాణాసంచాతో సంబరాలు జరుపుకున్నారు. 21నెలల నియంతృత్వ ఎమర్జెన్సీ అంధకారం తొలగిపోయి, జనతా పార్టీ నాయకత్వంలో, శ్రీ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా, దేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *