భారీ ఎన్ కౌంటర్… 25 మంది మావోల మృతి
వనవాసీలపై ఇన్ ఫార్మర్లు అంటూ తప్పుడు ముద్రలు వేసి, చంపేసే మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ – ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా కుల్హాడీ ఘాట్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం 25 నుంచి 30 మంది నగ్జలైట్లు మరణించారు. అన్నింటి కంటే ముఖ్యంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జయరాం మృతి చెందాడు. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండల ముత్యంపై పల్లె ఆయన స్వస్థలం. ఆయనపై కోటి రూపాయల రివార్డు వుంది. మంగళవారం రాత్రి తర్వాత కూడా ఎదురు కాల్పులు, కూంబింగ్ కొనసాగింది.
మరోవైపు ఇప్పటి వరకు 15 మంది మృత దేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో 8 మందిని గుర్తించారు. ఇందులో చలపతితో పాటు ఒడిశాలో మావోయిస్టు పార్టీ కీలక నేత మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గడ్డూ కూడా వున్నాడు. ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా వున్నారు. ఇక… ఈ ఘటనలో ఓ జవాన్ గాయపడ్డాడు. అతనిని హెలికాప్టర్ లో రాయ్ పూర్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో మూడు ఐఈడీలను గుర్తించారు. ఏకే 47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.