న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ ని సహించం : ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్

న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే అసలు సహించేదే లేదని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ను తీవ్రంగా హెచ్చరించారు. ఎలాంటి దుస్సాహసానికి పాక్ తెగబడినా.. మన దళాలు చావు దెబ్బ తీసేందుకు సిద్ధంగా వున్నాయన్నారు. భారత రక్షణ దళాల సామర్థ్యం ఏమిటో ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ రుచి చూసిందన్నారు. ఆపరేషన్ సిందూర్ ఆగదని, ఉగ్రవాదం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, వెనక్కి కూడా తగ్గమని కీలక ప్రకటన చేశారు.

 

పాక్ డ్రోన్లను గాలిలోనే సైన్యం కూల్చేసిందని, టెర్రరిస్టులను సమూలంగా మట్టుపెట్టేందుకు సైన్యానికి సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చామని అన్నారు. పాక్ తదుపరి చర్యలపై ఓ కన్నేసి వుంచామన్నారు. పాక్ చర్యల్ని బట్టే మన స్పందన వుంటుందని, త్రివిధ దళాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వున్నాయన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాన్ కి కొత్త రతహా జవాబు ఇచ్చామన్నారు. పాక్ సైన్యం భారత ప్రజల్ని, దేవాలయాలను, గురుద్వారాలను టార్గెట్ చేసిందని, మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిందన్నారు. ఉగ్రవాదుల క్రూరత్వం భరించలేనంతగా వుందన్నారు.

 

పాకిస్తాన్ డ్రోన్లను, మిసైళ్లను భారత్ పై ప్రయోగించడాన్ని మొత్తం ప్రపంచమే చూసిందన్నారు. భారత్ తన సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో వాటిని నాశనం చేసిందన్నారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని, దీని ద్వారా పాక్ ప్రభుత్వం ఉగ్రవాదుల వెనుక వుందన్న విషయం తేటతెల్లమైందన్నారు. బహవల్ పూర్,మురిడ్కే అనేవి ప్రపంచ ఉగ్రవాద యూనివర్శిటీలని పేర్కొన్నారు.పాక్ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని తీసుకొచ్చామని, దీంతో బిత్తరపోయి, కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ వేడుకొందని, కాల్పుల విరమణ చర్చలకు పరిగెత్తుకుంటూ వచ్చిందని మోదీ ఎద్దేవా చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *