దేవాలయాల డబ్బును బ్యాంకుల సంరక్షణకు వాడొద్దు : సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
హిందూ దేవాలయాల డబ్బుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయాలకు చెందిన డబ్బును ఆర్థిక ఇబ్బందుల్లో వున్న కో ఆపరేటివ్ బ్యాంకులను రక్షించేందుకు ఉపయోగించవద్దని తేల్చి చెప్పింది. ఆ సొమ్ము పూర్తిగా దేవుడికి చెందిందని తేల్చి చెప్పింది. ఆ నిధులను ఆలయ ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. కేరళలోని తిరునెల్లి దేవస్థానం చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని కేరళ హైకోర్టు గతంలో ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ మనాంతవాడి కో ఆపరేటివ్ అర్బన్ సొసైటీ లిమిటెడ్, తిరునెల్లి సర్వీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సహా కొన్ని సహకార బ్యాంకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం పై విధంగా వ్యాఖ్యలు చేసింది.
సహకార బ్యాంకులు ఆదాయ వనరుగా లేదా అవి మనుగడ సాగించేందుకు ఆలయ నిధులు ఉపయోగించవద్దని తేల్చి చెప్పింది. మీరు ఆలయ డబ్బును ఉపయోగించి, బ్యాంకును రక్షించాలనుకుంటున్నారా? కష్టాల్లో వున్న ఒక సహకార బ్యాంకులో డబ్బు వుంచే బదులు, ఎక్కవ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుకు ఆ నిధులను మార్చాలని ఆదేశించడంలో తప్పేముంది?’ అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవాలని, కస్టమర్లను, డిపాజిట్లను ఆకర్షించలేకపోతే అది వారి సమస్య అని, సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే.. దేవుడి డబ్బును తిరిగి చెల్లించడానికి సమయాన్ని పొడిగించాలని కోరుతూ మాత్రమే కో ఆపరేటివ్ బ్యాంకులు హైకోర్టును ఆశ్రయించడానికి మాత్రం సుప్రీం అనుమతిని ఇచ్చింది.