పట్టు ఉత్పత్తికి ఆధునికత తోడైంది… మహిళల ఆర్థిక స్వావలంబన పెరిగింది….
పట్టు ఉత్పత్తి సంప్రదాయకంగా కాకుండా ఆధునికంగా ఉత్పత్తి చేయాలన్న అధికారుల ఒక్క ఐడియా మేఘాలయా ప్రాంతంలోని మహిళల జీవితాలనే మార్చేసింది. అక్కడి అధికారులు చూపించిన ఆధునికతతో మహిళల ఆర్థిక స్వావలంబనకు మార్గాలు పడ్డాయి. మేఘాలయా ప్రాంతంోని రి-భోయ్ జిల్లా ఎరి పట్టు సాగుకు చాలా ప్రసిద్ధం. చాలా సంవత్సరాలుగా ఈ సాగు చేయడం వారికి సంప్రదాయం కూడాను. రైతులు పట్టు కాయలను నూలుగా మార్చకుండా నేరుగా పొరుగున వున్న అసోంకి పంపిచేస్తుంటారు. దీని ద్వారా పట్టు కాయలను నూలుగా మార్చడం ద్వారా వచ్చే అత్యధిక లాభాలను పోగొట్టుకుంటున్నారు.
అంతేకాకుండా మహిళలు తమ కుటుంబ పోషణ కోసం రెండేసి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు కూడా తలెత్తాయి. ఈ ఇబ్బందికర పరిస్థితులన్నింటినీ స్థానిక అధికార యంత్రాంగం గుర్తించింది. ఓ అద్భుతమైన, వినూత్నమైన అడుగులు వేసింది. రైతులకు స్థానికంగానే మద్దతివ్వడానికి ఏకంగా 30 గ్రామాలలో 30 ఎరి సిల్క్ స్పిన్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
250 కి పైగా స్పిన్నింగ్ యంత్రాలతో కూడిన ఈ కేంద్రాలు, రైతులకు కోకన్‌ను నూలుగా సమర్థవంతంగా ప్రాసెస్ చేసే అవకాశాన్ని అందిస్తున్నాయి.కోనికా గ్రామమైన దివాన్‌లో, స్థానిక స్పిన్నింగ్ కేంద్రంలో 16 యంత్రాలు ఉన్నాయి.ఈ కేంద్రానికి ప్రతిరోజూ 20 నుండి 40 మంది ఎరి రైతులు వస్తారు.
ఈ స్పిన్నింగ్ యంత్రాలు రాక మునుపు వరకూ రైతులు సంప్రదాయ డ్రాప్ స్పిండిల్ ఆధారిత స్పిన్నింగ్ పద్ధతులపైనే ఆధారపడేవారు. ఉత్పత్తి కూడా తగ్గింది. తాజాగా స్పిన్నింగ్ యంత్రాలు వచ్చిన తర్వాత కోకన్ కిలోకి 700 రూపాయల నుంచి 800 వరకు అమ్ముతున్నారు. అలాగే నూలు నాణ్యతను బట్టి కిలోకి 2,600 నుంచి 4,000 రూపాయల వరకూ అమ్ముతున్నారు.

నూతన పద్ధతి.. పర్యావరణ అనుకూలం కూడా…
అయితే.. నూతనంగా ప్రారంభించిన ’’రిబోయ్ థ్రెడ్స్’’ మిషన్.. పట్టుపురుగుల పెంపకదారుల ఆదయాన్ని పెంచడమే కాదు.. అహింసాత్మక పద్ధతి ద్వారా పట్టు వచ్చేలా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పర్యావరణ అనుకూల ఉత్పత్తిపై దృష్టి సారించారు. దీంతో ఎరి పట్టుకు పర్యావరణ అనుకూల మార్కెట్ కూడా పెరిగింది. పట్టు పురుగులను చంపకుండా చేస్తున్నారు.
ప్రతి స్పిన్నింగ్ సెంటర్ స్థానిక వ్యవసాయ జనాభా పరిమాణాన్ని బట్టి ఎనిమిది నుండి 13 సౌరశక్తితో పనిచేసే స్పిన్నింగ్ యంత్రాలుంటాయి. ఈ యంత్రాలు సంప్రదాయ పద్ధతుల కంటే 12 రేట్లు ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఈ సెంటర్లను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించేశారు. మహిళలు కేంద్రానలు ఉపయోగించుకునేలా అధికారులు కూడా ప్రోత్సహించారు.అంతేకాకుండా స్పిన్నర్ల నుంచి నామ మాత్రపు రుసుము వసూలు చేస్తున్నారు. మొదటి దశలో 1,500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు.రెండవ దశలో మరో 1,500 మందికి శిక్షణనిచ్చారు. అలాగే ప్రతి గ్రామంలోని ఏరి మహిళా రైతులకు మాస్టర్ ట్రైనర్ కూడావుంటారు. చిన్న చిన్న మరమ్మతులను చేసేలా వారికి శిక్షణనిస్తారు. సాంకేతికత కూడా బోధిస్తారు.క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు పరిపాలనలో సహాయం చేస్తారు, డాక్యుమెంటేషన్, హాజరు పర్యవేక్షణ, రైతులను సమీకరించడం మరియు అవసరమైనప్పుడు కోకన్ ఏర్పాటు చేయడం వంటివి ఇందులో ఉంటాయి. అలాగే ఓ ‘‘యాప్’’ ను కూడా అభివృద్ధి చేశారు. ప్రతి కేంద్రంలో స్పిన్నర్లు వారి ఉత్పత్తిని మెరుగుపరచడానికి ప్రోత్సహించడానికి తూకం మరియు నాణ్యత తనిఖీ యంత్రాలు కూడా ఉన్నాయి.
లాభపడుతున్న మహిళలు…
ఈ సెంటర్ల ద్వారా స్థానిక మహిళలు ఆర్థిక స్వావలంబనను సాధిస్తూ.. విజయ పథంలో సాగుతున్నారు. కేవలం ఈ సెంటర్ల ద్వారానే డబ్బులను ఆర్జిస్తున్నారు. ఈ సెంటర్లు రాక మునుపు రెండు మూడు రకాల పనులను చేస్తూ ఆర్జించేవారు. కేవలం 5 వేల నుంచి 8 వేల వరకు మాత్రమే సంపాదించేవారు. కానీ.. ఇప్పుడు తమ ఆదాయం 20 వేల వరకు సంపాదిస్తున్నామని ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చారు.