మాజీ అగ్నివీరులకు పారామిలటరీ బలగాల్లో 10 శాతం రిజర్వేషన్స్ : కీలక ప్రకటన చేసిన అధికారులు
సైన్యంలో పనిచేసిన మాజీ అగ్నివీరులకు కేంద్ర పారామిలటరీ బలగాల్లో రిజర్వేషన్లు కలిపించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ నిర్ణయం ప్రకారం కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు కలిపిస్తామని సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్ అధిపతులు కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో చేపట్టే రిక్రూట్‌మెంట్లలో ఈ రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. అంతేకాకుండా వయస్సు, శరీర దారుఢ్య పరీక్షల్లో సైతం వీరికి మినహాయింపు వుంటుందని ప్రకటించారు. తొలి యేడాది ఐదు సంవత్సరాలు, తర్వాత మూడు సంవత్సరాల సడలింపు ఇస్తామని ఈ విభాగాల అధిపతులు తెలిపారు. 2022 జూన్ 14 నుంచి అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 17 నుంచి 21 సంవత్సరాల వయస్సున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీరులుగా పనిచేసేందుకు అర్హులని కేంద్రం ప్రకటించింది.