జాతీయ సమైక్యతకు కీలకమైంది యూసీసీ : గొగోయ్
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ఓ ప్రగతిశీల చట్టం అని రాజ్యసభ సభ్యుడు, మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ అభివర్ణించారు. ఇది జాతీయ సమైక్యత దిశగా కీలకమైనదని పేర్కన్నారు. అయితే దీనిపై ప్రభుత్వం కచ్చితంగా ఏకాభిప్రాయ సాధన చేయాలని సూచించారు. సూరత్ లిటరరీ ఫెస్టివల్ సందర్భంగా న్యాయవ్యవస్థకు సవాళ్లు’’ అన్న దానిపై మాట్లాడారు. ఉమ్మడి పౌరస్మృతి అనేది చట్టం అనేది వివిధ ఆచార పద్ధతులను భర్తీ చేయడానికి ఉద్దేశించిన ఓ ప్రగతి శీల చట్టమని పేర్కొన్నారు.
జాతీయ సమైక్యత దిశగా ఇదో కీలకమైన అడుగు అని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. రాజ్యాంగంలోని 25, 26 అధికరణలకు ఇదేమీ విరుద్ధంగా లేదని స్పష్టం చేశారు.దత్తత, వివాహం, విడాకులు మరియు వారసత్వం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది గోవాలో ప్రభావవంతంగా పని చేస్తోందన్నారు. దీని విషయంలో ఏకాభిప్రాయాన్ని నిర్మించడం చాలా కీలకమన్నారు. దేశాన్ని ఏకం చేయడానికి ఇదొక్కటే మార్గమని తేల్చి చెప్పారు. ఒక దేశంలో ఇలా చాలా విరుద్ధమైన చట్టాలను కలిగి వుండొద్దన్నారు. అయితే ఈ ప్రక్రియను హడావిడిగా చేయవద్దని అందర్నీ కోరుతున్నానన్నారు. యూసీసీ విషయంలో ప్రజలకు లోతైన అవగాహన కల్పించాలన్నారు. కొందరికి ఇది పూర్తిగా అర్థం కాకపోవచ్చని, లేదా కొందరు దీనిపై తొంగికూడా చూడరని, కానీ… మనం భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, ముందుకు సాగాలన్నారు.