పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 13 రూపాయల నుంచి 3 కి, డీజిల్ పై 10 నుంచి సున్నాకు తగ్గించింది. దీంతో వినియోగదారులకు పెద్ద ఉపశమనం చేకూరింది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం నెలకొన్న సమయంలో పెట్రోల్ ఇంధన కొరత తీవ్రంగా వుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. గత నెల రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు వరకూ వెళ్లిందని, దీంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయన్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో 30 నుంచి 50 శాతం, ఉత్తర అమెరికాలో 30 శాతం, ఐరోపాలో 20 శాతం, ఆఫ్రికా దేశాల్లో 50 శాతం మేరక ఇంధన ధరలు పెరిగాయని, కానీ మన దేశంలో పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ, వీటిని పెంచలేదన్నారు. అలాగే చమురు కంపెనీల అధిక నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వ పన్ను ఆదాయాన్ని తగ్గించుకున్నామని, అదే సమయంలో విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనంపై ఎగుమతి పన్ను విధించామన్నారు.