‘కుటుంబంలో ఐక్యత, దేశభక్తి జాగృతమవ్వాలి’
కుటుంబంలోని ఐక్యత, దేశభక్తి జాగృతం కావడం వలన దేశం శక్తివంతం అవుతుంది అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ జీ అన్నారు. వాస్తవానికి కుటుంబమే దేశ ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక ఐక్యతను సూచిస్తుందని, కుటుంబ ప్రబోధమనే మాధ్యమం ద్వారా సంఘం సమాజంలోని సమతుల్యత, పరస్పర సహకారం, సహృద్భావం పెంపొందించే కృషి చేస్తోందన్నారు.
మహాత్మా జ్యోతిబా పూలె రూహీల్ఖండ్ విశ్వవిద్యాలయంలో అటల్ సభా ప్రాంగణంలో కార్యకర్తల సమావేశంలో మోహన్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ప్రతి వ్యక్తికీ సంస్కారం అనే సుగుణం మొట్టమొదటిగా తన కుటుంబం నుండే లభిస్తుందని తెలిపారు. ఉత్తమ సంస్కృతీ, చరిత్ర కలిగి దేశం పట్ల అంకిత భావం కలిగిన సమాజాన్ని తయారు చేయడంలో కుటుంబానిదే ముఖ్య భూమిక అన్నారు. అందుకే సంఘ స్వయంసేవకుల కుటుంబాలను భారతీయ మూల సంస్కృతి భావాలతో జోడిరచి సమాజాన్ని స్వశక్తితో నింపాలన్నారు. ప్రజలు వారి పరంపరాగత సంస్కృతిని కలిగి ఉండడానికి వారి మూల వేష భాషలు, స్మరణ భావన, ఆహార విహారాదులను సొంతం చేసుకోవాలన్నారు.
గత వంద ఏళ్లల్లో సంఘం ఎంతో విస్తృతి చెందిందని తెలిపారు. సంఘ ఆలోచనా ధోరణి పట్ల ఆకర్షితులై ప్రభావితులైన దేశ ప్రజలు సంఘంపై ఆశావహులై చూస్తున్నారన్నారు. సమాజంలో సంఘ ముఖ చిత్రం సంఘ సేవకుల నడవడిక ఆచరణలతోనే ఏర్పడుతుందన్నారు. సంఘ సేవకుల ఆచరణలు ఎంత ఉన్నతంగా ఉంటాయో సమాజంలో సంఘ పట్ల ఏర్పడే భావన చిత్రం కూడా అంత ఉన్నతంగా ఉంటుంద న్నారు. స్వయంసేవకులు వారంలో ఒక్క రోజైనా తమ పరివారాలతో బంధుమిత్రులతో విందు వినోదాలలో మాత్రమే గడపకుండా దేశం గురించి, మన వారసత్వాల గురించి కూడా తప్పక చర్చించాలని సూచించారు.
స్వయంసేవక కుటుంబాలు వివిధ జాతి, భాష ప్రాంతాల వారితో మైత్రి సంబంధాలు కలిగి వారితో తరుచు కలిసి మెలిసి భోజనాది చర్చలు జరపాలన్నారు. వివిధ ఆర్ధిక స్థాయిలలో కుటుంబాల మధ్య కూడా సుహృద్భావ, పరస్పర సహకార భావాలు ఏర్పడడానికి కూడా స్వయం సేవకులు కృషి చేయాలన్నారు. సమర్ధ, సంపన్న, బీద పరివారాల మధ్య సయోధ్య కుదిరితే అనేక ఆర్ధిక, సామాజిక సమస్యలు వాటంతటవే సమసిపోతాయని మోహన్ జీ అన్నారు. దేశభక్తి, సద్భావన, విమోచన మరియు క్రమశిక్షణ మన స్వయంసేవకులు జీవన మంత్రమై ఉండాలి. దేశభక్తి అంటే కేవలం దేశాన్ని పూజించడమే కాదు మనం కూడా మన భారత దేశాన్ని అర్ధం చేసుకుని అలాంటి నడవడిక కలిగి ఉండాలి. ఇదే అసలైన దేశ భక్తి అని తెలిపారు. ఈ సందర్భంగా భయానక దేశ విభజన స్మృతి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో దేశ విభజన జరిగిన సమయంలో వివిధ ప్రదేశాలలోని చిత్రాలు, వార్తా పత్రిక కధనాలు పలు సేకరణల ద్వారా లభించిన విషాద చిత్రాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమములో క్షేత్ర, ప్రాంతీయ మరియు వివిధ విభాగాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.