కుటుంబ విలువలు
భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ధర్మాచరణకు కుటుంబ వ్యవస్థ మూలస్తంభం. అటువంటి కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు అని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మనం ఒక జాతిగా ఇన్ని సంవత్సరాలు నిలబడేం దుకు మూలస్తంభం కుటుంబ వ్యవస్థ. ఇది నిలబడదు అని చెబుతున్న వారు చెబుతున్న కారణాలు చాలా చిన్నవి. హాస్యాస్పదమైనవి. అతి తెలివి, గర్వము, డబ్బుందన్న అహంకారం భగవద్గీత చదివి అర్ధం చేసుకున్నవాడికి వుండదు. ‘విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శనః’ అంటుంది భగవద్గీత. తెలివి వుండగానే సరిగాదు పండితుడు, గోవును, ఏనుగును, కుక్కను, కుక్కమాంసం తినేవాడిని సమదృష్టితో చూసేవాడే నిజమైన జ్ఞానబలం ఉన్నవాడని అర్థం. తెలివి వేరు జ్ఞానం వేరు. మన పిల్లలకు భగవద్గీతలో ఈ శ్లోకం చెబితే నిజమైన జ్ఞానం గురించి తెలుస్తుంది. ‘నా అంత తెలివైన వాడు ఎవరూ లేరు అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. జ్ఞానం సముద్రం వంటిది. కాబట్టి అహంకారం అక్కరకురాదు. తప్పులు చేస్తూ చేస్తూనే పనిలో వ్యవహారంలో ప్రావీణ్యత లభిస్తుంది. పిల్లలు తప్పులు చేస్తారు. పెద్ద వాళ్ళే చేస్తున్నారు. తప్పు చేయడం సహజం. తెలుసుకోవడం దైవత్వం. మన సనాతన ధర్మంలో ఆ అవకాశం యిచ్చారు. దీన్నే పశ్చాత్తాపం అన్నారు. పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదన్నారు. పిల్లలు, పెద్దలు కూర్చుని మాట్లాడుకోవడం, కుటుంబంలో సహజసిద్దంగా జరగాలి. పిల్లల చదువులు, ఉద్యోగాలతో బాటు జీవన విలువల గురించి చర్చ కూడా చేయాలి.
5 ఏళ్ళ వరకు పిల్లల్ని దేవుడిలా పెంచ మన్నారు. అలాగని అవసరమైతే చెంప చెళ్ళుమని పించద్దనలేదు. ప్రేమతో పిల్లల్ని పెంచితే వారికి ఈ ప్రేమ స్పర్శ తెలిస్తే వారిలో రాక్షస గుణం ప్రవేశించదు. పిల్లల చేతిలో తల్లిదండ్రులు బానిసలు కాకూడదు. ఆ తరువాత పదేళ్ళ పాటు వారికి పనులు చెప్పాలి. వారిని సేవకులుగా పరిగణించాలి. 18 ఏళ్ళ తరువాత వారికి నిర్ణయం తీసుకునే స్చేచ్ఛను ఇవ్వాలి. పెద్దలు సలహా చెప్పాలి. సలహా పాటిస్తే మంచిదని చెప్పాలి. పాటించక పోయినా ఫరవాలేదన్న స్చేచ్ఛ వారికివ్వాలి. అవి ఆర్థిక విషయాలైనాసరే! ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పేరున పిల్లలు ఇల్లు దాటి ఆలోచించడం కాకుండా ఇంట్లో పరిస్థితి వారికి తెలిసేలా పెద్దలు పవర్తించాలి. ఇంట్లో వారంలో ఒక రోజు కుటుంబ సభ్యులంతా కూర్చుని సరదాగా అన్ని విషయాలు అరమరికలు లేకుండా మాట్లాడుకుంటే అలగడం, కోపం, నీలగడం, దురుసుతనం వంటి అవలక్షణాలు లేకుండా పరస్పర గౌరవంతో జీవించే అవకాశం వుంటుంది. పోతన గారు భాగవతంలో శివుణ్ణి పార్దిస్తూ ఎనిమిది కుటుంబ విలువలను ప్రస్తావన చేస్తారు. అందులో వొకటి ‘శిఖరిజ ముఖ పద్మ పాలికిన్’ సూర్యకిరణాలు పడగానే పద్మం వికసించి నట్లు భర్త భార్యతో వ్యవహారించాలని అర్ధం.
శివుడు బయట ఎన్ని రకాలుగా ఉగ్రరూపుడైనా, రాక్షస సంహారం చేసినా పార్వతి వద్ద ప్రేమగా ఉంటాడు. అందుకే శివ కుటుంబం ఆదర్శ కుటుంబంగా మనం భావిస్తాం. అలా ఆలుమగలు సమస్యలు పంచుకుని కష్ట సుఖాలు పంచుకుని వ్యవహిరించినట్లు పిల్లలు చూస్తే పెళ్ళి పట్ల వారి వైఖరి గుణాత్మకంగా సానుకూలంగా వుంటుంది. ఒంటరి బతుకు వద్దనిపిస్తుంది. మనసునమనసై బ్రతుకున బ్రతుకై తోడువొకరుండాలి అనిపిస్తుంది. అపుడు భార్యాభర్తలు కలిసి కుటుంబం నిర్వహిం చాలి అనే విషయం పిల్లలకు అర్ధం అవుతుంది. అశోకవనంలో హనుమంతుడు సీతను చూసినపుడు ఆమె వొక విషయం చెప్పింది. పెళ్ళయిన కొత్తల్లో సీత రాముణ్ణి అడిగింది. ‘నన్ను ఎందుకు యిష్టపడి పెళ్ళి చేసుకున్నారు’ అని. అపుడు గురువు విశ్వామిత్రుడు, పెద్దలు చెప్పారు కనుక అన్నాడు రాముడు. తరువాత ఆమె గుణవతిగా, రూపవతిగా రాముణ్ణి మెప్పించింది. తరువాత రాముడు ‘నీ కారణంగా నిన్ను యిష్టపడుతున్నాను’ అన్నాడు.
అందుకే ‘రాముడు నన్ను ప్రేమించాడు, అందుకే ఈ వియోగ బాధ’ అన్నది సీత. శరీర బాధలైనా, మానసిక బాధలైనా, ఆపదలు వచ్చినా, ఆర్ధిక యిబ్బందులు వచ్చినా కుటుంబంలో ఆలుమగలు అనురాగంతో వుంటే ఏ బాధలూ ఏమి చేయలేవు అన్నది యోగవాశిష్ఠం. ఇంట్లో పెద్దవాళ్ళు వుంటే ఇంటికి పెద్ద అండ. వారికి అనుభవం ఎక్కువ. భార్య భర్తల అనురాగాన్ని, వారు ఇంట్లో వృద్ధుల పట్ల (తాత, అమ్మమ్మ యిలా) ప్రదర్శిస్తున్న ఆచరణను పిల్లలు గమనిస్తారు. అదే వారికి జీవిత పాఠం అవుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు సమయం ఇవ్వాలి. వారు చెప్పేది వినాలి. అపుడే వారు తల్లి దండ్రులు చెప్పేది వింటారు. అపుడు సమస్యలన్నీ పటాపంచలై పోతాయి.
మానవ సంబంధాలు నిలబెట్టుకోవడం మనం భావన చేయడంలో వుంటుంది. మార్కెట్ బంధాలుగా చేసుకునే వారిని చేసుకోనివ్వండి. మన ప్రయత్నం మేరకు మనం ఆత్మీయుల్ని సంపాదించుకో వాలి. ఆధిపత్యపోరులో మనం పడకుండా జాగ్రత్త పడాలి. ప్రేమతోనే ఎదుటి వారిని గెలుచుకోవాలి. మధ్యవర్తిత్వం ఒక కళ. ఇప్పటికీ ఆ కళ వున్నవారున్నారు. వారిని గౌరవించాలి. వారిని ప్రోత్సహించాలి.
- హనుమత్ ప్రసాద్