అమ్మమ్మ, బామ్మలతోనే కుటుంబ విలువలకు సార్థకత
న్యూక్లియర్ కుటుంబాలు పెరిగిపోతున్న వేళ.. ఇంటి పరిధి తగ్గిపోతోంది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునే తల్లిదండ్రులు, వాళ్లకు ఒకరో, ఇద్దరు పిల్లలుగా మారిపోయిన పరిస్థితి. అటువంటి పిల్లలకు కుటుంబ విలువలు, ఆత్మీయత తెలియాలంటే అమ్మమ్మలు, బామ్మలతో అనుబంధం చాలా అవసరం. ఇంతటి ముఖ్యమైన అంశాన్ని తెలియ చెప్పేందుకు శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ చొరవ తీసుకొంది. ఆత్మీయ భరితంగా గ్రాండ్ పేరెంట్స్ డేను నిర్వహించింది. స్కూల్‌లో చదవుతున్న చిన్నారులంతా తమ తమ తాతయ్య, అమ్మమ్మ, బామ్మలను తీసుకురావాలని ఆహ్వా నించింది. పెద్దవారి ఆత్మీయత, ఆశీస్సులు ఈ తరానికి అందించేందుకు సంకల్పించింది.
ఈ వినూత్న కార్యక్రమానికి వందల సంఖ్యలో బామ్మలు, తాతయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 60 ఏళ్ల పైబడిన అమ్మమ్మలు, బామ్మలు చిన్న పిల్లలుగా మారిపోయారు. మనుమలతో కలిసి పోయి ఆట పాటలతో సందడి చేశారు. తాతయ్యలు, బామ్మలతో చిన్నారులంతా కలిసిపోయి నందనవనాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో విద్యాభారతి మూడు రాష్ట్రాల ట్రెజరర్ పసర్తి మల్లయ్య, ప్రిన్సిపల్ గోకులన్, వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి కార్యక్రమ ఉద్దేశ్యాలను వివరించారు.
గ్రాండ్ పేరెంట్స్ మాట్లాడుతూ, కేవలం కార్యక్రమంలో పాల్గొనడానికి దూరప్రాంతాలనుంచి వచ్చామని, కార్యక్రమం చాలా బాగా జరిగిందని, పోటీలలో పాల్గొంటున్న పుడు వారికి చిన్ననాటి విశేషాలు గుర్తుకువచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఎగ్జిబిషన్, సంగీత పోటీలు నిర్వహించారు.