రైతుల కోసం ‘‘వాలెంటీర్ల వ్యవస్థ’’ను తీసుకురానున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో రైతు వాలెంటీర్ల వ్యవస్థ రాబోతోంది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం రైతుల విషయంలో ఈ వ్యవస్థను తీసుకురానుంది. రైతులకు ఉపయోగపడేలా ‘‘సాయిల్ హెల్త్ వాలెంటీర్లు’’ ను నియమిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులకు మేలు చేకూర్చేలా ఈ వ్యవస్థను పటిష్టం చేసి, దాదాపు 30 వేలకు పైగా రైతు వాలెంటీర్లను ప్రభుత్వం నియమించనుంది. ఇందు కోసం ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసేసింది.

భూసారాన్ని సంరక్షించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన యువ రైతులు ఈ వాలెంటీర్లుగా రానున్నారు. సాయిల్‌హెల్త్‌ వలంటీర్లుగా నియమించిన కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన 126 మంది యువరైతులకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో రెండు రోజులు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు.

భూసారం కోల్పోకుండా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడమే లక్ష్యంగా సాయిల్‌హెల్త్‌ వలంటీర్లు పనిచేస్తారు. గ్రామానికి ఒక వాలెంటీర్ చొప్పున వీరిని నియమిస్తారు. ప్రయోగాత్మకంగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. త్వరలోనే రాష్ట్రమంతా ఈ వాలెంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

అధిక దిగుబడులు సాధించాలంటే భూసారాన్ని బట్టి పంటలు సాగు చేయాలని, తరచుగా పంట మార్పిడి చేయాలని రైతులను ఈ వాలెంటీర్లు ప్రోత్సహిస్తారు. దీనిపై రైతులకు పూర్తి అవగాహనను కూడా కల్పించనున్నారు. శాస్త్రీయమైన విధానాలపై రైతులకు సూచనలు చేస్తూ, తక్కవ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఇందుకు అవసరమైన సూచనలు అందించేందుకు ఇక్రిశాట్‌తో ఒప్పందం కూడా జరిగింది.

భూసార ఆరోగ్య పరిరక్షణను ఉద్యమంలా చేపడతామని తుమ్మల తెలిపారు. పంట కొసాక వాటి అవశేషాలను తగలబెట్టకుండా ఎరువులుగా మార్చుకోవాలని రైతులకు సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని రైతులు నిలిపివేయాలని, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచాలన్నారు. భూమిలో రసాయనాలు లేకపోతే పౌష్టికాహారంతో కూడిన పంట పండుతుందన్నారు. జీలుగు, పిల్లిపెసర, పచ్చిరొట్ట విత్తనాల ద్వారా రైతులు భూసారాన్ని పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం రైతుల్లో అవగాహన తెస్తోంది.

ముఖ్య పాత్ర పోషించనున్న కృషి విజ్ఞాన కేంద్రాలు…

ఈ వాలెంటీర్లకు భూసార పరీక్షలు, వాటి ఫలితాలను అర్థం చేసుకొని, అన్వయం చేసుకోవడం, పంటలకు అనుగుణంగా ఎరువుల వినియోగం వంటి వాటిపై కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతు విజ్ఞాన కేంద్రాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ రెండు కేంద్రాలే వాలెంటీర్లకు శిక్షణనిస్తాయి. రోజుకు సుమారు వెయ్యి మందికి శిక్షణనిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న భూసార పరీక్షా కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల కృషి కేంద్రాలు, పరిశోధనా ల్యాబ్ లతో పాటు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ లను వినియోగిస్తూ భూసార పరీక్షలను చేస్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *