ఎప్పుడూ వరి వేసే రైతులు, ఈ సారి జామ పంటతో ప్రయోగం… సక్సెస్ లో రైతులు

ఉర్బా వర్ధమాన్‌,… వ్యవసాయ పరంగా బెంగాల్‌ రాష్ట్రంలో ఉచ్ఛ స్థాయిలో నిలబడుతుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తికి అత్యంత అనుకూలం. రైతులు కూడా బాగా చురుకుదనం, అవగాహన కలిగిన రైతన్నలు వుంటారు. అయితే.. ఈ జిల్లా ఎక్కువగా వరిని ఉత్పత్తి చేస్తుంటుంది. కానీ… ఈ సారి అక్కడి రైతులందరూ ప్రత్యామ్నాయ పంట వైపు మళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. వరి పంటను అధిక మొత్తంలో కాకుండా… తక్కువ మోతాదులో వేసుకుంటూ… ఈ సారి జామ పంటపై ఎక్కువ దృష్టి సారించాలని అందరూ నిర్ణయించుకున్నారు. దీని ద్వారా ఆదాయాన్ని బాగా పొందవచ్చని భావించారు. దేశ వ్యాప్తంగా జామ పంటకి బాగా డిమాండ్‌ వుందన్న వార్తలను తెలుసుకొని, అత్యంత ధైర్యసాహసాలతో పంట మార్పిడికి పూనుకున్నారు. విజయ పథంలో కొనసాగుతున్నారు. బెంగాల్‌ రాష్ట్రంలో జామ కాయలను బాగా ఇష్టపడతారు, వినియోగం కూడా పెద్ద మొత్తంలో వుంటుంది కాబట్టి.. రైతులకు కలిసొస్తుంది.

పుర్బస్థలి అనే గ్రామానికి చెందిన ఓ రైతు మాట్లాడుతూ… జామ సాగుతో అనేక ప్రయోజనాలు వున్నాయన్న విషయాన్ని తాము తెలుసుకొన్నామని, అందుకే ఈ సారి ఈ పంటను వేశామన్నారు. అయితే.. జామకాయలు మార్కెట్‌లో పుష్కలంగా వుంటే… కాస్త ధర తగ్గుతుందని, చలి కాలంలో మాత్రం బాగా ధరలు వస్తాయన్నారు. ఒకసారి బిగ భూమిలో జామను పండిస్తే… 14 నుంచి 15 వేల రూపాయలు వస్తాయన్నారు. నాటిన రెండేళ్ల తర్వాత దిగుబడి వస్తుందని, మూడో సంవత్సరం నుంచి దిగుబడి పుంజుకుంటుందని తెలిపారు. వరుసగా 8 సంవత్సరాలు మంచి దిగుబడిని, లాభాలు ఇస్తుందన్నారు. అయితే… తాము జామ సాగు కోసం కూలీలను పెట్టుకోకుండా… ఒకరికి ఒకరు సాయం చేస్తూ.. స్వయంగా సాగు చేసుకుంటున్నామని తెలిపారు.

చాలా మంది రైతులు తమ జిల్లాలో ఈ సారి జామను ప్రత్యామ్నాయ పంటగా ఎంచుకున్నారని తెలిపాడు. ఒక్కసారి జామ చెట్టును నాటితే 7 నుంచి 8 సంవత్సరాల వరకూ నిరంతర దిగుబడి వస్తూనే వుంటుందని, ఈ ప్రత్యామ్నాయ పంటను తాము ఎంచుకోవడానికి ఇది కూడా ఓ కారణమని తెలిపారు. తాము మార్కెట్‌లోకి వెళ్లక ముందే హోల్‌సేల్‌ వ్యాపారులే తమ తోటల దగ్గరికి వచ్చి, పెద్ద మొత్తంలో తీసుకెళ్తున్నారని తెలిపారు. దీంతో తమకు పెట్రోల్‌ ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా కలిసి వస్తున్నాయని, ప్రస్తుతం లాభాలను ఆర్జించుకుంటున్నామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. చలి కాలంలో మరింత డిమాండ్‌ వుంటుంది కాబట్టి.. అప్పుడు పెద్ద మొత్తంలో పంటను వేస్తామని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *