సాంప్రదాయ పంటలతో పాటూ పూల తోటలు సాగు చేయాలి : వ్యవసాయ శాస్తవేత్తలు
గిరిజన ప్రాంతాల రైతులు సంప్రదాయ పంటలతో పాటు పూల తోటలు కూడా సాగుచేయాలని, దీని ద్వారా అధిక లాభాలు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. హైదరాబాద్ పూల పరిశోధన స్థానం ఆధ్వర్యంలో గిరిజనులకు పూల పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీజన్ల వారిగా బంతి పూలతో పాటు ఇతర పూల తోటలు సాగు చేస్తే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. రైతులకు మార్కెట్లకు వెళ్లకుండా తోటల వద్దకే కొనుగోలుదారులు వస్తారని, దీని ద్వారా రైతులకు కూడా రవాణా ఖర్చులు తగ్గుతాయని సూచించారు. ప్రస్తుతం సంప్రదాయ పంటలతో పాటు పూల బిజినెస్ కూడా బాగా పెరిగిందని, వివిధ రకాల పూలను సాగు చేసుకోవచ్చని తెలిపారు. చివరగా సాగుకు సంబంధించిన పుస్తకాలు, జీవన ఎరువులను కూడా అధికారులు రైతులకు ఉచితంగా అందజేశారు.