విదేశీ నియంత్రణ గల కంపెనీలు ‘‘విదేశీ’’ కంపెనీలే!

భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌, ‘‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’’ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్న దృష్ట్యా దేశంలో విదేశీ నియంత్రణ కంపెనీలు అన్నింటిని ‘‘విదేశీ’’ కంపెనీలుగానే పరిగణించాలని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జెఎం) స్పష్టం చేసింది. భారతీయ స్టార్టప్‌ల విదేశీ నియంత్రణపై ‘‘ఫ్లిప్పింగ్‌’’ ద్వారా దృష్టి సారించి, అలాంటి భారతీయ కంపెనీలను ‘‘విదేశీ’’గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

ఉదాహరణగా, ఫ్లిప్‌కార్ట్‌ అటువంటి సంస్థ అని పేర్కొంటూ, ‘‘ఫ్లిప్పింగ్‌’’ వాల్‌మార్ట్‌ నియంత్రణలో పనిచేస్తున్నదని తెలిపింది. ‘‘ఇద్దరు భారతీయ యువకులు యునికార్న్‌ (ఫ్లిప్‌కార్ట్‌) తయారు చేశారని చెప్పడం మనకు గర్వంగా ఉంటుంది, ఇది చివరికి 20 బిలియన్ల అమెరికా డాలర్ల మార్కెట్‌ విలువను సాధించింది. అయితే వాస్తవం ఏమిటంటే ఫ్లిప్‌కార్ట్‌ ప్రమోటర్లు భారత్‌ నుండి దూరంగా సింగపూర్‌ కు వెళ్లి తమ కంపెనీని, అనుబంధ కంపెనీలను అక్కడ నమోదు చేసుకున్నారు’’ అని గుర్తు చేసింది.

కాగా, సింగపూర్‌లోని తమ కంపెనీ, అనుబంధ కంపెనీలను వాల్‌మార్ట్‌కు 77 శాతం వాటాల బదిలీ ద్వారా విక్రయించారు. ఆ కంపెనీ విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లడమే కాకుండా, భారత్‌ లోని రిటైర్‌ మార్కెట్‌ వాటాను సహితం నిశబ్ధంగా ఆ విదేశీ కంపెనీకి బదిలీ చేశారని ఎస్‌జెఎం జాతీయ కో-కన్వీనర్‌ డాక్టర్‌ అశ్విని మహాజన్‌ తెలిపారు.

ఫ్లిప్పింగ్‌ అనేది ఆదాయాన్ని సృష్టించే ఆస్తిని కొనుగోలు చేసి, వెంటనే లాభానికి త్వరగా తిరిగి అమ్మడం గురించి వివరించడానికి అమెరికాలో ఉపయోగించే పదం. ఎస్‌ జె ఎం ప్రకారం, ఒక భారతీయ కంపెనీని విదేశీ కంపెనీలో విలీనమై, తర్వాత అది భారతదేశంలో అనుబంధ సంస్థను కలిగి ఉంటుంది.‘‘భారతదేశంలో ప్రారంభమైన భారతీయ వ్యవస్థాపకులను కలిగి ఉన్న అనేక వందల భారతీయ యునికార్న్‌లు ఇప్పుడు ఫ్లిప్పింగ్‌ కు గురయ్యాయి లేదా విదేశీ కంపెనీలలో విలీన మయ్యాయి. వాటిలో, అత్యధికం భారతదేశంలో కార్యకలాపాలు, ప్రాథమిక మార్కెట్‌ ఉన్నాయి. దాదాపు అందరూ తమ మేధో సంపత్తిని (ఐపి) భారతీయ వనరులను (మానవ, మూలధన ఆస్తులు, ప్రభుత్వ మద్దతు మొదలైనవి) ఉపయోగించి అభివృద్ధి చేశారు’’ అని మహాజన్‌ చెప్పారు.   ‘‘భారతదేశం నుండి 90 శాతంకు పైగా విలువ సృష్టించినప్పటికీ, భారతీయ కంపెనీ విదేశీ కార్పొరేషన్‌ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా మారడం వలన విపరీతమైన ఆర్థిక, జాతీయ నష్టానికి దారితీస్తుంది’’ అని మహాజన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

దేశీయ పారిశ్రామికవేత్తల కన్నా ఇటువంటి విధానం విదేశీ పెట్టుబడిదారులకు అన్యాయమైన ప్రయోజనాన్ని కూడా ఇస్తుందని ఎస్‌జెఎం ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘విదేశీయులకు భారతదేశం రెడ్‌ కార్పెట్‌ చుట్టి, స్వదేశీయులకు రెడ్‌ టేప్‌ చూపించడానికి ఫ్లిప్పింగ్‌ సరైన ఉదాహరణ. వివిధ రాష్ట్రాలలో భూ కేటాయింపుల సమయంలో విదేశీ సంస్థలు మినహాయింపులను పొందుతాయి. అయితే స్వదేశీయులను తమను తాము రక్షించుకోవడానికి వదిలివేస్తున్నారు’’ అని ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *