కుంభమేళాలో స్వచ్ఛగాలి కోసం చిట్టడివి… జపాన్ టెక్నాలజీతో రూపొందించిన సర్కార్
ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే 10 కోట్లకు పైగా మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. విదేశీయులు కూడా భారీ సంఖ్యలో కుంభమేళాకి ఆకర్షితులవుతున్నారు. ఇక ఈనెల 29వ తేదీన మౌనీ అమావాస్య సందర్భంగా ఆ ఒక్క రోజే 10 కోట్లమంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం 45 రోజులు జరగనున్న ఈ మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోట్లాది మంది భక్తుల కోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కోట్లాది మంది భక్తులు ఒకే దగ్గరికి వచ్చినా ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ నగర్‌లో వారంతా స్వచ్ఛమైన గాలిని పీల్చుతున్నారు.
ఈ స్వచ్ఛమైన గాలి కోసం మియావాకి అనే జపాన్ టెక్నాలజీని యూపీ ప్రభుత్వం ఉపయోగించింది. దీనికి సంబంధించి రెండేళ్ల క్రితమే కసరత్తు చేసిందని అధికారులు పేర్కొంటున్నారు. కోట్లలో జనం వస్తున్న నేపథ్యంలో గాలి కలుషితం కాకుండా ఈ మేరకు యూపీ ప్రభుత్వం ఈ కీలక కసరత్తు చేసింది. జపాన్ టెక్నాలజీతో ఓ అడవి లాంటి ప్రాంతాన్నే సృష్టించిందని చెప్పవచ్చు. ప్రయాగ్ రాజ్ లోని 10 ప్రాంతాల్లో 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా దాదాపు 63 రకాల మొక్కలు నాటారు. ఆ మొక్కలే ఇప్పుడు ఎదిగి, ప్రతిరోజూ స్వచ్ఛమైన ఆక్సిజన్ ను వాతావరణంలోకి వస్తోంది. దీని కోసం దాదాపు 6 కోట్లు ఖర్చయ్యాయి. ఈ ప్రాజెక్టులో మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, వెదురు తో సహా వివిధ రకాల చెట్లున్నాయి.
దీని ద్వారా పారిశ్రామిక వ్యర్థాలను వదిలించుకోవడానికి సహాయం చేయడమే కాకుండా దుమ్ము, ధూళి, దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. అలాగే గాలి నాణ్యత తగ్గకుండా… ఆ నాణ్యను మెరుగుపరుస్తుంది.
మియావాకీ టెక్నాలజీ అంటే ఏమిటంటే…
1970 దశకంలో జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకీచే రూపొందించబడింది. మియావాకీ అనే పద్ధతి చిన్న చిన్న, పరిమిత ప్రదేశాలలో వేగంగా అటవీ ప్రాంత అభివృద్ధికి ఓ రకమైన ప్రక్రియ. దీనిని పాట్ ప్లాంటేషన్ పద్ధతి అని పిలుస్తారు. అత్యంత వేగంగా చెట్లను నాటుతారు. ఈ సాంకేతిక ప్రక్రియ సహజ అడవులను స్థానికంగా వుండే జాతుల మిశ్రమంతో పెరుగుతుంది. జీవ వైవిధ్యం, నేల నాణ్యతను కూడా పెంచుతుంది. సంప్రదాయ అడవీ పెంపకం పద్ధతుల లాగా కాకుండా, మియావాకీ అడవులు 10 రేట్లు వేగంగా పెరుగుతాయి. ఎక్కువగా కార్బన్ ను గ్రహించి, జీవవైవిధ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అయితే… ఈ పద్ధతి ఎక్కువగా పట్టణ ప్రాంతాలకు సరిపోతాయి. స్థలం కొరత కారణంగా తక్కువ ప్రాంతంలో పర్యావరణాన్ని పునరుద్ధరించడానికి ఎంతో ఉపయోగకారి.
ఈ పద్ధతిని పలువురు పర్యావరణ ప్రముఖులు కూడా ఒప్పుకుంటున్నారు.అలహాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ వృక్షశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ ఎన్‌బి సింగ్ మాట్లాడుతూ, ఈ పద్ధతిలో పెరిగిన దట్టమైన అడవులు వేసవిలో ఉష్ణోగ్రతను 4 నుండి 7 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించగలవని పేర్కొన్నారు. పగలు మరియు రాత్రి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని తగ్గించి, జీవవైవిధ్యాన్ని గణనీయంగా పెంచుతుందని కూడా పేర్కొన్నారు. అలాగే జంతువులు, పక్షులకు నివాసాలు కూడా అవుతాయి. పర్యావరణ సమతౌల్యత కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఇక.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2023 లో జరిగిన మన్ కీ బాత్ లో ఈ పద్ధతిని ప్రస్తావించారు. ఒక కేరళ ఉపాధ్యాయుడు బంజరు భూమిని మినీ ఫారెస్ట్‌గా మార్చడానికి సాంకేతికతను ఉపయోగించిన ఉదాహరణను ఉదహరించారు.రఫీ రామ్‌నాథ్ తన ‘విద్యావనం’లో 115 రకాల చెట్లను నాటారని పేర్కొన్నారు. మరోవైపు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో, బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నగరంలోని బహిరంగ భూభాగాలలో మియావాకి అడవులను అభివృద్ధి చేస్తోంది.