రైతులకు ఉచితంగా సోలార్ పంపు సెట్ల పంపిణీ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సోలార్ పంప్ సెట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైతులకు సోలార్ పంప్ సెట్లు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. రైతులందర్నీ సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు కూడా. ఇందు కోసం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డి పల్లిలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు. సోలార్ పంపు సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్ తో రైతులకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు డిజైన్ చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంతో పాటు మామూలుగా కూడా సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చూడాలని విద్యుత్ అధికారులను కోరారు.
వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని, ఇందుకోసం ఏటా డిస్కమ్ లకు పెద్ద ఎత్తున సబ్సిడీ చెల్లిస్తున్నామన్నారు. రైతులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లను అందజేస్తే అటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందడంతో పాటు మిగులు విద్యుత్ తో రైతులకు ఆదాయం కూడా సమకూరుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. అటవీ భూములతో పాటు వివిధ శాఖలకు సంబంధించి వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వంట గ్యాస్ కి బదులుగా సోలార్ పవర్ విధానాన్నే ప్రోత్సహించాలని, దీని కోసం మహిళా సంఘాటలకు శిక్షణ ఇవ్వాలన్నారు. కొన్ని రోజుల్లోనే మహిళలను సోలార్ పవర్ బిజినెస్ వైపు ప్రోత్సహించాలన్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తోంది. ప్రతి ఇంటిపైనా సోలార్ ప్యానెల్ వుండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది కూడా. మరోవైపు రైతులు కూడా తమ వ్యవసాయంలో ఈ సోలార్ ఎనర్జీని వాడుతున్నారు. లాభాలు గడిస్తున్న రైతులు కూడా వున్నారు. కానీ… ఎక్కువ మొత్తంలో రైతులు ఈ సోలార్ ఎనర్జీ వైపు రావడం లేదు. ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహకాలు, వారిని జాగృతం చేయాల్సిన అవసరం వుంది. సోలార్ ప్యానల్లను తేలికగా ఇంటిపైనే అమర్చుకోవచ్చు. లేదా… వ్యవసాయ భూమిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
మన దేశంలో 60 శాతం వ్యవసాయం మీదే ఆధారపడి వున్నారు. దేశ జీడీపీకి 18 శాతం ఈ రంగం నుంచే వస్తోంది. కానీ రైతులు ఎక్కువగా గ్రిడ్ కి అనుసంధానమైన విద్యుత్ పంప్ సెట్లపైనే ఆధారపడి వున్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లోని 20 శాతం వ్యవసాయానికి ఖర్చవుతోంది. ఈ రంగానికి తగినంత విద్యుత్ సరఫరా చేయడం కొన్ని రాష్ట్రాల్లో కష్టమవుతోంది కూడా. రైతులకు 24 గంటలూ విద్యుత్ అనేది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కావడం లేదు. వర్షాలు కూడా సరైన సమయానికి రావడం లేదు. వీటన్నింటి నుంచి రైతు గట్టెక్కాలంటే సోలార్ ఎనర్జీని ఉపయోగంలోకి తెచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవమ్ ఉత్తాన్ మహాభియాన్ కింద రైతులు తమ తమ పొలాల్లో సౌర శక్తితోనే విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవచ్చు.